భలే చాన్సులే!

ABN , First Publish Date - 2020-07-16T09:24:33+05:30 IST

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. సిరీస్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు షాక్‌ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, సౌతాంప్టన్‌లో

భలే చాన్సులే!

విండీస్‌కు అద్భుత అవకాశం

ఒత్తిడిలో ఇంగ్లండ్‌

నేటి నుంచి రెండో టెస్టు


లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన తొలి  క్రికెట్‌ మ్యాచ్‌ ప్రేమికులకు మస్తు మజాను అందించింది. ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపింది. అయితే, బ్లాక్‌వుడ్‌ పోరాటంతో విండీస్‌.. ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిస్తూ మూడు టెస్టుల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. దీంతో గురువారం నుంచి జరిగే రెండో టెస్టుకు కరీబియన్‌ బృందం పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక.. 32 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు విండీస్‌కు ఇదే అద్భుత అవకాశం. అందుకే ఈ మ్యాచ్‌ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాలని ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. మరోవైపు సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ టెస్టు తప్పక నెగ్గాల్సిన  ఇంగ్లండ్‌కు కెప్టెన్‌ జో రూట్‌ తిరిగి రావడం సానుకూలాంశం.  


మాంచెస్టర్‌: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. సిరీస్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు షాక్‌ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, సౌతాంప్టన్‌లో సమష్టిగా పోరాడి అదరహో అనిపించింది. దీంతో సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. రెండో టెస్టులో నెగ్గడం ఇంగ్లండ్‌కు తప్పనిసరి. ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌పై విండీస్‌ ప్రదర్శన మెరుగ్గా ఉంది. గత ఆరు టెస్టుల్లో నాలుగింటిని విండీస్‌ నెగ్గడమే అందుకు ఉదాహరణ. కరీబియన్లు మరో విజయం సాధిస్తే విజ్డన్‌ ట్రోఫీ వారి సొంతమవుతుంది. రోజ్‌బౌల్‌ టెస్టులో టాస్‌ ఓడినా.. వెస్టిండీస్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ రాణించింది. ముఖ్యంగా పేసర్లు హోల్డర్‌, గాబ్రియెల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ మెరుగ్గా బ్యాటింగ్‌ చేసినా.. నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. 200 పరుగుల ఛేదనలో విండీస్‌ తడబడినా.. బ్లాక్‌వుడ్‌ పోరాటంతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులోనూ కరీబియన్లు ఇదే తరహా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ గాయపడడం ఒక్కటే విండీ్‌సను కలవరపెడుతోంది. మ్యాచ్‌ సమయానికి అతడు ఫిట్‌గా ఉంటే జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. 

ఆండర్సన్‌, వుడ్‌కు రెస్ట్‌.. బ్రాడ్‌, కర్రాన్‌ ఇన్‌

మరోవైపు ఇంగ్లండ్‌ తీవ్ర ఒత్తిడిలో ఉంది. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం ఆ జట్టుకు తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్‌ జో రూట్‌.. జో డెన్లీ స్థానంలో తిరిగి జట్టులోకి రానున్నాడు. కాగా, రెండో టెస్టుకు పేసర్లు ఆండర్సన్‌, మార్క్‌వుడ్‌కు విశ్రాంతి ఇచ్చారు. వాళ్ల స్థానంలో స్టూవర్ట్‌ బ్రాడ్‌, సామ్‌ కర్రాన్‌ను తీసుకుంటున్నట్టు జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. మొదటి టెస్టులో బ్రాడ్‌ను పక్కనబెట్టడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో బంతితోపాటు బ్యాట్‌తో రాణించిన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్థానానికి ఢోకా లేదు. ఇక బ్యాటింగ్‌ లోపాలను ఇంగ్లండ్‌ సరిదిద్దుకోవాల్సి ఉంది. 


32 ఇరుజట్ల ముఖాముఖి రికార్డులో గత ఐదు టెస్టుల్లో విండీస్‌ మూడు మ్యాచ్‌లు నెగ్గగా.. ఇంగ్లండ్‌ రెండింటిలో గెలిచింది.


మూడు దశాబ్దాల క్రితం..

వెస్టిండీస్‌ చివరిసారిగా 1998లో ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది.


జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: రోరి బర్న్స్‌, సిబ్లే, జో రూట్‌ (కెప్టెన్‌), క్రాలే, స్టోక్స్‌, పోప్‌, బట్లర్‌, బెస్‌, ఆర్చర్‌, బ్రాడ్‌, సామ్‌ కర్రాన్‌. 

వెస్టిండీస్‌: క్యాంప్‌బెల్‌, బ్రాత్‌వైట్‌, షాయ్‌ హోప్‌, బ్రూక్స్‌, చేజ్‌, బ్లాక్‌వుడ్‌, డౌరిచ్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), జోసెఫ్‌, రోచ్‌, గాబ్రియెల్‌. 

Updated Date - 2020-07-16T09:24:33+05:30 IST