Abn logo
Jan 26 2021 @ 00:18AM

పల్లె పోరుకు సై...

సుప్రీం తీర్పుతో వ్యూహాలకు పదును 

 అన్ని స్థానాలకు పోటీకి టీడీపీ కసరత్తు

వైసీపీకి ఏకగ్రీవాల ఛాన్స్‌ ఇవ్వద్దు

 పార్టీ క్యాడర్‌కు టీడీపీ పిలుపు

 మిగతా పార్టీలదీ తలోదారి

 బీజేపీ, జనసేనది ప్రస్తుతానికి వేర్వేరు రూటు 

 సత్తా చాటుతామని బీజేపీ ధీమా

 తగ్గట్టుగానే జనసేన కూడా కొన్నిచోట్ల సై

 పంచాయతీ పోరులో వ్యూహ ప్రతివ్యూహాలు 


ఏలూరు– ఆంధ్రజ్యోతి : 

సందిగ్ధం తీరింది. స్థానిక సమరానికి తెర లేచింది. సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పార్టీలు  పంచాయతీ పోరుకు సంసిద్ధమవుతున్నాయి. అంతర్గత రహస్య చర్చల్లో మునిగి తేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు నిర్వహణకు నిరాకరించిన ఉద్యోగులు కూడా ఎన్నికల సామాగ్రిని సర్ధే ప్రయత్నంలో పడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఏకగ్రీవానికి తావివ్వకూడదని నేరుగా వైసీపీ అభ్యర్థులను ఢీ కొనాలని ఎటువంటి ఛాన్సు ఆ పార్టీకి ఇవ్వద్దంటూ తమ శ్రేణులను టీడీపీ అప్రమత్తం చేసింది. సామా జిక వర్గాల వారీగా ఇప్పటికే ఎక్కడికక్కడ ఒకరు లేదా ఇద్దరు అభ్యర్థులతో జాబితాలను కొన్ని పార్టీలు సిద్ధం చేయగా జనసేన, బీజేపీ మాత్రం ఇంకా ప్రాథమిక కసరత్తులోనే మునిగి తేలుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ముళ్లమీద నడకే. జిల్లావ్యాప్తంగా నాలుగు విడతలుగా జరిగే పంచాయతీ సమరం ఈనెల 29న ఆరంభమై వచ్చే నెల 21తో ముగియనుంది. 

అన్ని చోట్ల ఢీకొట్టేందుకే టీడీపీ రెడీ 

స్థానిక సమరానికి అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువడింది. దీనికి తగ్గట్టుగానే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల కసరత్తుకు దాదాపు రెడీ అయ్యాయి. గత మార్చిలోనే స్థానిక సమరానికి వీలుగా అభ్యర్థులను ఖరారు చేసి ఆ మేరకు జాబితాలను రూపొందించుకుని బరిలో దింపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. అవే జాబితాలను కొన్ని స్వల్పమార్పులతో ఇప్పుడు తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఇంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవాలకు వేసిన ఎత్తుగడలను ఈసారి టీడీపీ పరిగణనలోకి తీసుకుంది. నియోజకవర్గాల వారీగా  ఎక్కడికక్కడ ఆ పార్టీ కేడర్‌ గ్రామస్థాయిలో భేటీ అయి దాదాపు ఏకాభిప్రాయాలకు వస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగతా అన్నిచోట్ల ఎట్టి పరిస్థితు ల్లోనూ నామినేషన్ల సమయానికే ఏకగ్రీవ ఊసురాకుండా ముందస్తు కట్టడికి దాదాపు సంసిద్ధమైంది. ఈ మేరకు జిల్లా పార్టీ నాయకత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ‘వైసీపీ అదిలింపులకు, బెదిరింపులకు భయపడక్కరలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి గ్రామంలోనూ పోటీ జరిగి తీరాల్సిందే. గెలుపు ఓటములు ప్రజల చేతిలో ఉన్నాయి. అంతే తప్ప బరి నుంచి ముందే పారిపోవద్దు. ధీటుగా ఎదుర్కొని పోరాడండి’ అంటూ టీడీపీ అధిష్టానం జిల్లా నాయకత్వానికి  తన విధానాన్ని స్పష్టం చేసింది. సామాజిక వర్గాల వారీగా కాస్తంత బలమైన వాళ్ళనే బరిలోకి దింపాల్సిందిగా ఆదేశించింది. గెలుపు దిశగా ఎక్కడికక్కడ వ్యూహరచన చేసి తగ్గట్టుగానే ముందుకు సాగాలని పరోక్ష సూచనలు వెలువడ్డాయి. చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు వంటి నియోజకవర్గాల్లో ఎక్కడి కక్కడ స్థానిక నాయకత్వం ముఖ్యులతో భేటీలు నిర్వహించారు. సర్పంచ్‌ పదవికి, వార్డు పదవులకు ఎవరు పోటీ చేయాలో కూడా పేర్లతో సహా ఏకాభిప్రాయానికి వచ్చారు.  తెలుగుదేశం అభ్యర్థులంతా దాదాపు ఎన్నికలు జరిగే 895 సర్పంచ్‌ పదవుల్లో దాదాపు 95 శాతం పైగానే నేరుగా ఢీ కొనాలని తపన పడుతోంది.


