అమూనిల్‌

ABN , First Publish Date - 2022-05-24T06:19:03+05:30 IST

జిల్లాలో పాలిచ్చే ఆవులు 12,769, గేదెలు 54,669 మొత్తం 67,468 ఉన్నాయి.

అమూనిల్‌

కానరాని ఆదరణ.. ప్రైవేటు కేంద్రాల వైపే రైతుల మొగ్గు
 జిల్లాలో రోజు 2,52,369 లీటర్ల పాలు
 అమూల్‌కు కేవలం 750 లీటర్లే తరలింపు
 ఆసక్తి చూపని పాడి రైతులు
 నిరుపయోగంగా ఉమ్మడి జిల్లాలోని  20 ప్రభుత్వ పాల శీతల కేంద్రాలు


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ వెలవెల బోతోంది. అమూల్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పాలను సేకరిస్తోంది. అయితే అమూల్‌ డెయిరీలకు జిల్లాలో ప్రాధాన్యం కొరవడింది. కేవలం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల నుంచే పాలను సేకరిస్తున్నారు. జిల్లాలో అమూల్‌ పాలకేంద్రం పాయింట్‌ లేకపోవడంతో సేకరించిన పాలను ఏలూరు జిల్లా జి.కొత్తపల్లికి తరలిస్తున్నారు. అమూల్‌ డెయిరీలకు పాలు పోసేందుకు పాడి రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు వారిని బుజ్జగించేందుకు ఆపసోపాలు పడుతున్నా ఫలితం కానరావడం లేదు.


తాడేపల్లిగూడెం అర్బన్‌, మే 23: జిల్లాలో పాలిచ్చే ఆవులు 12,769, గేదెలు 54,669 మొత్తం 67,468 ఉన్నాయి. ప్రతీరోజు 2,52,369 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో చుట్టుపక్కల ఇంటింటా పాలు వేసేందుకు, చిన్న కేంద్రాలు, తదితర అవసరాలకు 1,82,176 లీటర్లు అవుతుండగా ప్రైవేటు పాల కేంద్రాలకు 62,653 లీటర్లు సరఫరా అవుతున్నాయి. కేవలం ప్రతీరోజు 750 లీటర్లు మాత్రమే అమూల్‌ కేంద్రానికి తరలుతున్నాయి.  తాడేపల్లిగూడెం రూరల్‌ పరిధిలోని చినతాడేపల్లి, కడియద్ద, కొమ్ముగూడెం, వెంకట్రామన్నగూడెం, నీలాద్రిపురం, కృష్ణయ్యపాలెం గ్రామాల నుంచి ఈ 750 లీటర్లు సేకరించి అమూల్‌ కేంద్రానికి తరలిస్తున్నారు.

రైతులలో కానరాని ఆసక్తి
ఇతర కేంద్రాల కంటే లీటరుకు అదనంగా రూ.3.50 అమూల్‌ పాలసేకరణకు ఇస్తున్నా పాలు పోసేందుకు రైతు లు ఆసక్తి చూపడం లేదు. దీనికి నిబంధనలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమూల్‌ కేంద్రాల్లో పాల సేకరణ చేసిన రైతులకు 10 రోజులకు సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు వారం లేదా పది రోజులకు ఒకసారి నగదు రూపంలో నేరుగా రైతులకు అందజేస్తుంటారు. నాలుగు నెలలకు ఒకసారి 4 శాతం బోనస్‌గా అందజేస్తున్నారు. అమూ ల్‌ డెయిరీలో బోనస్‌లు ఇస్తామని చెప్పినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.

  ఉమ్మడి జిల్లాలో 20 పాల శీతల కేంద్రాలు
ప్రభుత్వం రైతుల నుంచి పాలు సేకరించే ప్రతిపాదన ఇప్పటిది కాదు. పన్నెండు ఏళ్ల క్రితమే మొదలయ్యింది. 2009–10లో రైతుల వద్ద నుంచి పాలను సేకరించేందుకు అప్పుటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 20 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రానికి మొత్తం మిషనరీతో  సుమారు రూ.54 లక్షలు వెచ్చించింది. ఇప్పటి ఏలూరు, పశ్చిమ జిల్లాల్లోని  పెంటపాడు, గణపవరం, నిడమర్రు, ఇరగవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ధర్మాజీగూడెం, పాలకొల్లు, నరసాపురం, కొయ్యలగూడెం, పోలవరం, అచంట, యలమంచిలి, మొగల్తూరు, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, పెదపాడు, పూళ్ళ, పోడూరు మండలాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలన్నీ ఉపయోగం లేకుండా మరుగున పడిఉన్నాయి. పలుమార్లు అధికారులు ఈ కేంద్రాలను వాడుకలోకి తీసుకొద్దామని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు అమూల్‌ కేంద్రాలూ ఇదేబాట పడుతున్నాయి. రెండు, మూడు రూపాయలు తక్కువైనా రైతులు నేరుగా సొమ్ము చేసుకునేందుకే మక్కువ చూపించమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక అధికారులు ఎంత ప్రయాసలు పడినా.. ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు సాగించినా రైతులు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా అమూల్‌ పాల కేంద్రాలకు ఆదరణ అంతంత మాత్రంగానే లభిస్తోంది.

Updated Date - 2022-05-24T06:19:03+05:30 IST