కరెంటు కట్‌..కట..

ABN , First Publish Date - 2021-02-28T05:17:37+05:30 IST

పంచాయతీ ఎన్నికలు పూర్తయి పట్టుమని వారం రోజులు గడవక మునుపే పల్లెల్లో కరెంటు కష్టాలు ఆరంభమయ్యాయి.

కరెంటు కట్‌..కట..

ఎన్నికలైన వెంటనే పల్లెల్లో కోతలు

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

రెండో పంటపైనా ప్రభావం

సబ్‌స్టేషన్ల ఎదుట రైతుల ఆందోళన


పంచాయతీ ఎన్నికలు పూర్తయి పట్టుమని వారం రోజులు గడవక మునుపే పల్లెల్లో కరెంటు కష్టాలు ఆరంభమయ్యాయి. ఎక్కడికక్కడ సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఎన్నికలు జరిగినంత కాలం ఎక్కడా కోత లేకుండా.. ప్రభుత్వానికి వాత రాకుండా జాగ్రత్త పడిన అధికారులు ఇప్పుడు కోతలు పెట్టారు. ప్రతీ రోజు వచ్చే సరఫరా కంటే వాడకం మరింతగా పెరగడమే కారణమని ట్రాన్స్‌కో చెబుతున్నా...కొంత కాలం మెయింటినెన్స్‌ పేరిట ఇంకొంత కాలం ఓవర్‌ లోడ్‌ పేరిట ఏదో ఒక నింద వేసి కోతలు పెడుతూనే ఉన్నారు. 


సాధారణంగా మార్చిలో కరెంటు కోతలు సహజం. కానీ రెండవ పంట వేసిన రైతులు నష్టపోయేలా ఇప్పుడు కరెంటు కోతలు ఎడాపెడా ఆరంభమయ్యాయి. అన్నింటికంటే మించి రైతులు కోరుకున్న వేళల్లో కాకుండా ఇష్టానుసారంగా సరఫరా నిలిపివేస్తూనే ఉన్నారు. ఈ సీజన్‌లోనే రెండవ పంట గట్టెక్కడానికి నీరెంతో అవసరం. అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చేయాల్సిందే చేస్తామన్నట్టుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నది. ఐదు రోజులుగా డిమాండ్‌కు తగినంతగా సరఫరా ఉండడం లేదు. ఈనెల 22న 19.6 మిలియన్‌ యూనిట్‌ల విద్యుత్‌ సరఫరా అవ్వగా డిమాండ్‌ మాత్రం 20.169 మిలియన్‌ యూనిట్లుగా ఉన్నది. అలాగే 23న 19.456, 24న 19.68, 25న 20.030, 26న 20.205 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు. కానీ ఈ ఐదు రోజుల్లోనూ సరఫరా అయిన విద్యుత్‌ కంటే వాడకం భారీగా పెరిగింది. ఒక వైపు వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ వాడకం అధికం కావడం, పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గృహ అవసరాలకు తగినట్టుగా సరఫరా చేయలేకపోవడం ప్రధాన కారణంగా ఉంది. ఒక రోజు సరఫరా, డిమాండ్‌ల మధ్య వ్యత్యాసం 1, 2 మిలియన్‌ యూనిట్లకు పైగానే ఉంది. ఈ కారణంగా ఓవర్‌ లోడ్‌ అంటూ ఎక్కడకక్కడ విద్యుత్‌ను నిలిపి వేస్తున్నారు. లోడ్‌ రిలీఫ్‌ పేరిట ఈ వ్యవహారం అంతా సాగుతున్నది. కానీ వాస్తవానికి జిల్లాలో దాదాపు 14లక్షల68వేల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉండగా వీటిలో 98వేల వరకు వ్యవసాయ కనెక్షన్‌లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ అవసరాల కంటే గృహ అవసరాలకే వినియోగం  ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ వస్తుంది. దాదాపు 10ఏళ్ల క్రితం రోజు వారీ వినియోగం వేసవి సీజన్‌లో అయితే 11 నుంచి 14 మిలియన్‌ యూనిట్లు వినియోగం ఉండేది. అప్పట్లో ఈ డిమాండ్‌ తట్టుకోలేక ఎడాపెడా గంటల తరబడి కోతలు పెట్టేవారు. 2014–19 ఐదేళ్ల సమయంలో విద్యుత్‌ కోతలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. గృహ అవసరాలకు వీలుగా 24 గంటల విద్యుత్‌ ఉండేలా అప్పట్లో ప్రభుత్వం జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు రోజు వారీ విద్యుత్‌ సరఫరా ఏకంగా 19 నుంచి 20 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. సరఫరా భారీగా పెరిగినా దీనికి సమాంతరంగా విద్యుత్‌ వాడకం కూడా అదేస్థాయిలో పెరిగింది. రబీని గట్టెక్కించడానికి ఎక్కడికక్కడ బోరు లను ఉపయోగిస్తున్నారు. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి వేళల్లో విద్యుత్‌ ఇవ్వాలని రైతులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తూనే వచ్చారు. కానీ సర్కారు మాత్రం రైతులకు ఏ కష్టం రానివ్వబోమని ఇక రాత్రి వేళల్లో బోరుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని ఎన్నికల్లో హామీలు ఇచ్చేసింది. 

రైతుల నిరసన..

విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు, కొనుగోళ్లు పెరిగిన తరువాత కూడా రైతులకు, గృహ అవసరాలకు అనువుగా సంతృప్తికర విద్యుత్‌ సరఫరాను అందించ లేకపోతున్నారు. పగటి వేళల్లోనూ విద్యుత్‌ బోర్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీనికి అనుగు ణంగానే రైతులు సర్ధుకోలేక మరోవైపు పొలాలకు నీరందక విలవిలలాడుతున్నారు. దీంతో ఆగ్రహం పట్టలేక గడచిన కొద్ది రోజులుగా పరోక్ష హెచ్చరికలు చేసిన రైతులు ఇప్పుడు నేరుగా టి.నరసాపురం వంటి సబ్‌స్టేషన్‌లు ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. ఒకవైపు డెల్టా ప్రాంతంలో సాగునీరు సరఫరా లేక రైతులు నష్టపోయే పరిస్థితుల్లో ఉండగా మెట్టలోనూ కరెంటు లేక బోరు పని చేయక రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో కోతలు అతితక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటి నుంచే కోతలు మొదలు పెట్టారు. ఇక పగటి ఉష్ణోగ్రత్తలు తీవ్రస్థాయికి చేరిన తరువాత మార్చి మాసంలో ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు నిలువెత్తు కష్టాలు, నష్టాలను మూటకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తొంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవలసింది పోయి ఇంకా చాలా సమయం మిగిలి ఉందన్నట్టుగా తాత్సారం చేస్తున్నారు. 




Updated Date - 2021-02-28T05:17:37+05:30 IST