Abn logo
Apr 11 2021 @ 00:20AM

ఎందుకీ మౌనం ..!

పప్పు, ఉప్పు దగ్గర నుంచి అన్ని ధరలు ఽపైపైకి

వంట చమురు మండిపోతోంది

పచ్చడి మిర్చి కిలో రూ.300 పైనే

స్టీలు, సిమెంటు ధరలతో గుండెపోటు

కేంద్ర, రాష్ట్రాలు బాదుడే బాదుడు

భరిస్తున్న జనం

నిలదీసే తత్వం ఏమైంది


(ఏలూరు– ఆంధ్రజ్యోతి) 

శ్రీనివాస్‌ చిన్న ప్రైవేటు ఉద్యోగి.. జీతం అవీ ఇవీ కలిపి చేతికి 15 వేలు దాకా వస్తుంది.. అతను ఎంత లెక్కలేసి ఖర్చు పెట్టినా నెల తిరిగేసరికి ఎంతో కొంత అప్పుకోసం చేయి చాచాల్సిన పరిస్థితి.. ఇంట్లో ఖర్చులు ఆదాయాన్ని మించిపోతుంటే దిక్కుతోచడం లేదు..ఇంటి అద్దె, కరెంటు బిల్లు, గ్యాస్‌ ఖర్చు సగం మింగేస్తోంది...కిరాణా కోసం గతంలో నాలుగు వేలుదాకా ఖర్చయ్యేది.. ఇప్పుడు అదే చీటీ పట్టుకెళ్లినా ఆరువేలు దాటుతోంది..అన్ని ధరలు పెరిగిపోవడంతో ఖర్చు రెట్టింపవుతోంది... ఆదాయమేమో అక్కడే ఉంది.. ఎవరికి చెప్పుకోవాలి..? ఏం చేయాలి..? ఇదీ  శ్రీనివాస్‌ ఆవేదన.. ధరల దరువుతో నలిగిపోతున్న అందరి పరిస్థితీ ఇదే..కానీ ఎవరూ నోరు మెదపడం లేదంతే...


మార్కెట్లోకి వెళ్లితే ఉప్పు..పప్పు కూడా భగ్గు మంటున్నాయి. కూరగాయల ధరలు దిగిరాలేదు. అంతో ఇంతో ఊరట అన్నట్లుగా ఒక్క ఉల్లి తప్ప.. మరోవైపు అన్ని వర్గాలను గుక్కపట్టించేలా ఆస్తిపన్నులు, భారీగా విద్యుత్‌ బిల్లులు..ఎటు కదిపినా బాదుడే. రాష్ట్ర స్ధాయిలో ఎప్పటికప్పుడు ధరలు నియంత్రించాల్సిన వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. మరోవైపు కేంద్రం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ఒకటేంటి ఏది వీలైతే దానిపై బాదేస్తోంది.. పెరిగిన ధరలతో మధ్య  తరగతి బడ్జెట్‌ తిరగబడింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం  నెలవారీ బడ్జెట్‌ ఐదు నుంచి 8 వేలు ఉండగా ఇప్పుడది 12 నుంచి 16 వేలకు పెరిగింది. ఇక మిగతా ఖర్చుల సంగతి సరేసరి. అడ్డు అదుపులేని వ్యవహారం మార్కెట్లను ముంచెత్తింది. అందుకనే ధరలు నియంత్రణ కోల్పోయాయి. వీటిని సమీక్షించేవారు లేరు... అడ్డుకునే వారు అంతకంటే లేరు. 


అడ్డుకునే వ్యవస్థలేవీ 

మధ్య తరగతి కుటుంబాలు ప్రభుత్వం విసురుతున్న వరాలు చూస్తే పొంగిపోతున్నాయి. కానీ మరోవైపు పెరుగుతున్న ధరలు  నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతున్నా ఎదురు తిరిగి ప్రశ్నించలేని పరిస్థితి. ఎవరో ఒకరు నిలదీయక పోతారా అనే ఒక భావన. వాస్తవానికి నిత్యావసర ధరలన్నీ గడిచిన కొంతకాలంగా పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. పప్పు, ఉప్పు ధరలు మారిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రావాల్సిన పప్పులు రవాణాలో స్వల్ప తగ్గుబాటుతో పప్పుల ధరలు ఏవీ బహిరంగ విపణిలో స్థిరంగా ఉండడం లేదు. ఒకప్పుడు కిలో కందిపప్పు ధర గ్రేడ్‌లను బట్టి 65 నుంచి 80 రూపాయలు పలికేది. కానీ ఇప్పుడు పప్పుల ధరలన్నీ  గరిష్ట స్థాయికి చేరాయి. మార్కెట్లో కిలో కందిపప్పు వందరూపాయలు తక్కువగానే లేదు. ఒకవైపు రేషన్‌లో కందిపప్పు తక్కువ ధరకు అందిస్తున్నా మార్కెట్లో మాత్రం అంగుళం కూడా తగ్గడం లేదు. పెసరపప్పు ధర దీనివెనుకే. ఎక్కడా ధరల నియంత్రణకు చర్యలే లేవు. నిత్యావసర మార్కెట్లో ధరల పెరుగుదల, తరుగుదలపై సమీక్షించాల్సిన యంత్రాంగం నీరుగారి పోయింది. మరోవైపు వంట నూనెల మంట మధ్య తరగతిని గుక్కపెట్టిస్తోంది. ఇంతకుమునుపు రిఫైండ్‌ ఆయిల్‌ ధర కిలో  100 రూపాయలలోపే ఉండేది. ఇప్పుడది 160 రూపాయలకు చేరుకుంది. పామాయిల్‌ కూడా ఇంతకుముందు రూ.90 ఉంటే ఇప్పుడు రూ.125కి చేరింది. ఇప్పుడు వచ్చేదంతా పచ్చళ్ళ సీజన్‌. బళ్ళారి రకం మిర్చి కిలో రూ.380 చెబుతున్నారు. మిగతా రకాలు కూడా రూ.200 పైమాటే...


