పంట..పండింది

ABN , First Publish Date - 2021-04-11T05:21:26+05:30 IST

దాళ్వా పంట పండింది.. అన్నదాత మోము మెరిసింది.

పంట..పండింది
భీమవరంలో పండిన చేను

అన్నదాతలకు కలిసొచ్చిన కాలం

భీమవరం రూరల్‌/ పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 10 :  దాళ్వా పంట పండింది.. అన్నదాత మోము మెరిసింది. కష్టానికి ఫలితం కళ్లెదుట కనిపిస్తోంది.  అనుకూల వాతావరణం, ముందస్తు సాగు కలిసి వచ్చింది. ఎటు చూసినా పంటలు బంగారు రంగులో కనిపిస్తున్నాయి.  దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం మండలంలో 12 వేల ఎకరాలు, పాలకొల్లు మండలంలో 4672 హెక్టార్లలో దాళ్వా సాగు చేపట్టారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోను పంట చివరి దశకు చేరుకుంది. మరో 15 రోజుల్లో మాసుళ్ళు మొదలయ్యే అవకాశం ఉంది.  చాలా ప్రాంతాల్లో కోతలు కూడా ఆరంభమైపోయాయి. పాలకొల్లు మండలం తిల్లపూడిలో కోతలు ఆరంభించారు.తక్కువ సమయంలో పండే 1056, 1150 వరి వంగడాలు ఎక్కువ సాగు చేయడంతో అధిక దిగుబడులు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఎకరానికి 45 నుంచి 50పైబడి బస్తాల దిగుబడి వస్తుందన్న అంచనాలో రైతులు ఉన్నారు. సార్వా నష్టపోవడంతో దాళ్వా గట్టెక్కిస్తుందని రైతులు చెబుతున్నారు. దాళ్వా సీజన్‌లో కూలీల రేట్లు అధికంగా ఉండడంతో వరి యంత్రాల సహాయంతోనే కోతలు కోయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

Updated Date - 2021-04-11T05:21:26+05:30 IST