క్రికెట్ కొత్తకొత్తగా..

ABN , First Publish Date - 2020-07-08T08:17:22+05:30 IST

మామూలుగానైతే ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదేమో. కానీ, కరోనాతో వచ్చిన విరామం ...

క్రికెట్ కొత్తకొత్తగా..

ఒకటా.. రెండా.. ఏకంగా 117 రోజులపాటు అంతర్జాతీయ క్రికెట్‌ మూగ

బోయింది. ఎటు చూసినా.. ఏ వార్త విన్నా వాయుదాల పర్వమే ఇన్నాళ్లూ మన చెవులకు వినిపించింది. ఎట్టకేలకు క్రికెట్‌ అభిమానుల ఎదురు

చూపులకు తెర పడింది. నేటి నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభం కాబోతోంది. అయితే ఇన్నాళ్లూ మనం చూసిన ఆట వేరు.. ఇక ఇప్పటి నుంచి వీక్షించబోయే క్రికెట్‌ వేరు. పూర్తి బయోసెక్యూర్‌ వాతావరణంలో తొలి టెస్ట్‌ మొదలవనుంది. దీంతో ఈ సిరీస్‌ సజావుగా సాగి ఇతర బోర్డులకు కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.


అంతర్జాతీయ సిరీ్‌సతో పునరాగమనం

నేటి నుంచి ఇంగ్లండ్‌తో వెస్టిండీస్‌ తొలి టెస్టు


సౌతాంప్టన్‌: మామూలుగానైతే ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదేమో. కానీ, కరోనాతో వచ్చిన విరామం తర్వాత ఈ మ్యాచ్‌లపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ఎందుకంటే రాబోయే సిరీ్‌సలకు ఇది మార్గదర్శకంగా నిలవనుంది. బుధవారం మొదలవనున్న తొలి టెస్టుకు సౌతాంప్టన్‌లోని రోజ్‌ బౌల్‌ స్టేడియం వేదిక కానుంది. పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. రెండు, మూడో టెస్టులు మాంచెస్టర్‌లో జరుగుతాయి. ఇంగ్లండ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు బెన్‌ స్టోక్స్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో విండీస్‌ 2-1తో నెగ్గింది. ఈ వికెట్‌పై ఇంగ్లండ్‌ ఆడిన మూడు టెస్టుల్లో.. రెండింటిలో నెగ్గింది. ప్రత్యర్థి వెస్టిండీ్‌సకు ఇక్కడ టెస్ట్‌లు ఆడిన అనుభవం లేదు.


బ్యాట్స్‌మెన్‌ కీలకం..

ఇరుజట్లలో బ్యాటింగ్‌ విభాగం ఫలితాన్ని నిర్దేశించనుంది. రెండు వైపులా పేస్‌ బౌలింగ్‌ కూడా శక్తివంతంగానే ఉంది. విండీస్‌ నుంచి ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ హోల్డర్‌, గాబ్రియెల్‌, రోచ్‌, జోసెఫ్‌ సత్తా చూపేందుకు ఎదురుచూస్తున్నారు. డారెన్‌ బ్రావో, హెట్‌మయెర్‌ ఈ టూర్‌ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. భారీకాయుడు కార్న్‌వాల్‌ జట్టులో ఏకైక స్పిన్నర్‌. మరోవైపు  కెప్టెన్‌ రూట్‌ లేకపోయినా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ విభాగానికి ఢోకా లేదు. అతడి స్థానంలో జో డెన్లీ తుది జట్టులో ఉండొచ్చు. బౌలింగ్‌లో అండర్సన్‌, బ్రాడ్‌, ఆర్చర్‌, మార్క్‌ ఉడ్‌ ఎవరికైనా ప్రమాదకారే. ఈ సిరీస్‌లో గెలిచిన జట్టుకు 40, మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే చెరి 13 పాయింట్లు లభిస్తాయి.


‘రోజ్‌ బౌల్‌’లో ఇలా..

ఈ మ్యాచ్‌ వేదికైన రోజ్‌ బౌల్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌ (2011)లో శ్రీలంకతో ఇంగ్లండ్‌ తలపడింది. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సమంగా రాణించారు. 2014, 2018 పర్యటనల్లో భారత్‌ ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడింది. ఓవరాల్‌గా ఇక్కడ 3 టెస్టులు జరగగా.. రెండుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది. మరో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.


జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్‌, సిబ్లే, క్రాలే, జో డెన్లీ, పోప్‌, బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌, అండర్సన్‌, బ్రాడ్‌/ఉడ్‌, ఆర్చర్‌, డామ్‌ బెస్‌.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌, క్యాంప్‌బెల్‌, బ్రూక్స్‌, హోప్‌, చేజ్‌/బ్లాక్‌ ఉడ్‌, డౌరిచ్‌, హోల్డర్‌, గాబ్రియెల్‌, కార్న్‌వాల్‌, జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌.

Updated Date - 2020-07-08T08:17:22+05:30 IST