రాష్ట్ర ప్రభుత్వానిది.. ఇంకోరకం బాదుడు 

వీలైతే దేన్ని వదలకుండా వీరబాదుడు బాదేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఈ మధ్య కాలంలోనే పెద్దగా ప్రజాభిప్రాయం సేకరించకుండానే ఏకంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించారు. దీనికితోడు ఇంతకుముందు ఒక నివాసంలో కరెంటు బిల్లు 500 నుంచి 600 రూపాయలు వచ్చేది. ఒకవేళ ఎవరైనా 250 యూనిట్లు దాటితే భారీగా చేతి చ మురు వదులుకోవాల్సిందే. ఇప్పుడు వేసవికాలం కావడంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువయ్యే తరుణంలోనే ఛార్జీలు పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు  ఇదొక పెద్ద షాక్‌. రిజిస్ట్రేషన్ల దగ్గర నుంచి సిమెంటు, స్టీలు వంటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలన్నింటికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే ఉంది. దీంతో సొంత ఇంటి నిర్మాణం పక్కన బెట్టి అద్దె ఇంటికే పరిమితం అవుతున్నారు. 


కేంద్రంలోనూ ఇదే పరిస్థితి 

రాష్ట్ర ప్రభుత్వం ఒక దాని వెంట ఒకటి వడ్డింపులకు దిగుతుండగా తానేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు కేంద్రం కూడా ఇదే ధోరణిలో ఉంది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గ్యాస్‌ బండ ధర వెయ్యి రూపాయలకు చేరువగా ఉంది. పెట్రోలు, డీజిల్‌ లీటరుకు వంద అంచున వేలాడతున్నాయి. ఇవన్నీ మరింతగా పెరిగి సెంచరీ దాటేందుకు మరెన్నో రోజులు పట్టకపోవచ్చు. కేంద్రం ఈ ధరల నియంత్రణలో పేదల పక్షాన నిలవాల్సింది పోయి ఏకంగా బాదుడికే సిద్ధమవుతోంది. దీనికంటే మించి నియం త్రణ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు సామాన్యుడు సజావుగా బతికేలా ఏ ఒక్క రంగంలోనూ సంస్కరణలు గాని, క్రమ శిక్షణ గాని లేకుండా పోయింది. 


అడ్డుకునేదెవరు..?

సంక్షేమ పథకాల వెల్లువలో నెలవారీ జీవితాన్ని ఇట్టే గడిపేస్తున్న మధ్య తరగతి కుటుంబాల్లో ఇప్పటికే అప్పు పెరిగింది. ఒక సాధారణ కుటుంబంలో సరాసరిన నెలకు ఐదు నుంచి 12 వేలు చొప్పున అదనపు అప్పు అవుతోంది. వాస్తవానికి ఇంతకుముందు కిలో ఉల్లిపాయ ధర 50–60 మధ్య ఒక్కసారిగా పెరిగింది. అయినా సరే కొనుగోళ్లు ఆపలేదు. ఇప్పుడు తగ్గింది. అంటే ఒక వస్తువు ధర తగ్గితే దానితోనే సరిపెట్టుకుని మిగతా వస్తువుల ధరలు పెరిగినా ఎవరూ నోరెత్తడమే లేదు. రోజువారీ జీవితం సర్దుబాటుకే పరిమితం అవుతోంది. ప్రశ్నించే గుణం తగ్గింది, నిలదీసే తత్వం మాయమైంది. ఎవరైనా మాట్లాడకపోతారా అనే ప్రశ్నతోనే అందరూ గడిపేస్తున్నారు. ఇదే ప్రభుత్వాలకు ఊతమిస్తోంది. కిలో బియ్యం ధర 46–50 మధ్య ఉన్నా ఎవరూ నోరు మెదిపిన పాపాన లేరు. రేషన్‌ బియ్యం నాసిరకంగా వస్తున్నా నిలదీసే వారే లేరు. ఇక మిగతా వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నా  ఇంతేలే అన్నట్లుగా నిర్వేదమే తప్ప ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాలే కనబడడం లేదు. కలికాలం కదా అని కొందరు అంటుంటే కాదు.. కాదు జగన్‌ కాలమని ఇంకొందరు అంటున్నారు. 


 ధరలన్నీ రెట్టింపు  : సతీష్‌కుమార్‌, పెంటపాడు


పేద, మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలతోపాటూ ఏది కొనాలన్నా జేబులు 

ఖాళీ అవుతున్నాయి. ఆదాయం పెరగడం లేదు. ఖర్చులు భరించలేనంతగా పెరిగాయి. పెట్రో ల్‌ ధరలతో మోటర్‌ సైకిల్‌ తీసే పరిస్థితి లేదు. ధరల నియంత్రణ జరగకపోతే సామాన్యుడి భవిష్యత్‌ ప్రశ్నార్థకమే.


 సామాన్యులు బతికేదెలా  : షేక్‌ నూర్జాన్‌, దండగర్ర 

సామాన్యులు బతికే పరిస్థితి  కనిపించడం లేదు. నిత్యావసరాల దగ్గరలన్ని పెరిగి పోయాయి. బయటకు వెళ్దామంటే పెట్రోలు ధరలు మండి పోతున్నాయి. పచ్చళ్ల కోసం వాడే మంచినూనె, మిర్చి ధరలు కొనేలా లేవు. ధరల నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను లూటీ చేస్తుంది. ఒకచేత్తో పెట్టి నాలుగు వైపులా దోచేస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement