Abn logo
Apr 11 2021 @ 00:23AM

పలకని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్లు

ఏలూరు ఫైర్‌స్టేషన్‌/ పెదవేగి, ఏప్రిల్‌ 10 : భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవలు అందకపోవడంతో ఆ నెట్‌వర్క్‌ ఫోన్లన్నీ మూగబో యాయి. ఉదయం నుంచి ఏ ఒక్క ఫోన్‌ కాల్‌ రాకపోయే సరికి వినియోగదారులు ఎవరూ ఫోన్‌ చేయడం లేదేమిటని అనుకున్నారు. ఫోన్‌ చేద్దామని ప్రయత్నిస్తుంటే కాల్‌ వెళ్లకపోవడం, వేరే నెట్‌వర్క్‌ నుంచి ఫోన్‌ చేయగా పనిచేస్తుండటాన్ని గుర్తించారు. ఫోన్లు పనిచేయక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ అంతరాయం ఏర్పడింది. గుంటూరులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ మెయిన్‌సెల్‌ సిగ్నల్‌ పాయింట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపమే దీనికి కారణమని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు చెప్పారు. సాయంత్రం వరకూ మరమ్మతులు చేస్తుండటంతో పరిస్థితి మెరుగైందని, రాత్రికి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కారణంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఈ నెట్వర్క్‌పై ప్రభావం పడిందని చెప్పారు. తహసీల్దారు, ఎంపీడీవో, ఎస్‌ఐ ఇలా మండలస్థాయి అధికారుల అధికారిక సెల్‌ నంబర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు సమాచారం రాక అవస్థలు పడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement