Abn logo
Oct 17 2020 @ 03:55AM

పశ్చిమను వీడని వరద

Kaakateeya

ముంపులోనే వేలాది ఎకరాలు

వరద హెచ్చరికలతో గుంటూరులో లంకలు ఖాళీ

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పశ్చిమ గోదావరి జిల్లాను వరద వదిలిపెట్టడం లేదు. ఉధృతంగా పారుతున్న ఉప్పుటేరుకు ఆకివీడు మండలం సిద్దాపురం వద్ద శుక్రవారం గండిపడింది. దీంతో వంద ఎకరాల్లో ఉన్న చేపల చెరువులతోసహా మరో 500 ఎకరాలు నీట మునిగాయి. వెంకయ్య-వయ్యేరు కాలువ గట్టుపై నుంచి ఒక్కసారిగా వరద దిగువకు ప్రవహించడంతో పంట పొలాలు పూర్తిగా మునిగాయి. యనమదుర్రు డ్రైన్‌ ప్రవాహంతో భీమవరంలోని 8 వార్డులు నీటమునిగాయి. స్థానికులు రోడ్లమీదకు చేరారు. నిడదవోలు మండలంలో ఎర్రకాలువ వరద కారణంగా ఐదు గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలంలో మంత్రులు ఆళ్ల నాని, అప్పలరాజు పర్యటించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణానదికి భారీ వరద నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు లంక గ్రామాలను ఖాళీ చేయించారు. లంక గ్రామాల ప్రజలను పడవలు, ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. పెనుమూడి పల్లెపాలెంలోని 120 ఇళ్లు ఇంకా నీటిలో నానుతున్నాయి. కంద, అరటి, పసుపు, కూరగాయ పంటలు పూర్తిగా మునిగిపోయాయి. గుంటూరు జిల్లా చింతమోటుకి చెందిన మోర్ల సుబ్బారావు(74) శుక్రవారం మృతి చెందారు. కాలనీలో నడుములోతులో నీరు ఉండడంతో అతికష్టంపై మృతదేహాన్ని తరలించి కాలువ కట్టపై అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీస్థాయిలో వరద వస్తోంది. బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తి.. 7.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, సముద్రంలో వేటకు వెళ్లి నాలుగు రోజులపాటు తిప్పలు పడిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని దుమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. 

Advertisement
Advertisement
Advertisement