పరిష్కారమేదీ...?

ABN , First Publish Date - 2021-10-19T05:17:27+05:30 IST

కలెక్టరేట్‌ స్పందనకు వచ్చే అర్జీదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

పరిష్కారమేదీ...?
స్పందనలో అర్జీలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

 స్పందనకు పదేపదే అవే అర్జీలు

 వచ్చినవారే మళ్లీ మళ్లీ.. రాక

 భారీగా పెరుగుతున్న అర్జీదారులు


ఏలూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌ స్పందనకు వచ్చే అర్జీదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా అర్జీదారుల తాకిడి ఎక్కువగా కనిపించింది. వచ్చిన  వారే తమ సమస్యలు పరిష్కారం కాక పదేపదే వస్తుండడంతో స్పందనకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంటోంది. ఈసారి అర్జీదారుల్లో కూడా పింఛను, ఇళ్ల స్థలాల బాధితులే ఎక్కువగా ఉండడం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 


 పింఛను వచ్చేదెప్పుడు?

కిందటివారం స్పందన కార్యక్రమంలో అందరికీ అయ్యో.. పాపం అనిపించిన, కంట తడిపెట్టించిన దివ్యాంగుడి పింఛను సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కాళ్లూ, చేతులు, శరీరమంతా చచ్చుపడిపోయి, మనోవైకల్యంతో సతమతమవుతున్న తల్లిదండ్రులను కోల్పోయి అవ్వా, తాతలే దిక్కయిన ఏలూరుకు చెందిన యల్లంశెట్టి ప్రభుదేవాకు కలెక్టర్‌ చెప్పినా పింఛను మాత్రం రాలేదు. దీంతో వారు ఈ వారం కూడా కలెక్టరేట్‌ తలుపు తట్టక తప్పలేదు. కలెక్టరుకు విన్నపాలు పెట్టుకోక తప్పలేదు. కానీ ఇప్పటికైనా ఈ విధివంచితుడికి పింఛను వస్తుందా లేదా అన్నదే అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న!


 ఎర్రంశెట్టి సూరమ్మది అదే పరిస్థితి

ఎర్రంశెట్టి సూరమ్మ కూడా కిందటి వారం స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు వినతి పత్రం అందించింది. అది పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ఆమె కూడా సోమవారం స్పందనకు రావలసి వచ్చింది. చేబ్రోలుకు చెందిన ఈమె ఇంటి స్థలాన్ని, ఎకరం పొలాన్ని అధికార పార్టీ పేరు చెప్పి   కొందరు ఆక్రమిస్తున్నారని, తనకు రక్షణ కల్పించమని కలెక్టర్‌ను ఆమె కోరింది. కానీ ఆమె సమస్యపై స్పందించినవారు లేరు. పోలీసు అధికారులు యథావిధిగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆమె మళ్లీ సోమవారం స్పందనలో అర్జీ పెట్టుకుంది. 


 ఆసరా అగచాట్లు.. 

తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లి గ్రామానికి చెందిన పల్లవి గ్రూపును ఆసరా సాయం తిప్పలు పెడుతోంది. ఆసరా గ్రూపులో పది మంది ఉండగా గ్రూపులోని 8 మందికి మాత్రమే ఆసరా సాయం ప్రకటించారు. మిగిలిన ఇద్దరికి ఆసరా సాయం అందలేదు. దీంతో పార్వతి అనే మహిళ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అధికారులు సమస్యను పరిషక్కరించకుండా, వచ్చిన సాయాన్ని పదిమంది సమానంగా పంచుకోండి అని చెప్పి దులుపుకుంటున్నారు. దీంతో ఆమె కలెక్టర్‌కు తన గోడు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో జేసీలు బీఆర్‌ అంబేడ్కర్‌, హిమాన్షు శుక్లా, సూరజ్‌ గానోరె, పద్మావతి, డీఆర్‌వో డేవిడ్‌ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

అర్థవంతమైన పరిష్కారం కావాలి : కలెక్టర్‌

స్పందన అర్జీలకు అర్థవంతమైన పరిష్కారం అధికారులు చూపాలి. ఎంతో నమ్మకంతో వచ్చే అర్జీదారులకు పరిష్కారం చూపి వారి నమ్మకం నిలబెట్టాలి. అప్పుడే అర్జీదారులు అదే సమస్యపై మళ్లీ రావాల్సిన అవసరం ఉండదు.

Updated Date - 2021-10-19T05:17:27+05:30 IST