ఇద్దరు పద్మశ్రీలు ఇక్కడి వారే

ABN , First Publish Date - 2021-01-27T05:34:45+05:30 IST

కేంద్రం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి మూడు పద్మశ్రీలు వచ్చాయి వాటిలో ఇద్దరు జిల్లాకు చెందిన కళాకారులే కావడం విశేషం.

ఇద్దరు పద్మశ్రీలు ఇక్కడి వారే

మృదంగ కళాకారిణి  సుమతీ రామ్మోహన్‌, 

వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిలకు పద్మశ్రీ పురస్కారాలు

ఏలూరు/దెందులూరు జనవరి 25(ఆంఽధ్రజ్యోతి): కేంద్రం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి మూడు పద్మశ్రీలు వచ్చాయి వాటిలో ఇద్దరు జిల్లాకు చెందిన కళాకారులే కావడం విశేషం. వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి (దండమూడి సుమతి)కి పద్మశ్రీలు దక్కాయి. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించి విజయవాడలో స్థిరపడ్డారు. 

సుమతి ఏలూరులో 1950వ సంవత్సరలో జన్మించారు. ఆమె తండ్రి రాఘవయ్య, తల్లి వెంకట రత్నం. తొలుత ఆమె తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. తర్వాత విజయవాడలో దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. రామ్మోహనరావుకు మంచి శిష్యురాలిగా ఉన్న సుమతి ఆయననే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.  రామ్మోహనరావు, సుమతిలు  చాలా కాలం పాటు ఆకాశవాణి, దూరదర్శన్‌లో ‘ఏ’ గ్రేడ్‌ మృదంగ కారులుగా ఉన్నారు. మృదంగంలో ఇప్పటి వరకు ఆమె వేలాది మంది విద్యార్థులను తయారు చేశారు. లయ వేదిక అనే సంస్థను స్థాపించి మృదంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను భర్త రామ్మోహనరావు పేరుతో సత్కరిస్తున్నారు. ఆమెకు మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాదభగీరథ, మృదంగలయ విద్యాసాగర వంటి బిరుదులు ఉన్నాయి. 1974, 1982, 1985 సంవత్సరాల్లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి ఉత్తమశ్రేణి వాయిద్య కళాకారిణి అవార్డు అందు కున్నారు. 2009లో  కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా అందులో సుమతికి చోటు ఉండేది. 


సోమవరప్పాడులో గ్రామస్థుల హర్షం

వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి 1923 మార్చి 23న దెందులూరు మండలం సోమవరప్పాడులో జన్మించారు. ఈయన బాల్యం సోమవరప్పాడులోనే సాగింది. తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసుడు. అన్నయ్య గోపాలం ఘటం విద్వాంసుడిగా ఆకాశవాణిలో పనిచేశారు. రామస్వామి మాగంటి జగన్నాథం చౌదరి, పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌తో పాటు దేశవిదేశాల్లో  కచేరీలు చేశారు.విజయవాడ, రాజమహేంద్రవరం, భీమవరంలో రామస్వామి కనకాభిషేకం, సువర్ణ కంకణ సన్మానాలు పొందారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఉంటూ పదివేల కచేరీలలో సహాయకుడిగా పనిచేశారు. రామస్వామికి పద్మశ్రీ అవార్డు రావడంతో జిల్లాతో పాటు దెందులూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-01-27T05:34:45+05:30 IST