India vs West Indies : తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్‌‌ ఆటగాళ్లకు ఫైన్.. కారణం ఇదే

ABN , First Publish Date - 2022-07-31T22:20:04+05:30 IST

ట్రినిడాడ్‌(Trinidad)లోని తరౌబా వేదికగా ఇండియా-వెస్టిండీస్ (India Vs Westindies) మధ్య తొలి టీ20 మ్యాచ్‌‌లో సమష్టిగా రాణించిన భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది.

India vs West Indies : తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్‌‌ ఆటగాళ్లకు ఫైన్.. కారణం ఇదే

తరౌబా : ట్రినిడాడ్‌(Trinidad)లోని తరౌబా వేదికగా ఇండియా-వెస్టిండీస్ (India Vs Westindies) మధ్య జరిగిన తొలి టీ20(T20) మ్యాచ్‌‌లో సమష్టిగా రాణించిన టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన ఆతిథ్య వెస్టిండీస్‌కు ఓటమి తప్పలేదు. అయితే అస్సలే పరాజయం బాధలో ఉన్న విండీస్ ఆటగాళ్లకు మరో షాక్ తగలింది. స్లో ఓవర్ రేటు (Slow Over rate) కారణంగా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ(ICC) ప్రకటించింది.  ఈ మేరకు  ఒక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఐసీసీ ఎలైట్ ప్యానల్ సభ్యుడు రిచీ రిచర్డ్సన్ ఈ జరిమానా విధించారు. నిర్దేశిత సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేశారు. పూర్తి ఓవర్లు పూర్తి చేయడానికి అదనపు సమయం కేటాయించాల్సి వచ్చిందని వివరించారు.


ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌లోని (ICC Code Of Conduct) 2.22 నిబంధనకు అనుగుణంగా జరిమానా విధించినట్టు ఐసీసీ తెలిపింది. ఓవర్ రేటు కనిష్ఠంగా ఉన్నప్పుడు ప్లేయర్లకు మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారు. నిర్దేశిత సమయం తర్వాత వేసే ప్రతి ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారని ఐసీసీ ప్యానల్ సభ్యులు వివరించారు. ‘ ఈ నేరాన్ని వెస్టిండీస్ కెప్టెన్ నికొలస్ పూరన్ కూడా అంగీకరించాడు. ప్రతిపాదత జరిమానాకు సమ్మతం తెలిపాడు. కాబట్టి వాదనలు వినాల్సిన అవసరం లేదు’ అని ఐసీసీ తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్స్ లెస్లీ రీఫర్, నిగెల్ డుగిడ్, థర్డ్ అంపైర్ గ్రెగరీ బ్రాట్‌వైట్, ఫోర్త్ అంపైర్ పాట్రిక్ గుస్టార్డ్ ఈ అభియోగాలను మోపారు.


కాగా తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దీంతో మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిల్ గుప్తిల్‌ను అధిగమించి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.

Updated Date - 2022-07-31T22:20:04+05:30 IST