Axar Patel: అక్షర్.. సిక్సర్.. విండీస్‌తో రెండో వన్డేలో టీమిండియానే విన్నర్.. సిరీస్ కూడా మనదే బ్రదర్..

ABN , First Publish Date - 2022-07-25T11:02:01+05:30 IST

లక్ష్యం చూస్తే కొండంత ఉంది. ఆ 28 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్‌కు దిగే సమయానికి 102 పరుగులు చేస్తే గానీ జట్టు విజయతీరాలకు చేరే పరిస్థితి లేదు. కానీ.. ఆ ఆల్‌రౌండర్ భయపడలేదు. కరేబియన్ గడ్డపై కొదమ సింహంలా..

Axar Patel: అక్షర్.. సిక్సర్.. విండీస్‌తో రెండో వన్డేలో టీమిండియానే విన్నర్.. సిరీస్ కూడా మనదే బ్రదర్..

లక్ష్యం చూస్తే కొండంత ఉంది. ఆ 28 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్‌కు దిగే సమయానికి 102 పరుగులు చేస్తే గానీ జట్టు విజయతీరాలకు చేరే పరిస్థితి లేదు. కానీ.. ఆ ఆల్‌రౌండర్ భయపడలేదు. కరేబియన్ గడ్డపై కొదమ సింహంలా గర్జించాడు. ‘అతనికి మీరు ఎదురెళ్లకండి సార్’.. అన్నంతలా బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో జట్టు విజయంపై ఆశలు పెంచాడు. ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు చేస్తేనే నీ జట్టు గెలుస్తుందని ప్రత్యర్థులు గుర్తుచేసినా అతనిలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదు. ‘ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా.. పద చూసుకుందాం’ అని తనకు తాను చెప్పుకున్నాడు. బరిలోకి దిగాడు. తొలి బంతికి షాట్ కొట్టేందుకు యత్నించాడు. కుదరలేదు. రెండో బంతికి మళ్లీ ప్రయత్నించాడు. ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 


ఇంకా.. జట్టు గెలవాలంటే నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాలి. ఒక్క పరుగు చేసి తనకు బ్యాటింగ్ ఆడే అవకాశం ఇవ్వమని తోటి ఆటగాడికి చెప్పాడు. అదృష్టవశాత్తూ అతను అనుకున్నదే జరిగింది. బ్యాటింగ్ చేసిన తోటి ఆటగాడు ఒక్క పరుగు చేసి ఇతనికి ఆడే అవకాశం తీసుకొచ్చాడు. మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. ఏమాత్రం అటూఇటూ అయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకవేళ అతని వికెట్ కోల్పోతే ఆ తర్వాత ఆడే బ్యాట్స్‌మెన్స్ అంటూ ఎవరూ లేరు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షిస్తున్న వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మూడు బంతుల్లో ఆరు పరుగులు చేస్తాడా లేక షాట్‌కు యత్నించి వికెట్ కోల్పోతాడా.. ఇవి రెండే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచేయసాగాయి. ఇంతలో నాలుగో బంతి పడే సమయం రానే వచ్చింది. ఆ నాలుగో బంతి ఫుల్ టాస్‌ వస్తే అస్సలు వదులుకునేందుకు సిద్ధంగా లేని ఆ 28 ఏళ్ల యువకుడు ఫుల్ టాస్‌గా వచ్చిన బంతిని చాచి కొట్టాడు. 


ఇంకేముంది.. ఒక్క బంతికి ఆరు పరుగులు వచ్చేశాయి. రెండు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా (Team India) విజయ తీరాలకు చేరింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను (IND vs WI ODI Series) కైవసం చేసుకుంది. టీమిండియా శిబిరంలో సంబరాలే సంబరాలు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు మైదానంలోనే ఊహించని విధంగా ఎదురైన ఓటమి కారణంగా కుప్పకూలిపోయారు. వరుసగా రెండో ఓటమే కాదు సిరీస్‌ను కూడా కోల్పోయారు. ఇంతకీ టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన ఆ యువ ఆటగాడెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే విధంగా అద్భుతంగా ఆడిన ఆ యువ కెరటమే అక్సర్ పటేల్ (Axar Patel). బ్యాట్స్‌మెన్స్ అంతా తలా ఒక చేయి వేసినప్పటికీ అక్సర్ పటేల్ చేసిన 64 పరుగులే రెండో వన్డేలో (West Indies vs India 2nd ODI) టీమిండియా గెలుపునకు (Team India Win) కారణమయ్యాయని చెప్పక తప్పదు. అక్సర్ పటేల్ 35 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టుపై (West Indies) టీమిండియా (Team India) 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని (312 Target) 49.4 ఓవర్లలోనే ఛేదించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 



తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు ఆత్మ విశ్వాసంతోనే ఆడింది. హోప్ (Shai Hope) 135 బంతుల్లో 115 పరుగులు చేసి సెంచరీతో జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) కూడా 77 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మేయెర్స్ (Kyle Mayers) 39 పరుగులు, బ్రుక్స్ (Shamarh Brooks) 35 పరుగులతో రాణించాడు. దీంతో.. నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల స్కోర్ చేసింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48 పరుగుల వద్ద ఓపెనర్ ధావన్ (Shikhar Dhawan) వికెట్‌ను కోల్పోయింది. 31 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి గబ్బర్ తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 43 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) 9 పరుగులకే మేయెర్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) 71 బంతుల్లో 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా (Team India) నాలుగు వికెట్లు కోల్పోయే సమయానికి 178 పరుగులు చేయగలిగింది.



సంజూ శాంసన్ (Sanju Samson) కూడా 54 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి చెప్పుకోతగ్గ ఆటతీరును కనబరిచాడు. దీపక్ హుడా (Deepak Hooda) 36 బంతుల్లో 33 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. అవీష్ ఖాన్ (Avesh Khan) చేసింది 10 పరుగులే అయినప్పటికీ కీలక సమయంలో వచ్చిన ఆ పరుగులు కూడా జట్టు విజయానికి దోహదపడ్డాయి. అక్సర్ పటేల్ (Akshar Patel) జట్టుకు వెన్నుదన్నుగా నిలిచి 64 పరుగులు చేసి నాటౌట్‌గా సత్తా చాటాడు. టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే గెలుపును అందించాడు. 8 వికెట్ల నష్టానికి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్‌కు రెండు వికెట్లు, మేయెర్స్‌కు రెండు వికెట్లు, హోసేన్, సీల్స్, షెఫర్డ్‌కు తలో వికెట్ దక్కింది. సంజూ శాంసన్ రనౌట్ కావడం గమనార్హం. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో రాణించగా, దీపక్ హుడా, అక్సర్ పటేల్, చాహల్‌ తలో వికెట్ తీశారు. మరపురాని ఇన్నింగ్స్‌తో అద్భుతంగా రాణించిన అక్సర్ పటేల్‌కు (64 నాటౌట్) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

Updated Date - 2022-07-25T11:02:01+05:30 IST