Abn logo
Jul 13 2020 @ 03:46AM

భళా.. బ్లాక్‌వుడ్‌ వారెవా.. విండీస్

తొలి టెస్టులో ఘనవిజయం 

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 313

ఆఖరి రోజు సరిగ్గా 200 పరుగుల లక్ష్యం.. మరీ సులువైనదనీ చెప్పలేం.. అలాగని అసాధ్యమూ కాదు. ఇరు జట్లకు సమాన అవకాశాలు కనిపించిన వేళ.. పర్యాటక వెస్టిండీస్‌ జట్టు ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుత పోరాటం ప్రదర్శించింది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పుడు ఇక విండీస్‌ కథ ముగిసినట్టేనని అంతా భావించారు. అయినా పట్టువదలని బ్లాక్‌వుడ్‌ ఒంటరి పోరాటం అద్భుత విజయాన్ని అందించింది. ఇక కరోనా కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ టెస్టు అటు అభిమానులను కూడా విశేషంగా అలరించడం విశేషం..

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీ్‌సలో వెస్టిండీస్‌ ఘనంగా బోణీ చేసింది. అంచనాలకు మించి ఆల్‌రౌండ్‌ షోను కనబరుస్తూ ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో కంగు తినిపించింది. 200 పరుగుల లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీ్‌సకు మిడిలార్డర్‌లో జెర్మెయిన్‌ బ్లాక్‌వుడ్‌ (95) అండగా నిలిచాడు. అతడికి చేజ్‌ (37) సహకరించగా 64.2 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి నెగ్గింది. ఆర్చర్‌కు మూడు, స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 284/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ 111.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ఆర్చర్‌ (23) రాణించడంతో జట్టుకు 199 పరుగుల ఆధిక్యం లభించింది. గాబ్రియెల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గాబ్రియెల్‌ నిలిచాడు.

7 పరుగులకే రెండు వికెట్లు..: విజయం ఓవైపు ఊరిస్తుండగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీ్‌సకు వరుస ఓవర్లలో పేసర్‌ ఆర్చర్‌ షాకిచ్చాడు. ఆరో ఓవర్‌లోనే బ్రాత్‌వైట్‌ (4)ను బౌల్డ్‌ చేసిన తను ఆ తర్వాత బ్రాక్స్‌ను డకౌట్‌ చేయడంతో విండీస్‌ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే అంతకుముందు రెండో ఓవర్‌లోనే ఆర్చర్‌ యార్కర్‌ ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ కాలికి తగిలి గాయం కావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో టాపార్డర్‌ను కోల్పోయిన విండీస్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో హోప్‌ (9) రెండు బౌండరీలతో కాస్త జోష్‌ నింపాడు. కానీ 12వ ఓవర్‌లో మార్క్‌ వుడ్‌ అతడిని బౌల్డ్‌ చేయడంతో లంచ్‌ విరామానికే కరీబియన్లు 35/3 స్కోరుతో ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు.

విజయం వైపు పయనం..: విరామం తర్వాత విండీస్‌ ఆటతీరు మారింది. చేజ్‌-బ్లాక్‌వుడ్‌ జోడీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంగ్లండ్‌ బౌలర్లను ఆడుకున్నారు. దీనికి తోడు బ్లాక్‌వుడ్‌ క్యాచ్‌లను బట్లర్‌, బర్న్ప్‌ మిస్‌ చేయడంతోపాటు చేజ్‌ రనౌట్‌ను క్రాలే విఫలం చేయడం కూడా కలిసివచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ లక్ష్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. దీంతో చూస్తుండగానే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అయితే డ్రింక్స్‌ తర్వాత మరోసారి ఆర్చర్‌ దెబ్బతీశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీస్తూ 36వ ఓవర్‌లో చేజ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అతడి గ్లోవ్స్‌కు తాకిన బంతిని బట్లర్‌ సులువుగా అందుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌కు 73 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. అయితే బ్లాక్‌వుడ్‌ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ 89 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేశాడు. మొత్తంగా రెండో సెషన్‌లో విండీస్‌ 30 ఓవర్లలో 108 పరుగులతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచగలిగింది.

సునాయాసంగా..: ఇక, ఆఖరి సెషన్‌లో విండీస్‌ విజయానికి మరో 57 పరుగులు అవసరం కాగా చేతిలో ఆరు వికెట్లున్నాయి. దీంతో స్వేచ్ఛగా ఆడగలిగింది. డౌరిచ్‌ (20)తో కలిసి ఐదో వికెట్‌కు బ్లాక్‌వుడ్‌ 68 రన్స్‌ జత చేశాడు. ఆ తర్వాత హోల్డర్‌తో కలిసి తను జట్టును విజయం అంచులకు తీసుకెళ్లాడు. సాధికారిక షాట్లతో చెలరేగుతూ సెంచరీ వైపు కదిలాడు. అయితే, శతకానికి మరో ఐదు పరుగుల దూరంలో స్టోక్స్‌ అతడిని అవుట్‌ చేసినా.. అప్పటికి విండీస్‌ గెలుపు కోసం మరో 11 పరుగుల దూరంలోనే ఉండడంతో సునాయాసంగా మ్యాచ్‌ను ముగించింది.


ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పట్టికలో విండీ్‌సకిదే తొలి విజయం కావడంతో 40 పాయింట్లు లభించాయి.


ఇంగ్లండ్‌ గడ్డపై విండీస్‌ ఓ టెస్టు మ్యాచ్‌ గెలవడం 2000వ సంవత్సరం తర్వాత ఇది రెండోసారి మాత్రమే.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:204; విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 318; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 313

విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (బి) ఆర్చర్‌ 4; క్యాంప్‌బెల్‌ (నాటౌట్‌) 8; హోప్‌ (బి) వుడ్‌ 9; బ్రూక్స్‌ (ఎల్బీ) ఆర్చర్‌ 0; చేజ్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 37; బ్లాక్‌వుడ్‌ (సి) అండర్సన్‌ (బి) స్టోక్స్‌ 95; డౌరిచ్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 20; హోల్డర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 64.2 ఓవర్లలో 200/6. వికెట్ల పతనం: 1-7, 2-7, 3-27, 4-100, 5-168, 6-189.

బౌలింగ్‌: అండర్సన్‌ 15-3-42-0; ఆర్చర్‌ 17-3-45-3; వుడ్‌ 12-0-36-1; బెస్‌ 10-2-31-0; స్టోక్స్‌ 10.2-1-39-2.

Advertisement
Advertisement
Advertisement