‘నిసర్గ’ తుపాను సహాయ కార్యక్రమాలకు వెస్టర్న్ నావల్ కమాండ్ సమాయత్తం

ABN , First Publish Date - 2020-06-03T01:27:57+05:30 IST

రుతు పవనాలు, ‘నిసర్గ’ తుపాను వల్ల ఏర్పడే అవకాశం ఉన్న అత్యవసర

‘నిసర్గ’ తుపాను సహాయ కార్యక్రమాలకు వెస్టర్న్ నావల్ కమాండ్ సమాయత్తం

ముంబై : రుతు పవనాలు, ‘నిసర్గ’ తుపాను వల్ల ఏర్పడే అవకాశం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు వెస్టర్న్ నావల్ కమాండ్ సర్వసన్నద్ధమైంది. వరద సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన అన్ని హంగులను సిద్దం చేసింది. 


‘నిసర్గ’ తుపాను వల్ల ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే, తక్షణమే స్పందించేందుకు, సహాయపడేందుకు, బాధితులను కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. పశ్చిమ తీరంలోని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కుదుర్చుకుని, సహాయ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దంగా ఉంది. 


వెస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వెస్టర్న్ నావల్ కమాండ్, పశ్చిమ తీరంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసేందుకు అన్ని ఏర్పాటు జరిగాయి. వరద సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన నిపుణులను సిద్ధంగా ఉంచాయి. మహారాష్ట్ర నావల్ ఏరియాలో 5 వరద సహాయక బృందాలను, మూడు డైవింగ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈ బృందాలు ఈ వర్షాకాలం మొత్తం అందుబాటులో ఉంటాయి. సత్వరమే స్పందించేందుకు వీలుగా ఈ బృందాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మోహరించారు. సహాయపడేందుకు అవసరమైన అన్ని పరికరాలు, వనరులు ఈ బృందాల వద్ద ఉన్నాయి. విపత్కర పరిస్థితుల్లో సహాయపడటంలో వీరికి శిక్షణ ఇచ్చారు. 


వరద ప్రభావానికి గురయ్యే అవకాశంగల ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 


కార్వార్, గోవా, డామన్, డయ్యూ నావల్ ఏరియాలలో కూడా ఇదేవిధమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఏరియా స్టేషన్  నావికాదళ కమాండర్లు సంబంధిత రాష్ట్ర అధికారులతోనూ, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ అధికారులతోనూ సంప్రదిస్తూ ఉంటారని తెలిపారు. 


ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హోసలికర్ మాట్లాడుతూ, పెను తుపాను ‘నిసర్గ’ బుధవారం మధ్యాహ్నానికి మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకనుందని తెలిపారు. హరిహరేశ్వర్, డామన్ మధ్యలో అలీబాగ్ సమీపంలో తీరాన్ని తాకుతుందని తెలిపారు. ఈ తుపాను ప్రస్తుతం పంజిమ్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 280 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ముంబై నుంచి దక్షిణ-నైరుతి దిశలో 430 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. 


ముంబై నుంచి దక్షిణ దిశలో 94 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను తీరాన్ని తాకుతుందని తెలిపారు. గంటకు సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఈ గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు  పెరగవచ్చునని చెప్పారు. ఈ పెను తుపాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.



Updated Date - 2020-06-03T01:27:57+05:30 IST