మిగతా పార్టీలది ఇంకో దారి  

స్థానిక పోరులో వైసీపీ ఇంతకుముందే అభ్యర్థులను ఖరారు చేసి రంగంలో దింపేందుకు అనువైన వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇప్పుడు ఆ వ్యూహాన్నే కొద్ది మార్పులతో అమలు చేయా లని యోచిస్తోంది. తెలుగుదేశం కాస్తంత స్పీడుగా ముందుకు సాగుతుండగా వామపక్షాలు, భారతీయ జనతాపార్టీ, జనసేన పూర్తిగా ఒక నిర్ధారణకు ఇంకా రాలేదు. అయితే గ్రామాల వారీగా లోతట్టు ప్రాంతాల్లో బీజేపీ ఇంతకుముందు వెనుకంజలోనే ఉంది. అయితే జనసేన మిత్ర పక్షంగా వ్యవహరిస్తోండడంతో పైకి రాజకీయాలకు అతీతంగా కన్పిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో అంతో ఇంతో నేరుగా లబ్ధిపొందాలని బీజేపీ శత విధాలా ఎత్తుగడలు వేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో కంటే బీజేపీకి పల్లెల్లో కాస్త పట్టుతక్కువే. ‘‘ఇప్పుడు మా పార్టీ బలంగా ఉంది. గ్రామాల్లోనూ సానుకూలత పెరిగింది. మా తడాకా చూపిస్తామని’’ బీజేపీ కాస్తంత కంభీరంగానే కన్పిస్తున్నా సర్పంచ్‌ పదవులకు అభ్యర్థుల ఖరారు విషయంలో చాలా చోట్ల తడబడుతోంది. ఎన్నికలకు తామంతా సిద్ధమేనని తగినంత వ్యూహంతో ముందుకు సాగుతున్నామని ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్‌ ప్రాంత అధ్యక్షుడు సుధాకరకృష్ణ ధీమాతో చెప్తున్నారు. అయితే ఏలూరుతో పాటు నర్సాపురం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు జనసేన కొన్ని చోట్ల బీజేపీతోనూ, మరికొన్ని చోట్ల టీడీపీతోనూ స్థానిక పరిస్థితులను బట్టి ఒప్పందాలతో ముందుకు సాగాలని యోచిస్తోంది. వామపక్షాలు మాత్రం తమకు స్ఫూర్తినిచ్చే గ్రామాల్లోనే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. సీపీఐ, సీపీఎం ఎవరంతటికి వారుగానే పోటీ చేస్తారా లేకపోతే స్థానిక అవగాహనకు వచ్చి అభ్యర్థులను రంగంలోకి దింపుతారా అనేది ఇంకా తేలలేదు. 


షెడ్యూల్‌ మారింది

ఏలూరు సిటీ, జనవరి 25: సుప్రీం తీర్పుతో పంచాయతీ ఎన్నికల పీటముడి వీడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు స్వల్పంగా మార్చింది. ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం డివిజన్లలో నాలుగు విడత లుగా ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించింది. మొదటి విడత ఏలూరు డివిజన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సోమవారం ముహూర్తం నిర్ణయించినప్పటికీ అధికారుల సహాయ నిరాకరణతో ఇది ముం దుకు కదల్లేదు. దీంతో ఈ డివిజన్‌ ఎన్నికలను నాలుగో విడతగా నిర్వహిం చాలని నిర్ణయించారు.  మొదటి విడత నరసాపురం డివిజన్‌లోని పంచాయ తీలకు ఫిబ్రవరి 9న, రెండో విడత కొవ్వూరు డివిజన్‌కు 13న, మూడో విడత జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లకు 17న, చివరగా ఏలూరు డివిజన్‌కు 21న పోలింగ్‌ జరుపుతారు. జిల్లావ్యాప్తంగా 895 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‌ పదవులకు, 9,680 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు. 23 లక్షల 76 వేల 736 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగిం చనున్నారు. ఇందుకు 9991 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


Advertisement
Advertisement
Advertisement