కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-15T05:23:41+05:30 IST

మాస్క్‌ ధరించండంటే తేలిగ్గా తీసుకుంటారు. దూర ప్రయాణాలు వద్దంటే వెకిలిగా నవ్వుతారు.

కరోనా కల్లోలం

దూసుకొస్తున్న సెకండ్‌ వేవ్‌.. పెరుగుతున్న బాధితులు

తాజాగా ఇద్దరు మృతి.. 60 మందికి పాజిటివ్‌ 

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితోనే వ్యాప్తి

ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యం.. మాస్క్‌, భౌతిక దూరాలకు దూరం 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే దిక్కు.. ఫలితాలకు ఐదు రోజుల వెయిటింగ్‌

ఆరు వేలకుపైగా పెండింగ్‌.. వెల్లడికి కిట్లు కొరత

ఆసుపత్రుల్లో బెడ్లు సిద్ధం చేసినా.. మిగతావి నిల్‌ 

బాధితులకు భోజనం సత్యసాయిభక్తుల పనే

తీరుతున్న వ్యాక్సిన్‌ కొరత.. క్యూ కడుతున్న జనం


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): మాస్క్‌ ధరించండంటే తేలిగ్గా తీసుకుంటారు. దూర ప్రయాణాలు వద్దంటే వెకిలిగా నవ్వుతారు. సామాజిక దూరం పాటించమంటే భుజాలు భుజాలు కలిపి మరీ నడుస్తారు. పెళ్లి, పేరంటం, ఆఖరికి దైవ దర్శనాలు, రాజకీయ సభల్లోనూ ఒళ్లు మరిచి వ్యవహరిస్తారు. కరోనా రూపంలో ప్రమాదం పొంచే ఉందని చెబుతున్నా చెవికెక్కదు. దీని ఫలితమే కరోనా సెకండ్‌ వేవ్‌..! ఇప్పుడు ప్రభలుతోంది. నాలుగు వారాల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 330 కేసులు నమోదయ్యాయి. అన్నిచోట్ల ముందస్తు చర్యలు తీసుకుంటున్నా.. నామమాత్రమే. టెస్ట్‌లు లేవు. కిట్లు లేవు. నిన్న మొన్నటి వరకూ వ్యాక్సిన్‌కు గతి లేదు. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే. మీకు అర్థమవుతోందా..?


ఆ రోజులు తలుచుకుంటేనే.. 

గత ఏడాది మొదట్లో కరోనా పేరు చెబితే చాలు తల్లడిల్లిపోయేవారు. పాజిటివ్‌ వచ్చిందంటే ఉలిక్కిపడేవారు. ప్రభుత్వమే వైరస్‌లను గుర్తించే పరీక్షలు నిర్వహించింది. ఆసుపత్రికి, క్వారంటైన్లకు, హోం క్వారంటైన్లకు తరలించేందుకు వందలాది అంబులెన్సులు పనిచేశాయి. బాధితుల కోసం సమృద్ధిగా బెడ్లు ఏర్పాటు చేసింది. మినరల్‌ వాటర్‌తోపాటు ఉచిత భోజన వసతి, దగ్గర ఉండి పర్యవేక్షణ, యంత్రాంగం పర్యవేక్షించింది. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో టిడ్కో గృహాల్లో వేలాది మందిని ఉంచి మందులు, ఆహారం అందించింది. అయినా వరుస చావులు తప్పలేదు. కుటుంబాలకు కుటుంబాలే చెల్లా చెదురయ్యాయి. అనేకమంది రోడ్డున పడ్డారు. కరోనా విలయ తాండవం చేసింది. ఆ రోజులను తలుచుకుంటేనే గుండెలు జారిపోయేవి..!


ఇప్పుడు చూస్తుంటే.. 

కొద్దిమాసాల తరువాత మళ్లీ పుంజుకుంటోంది. లక్షణాలేవీ కనిపించకుండానే కమ్మేస్తోంది. చూస్తూండగానే కేసులు మూడంకెలు దాటుతున్నాయి. తలనొప్పి, జలుబు, జ్వరం, వాంతులు, విరోచనాలు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలున్న వారంతా వైరస్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ర్యాపిడ్‌ టెస్టులను తొలగించి ఆర్‌టీపీసీఆర్‌ మాత్రమే చేస్తున్నారు. ఇందులోనూ జాప్యమే. ఏలూరు ఆశ్రం మెడికల్‌ కళాశాలలోని ప్రత్యేక ల్యాబ్‌లో వచ్చిన నమూనాలను పరీక్షించాలంటే దాదాపు ఐదు రోజులు పడుతోంది. అంటే ఈ నెల 10న ఇచ్చిన వారి పరీక్ష ఫలితాలు ఇప్పటికీ బయటపడలేదు. ఈ ఆలస్యమే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. మరోవైపు ల్యాబ్‌లో రెండు రోజుల నుంచి కిట్ల కొరత వేధిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అవి సమృద్ధిగా ఉంటే తప్ప పరీక్షలు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం లేదు. పరీక్షలు వేగమైతే మరిన్ని కేసులు వెలుగు చూస్తాయి. 


మరింత దూసుకుపోయేలా..

కేసుల తీవ్రత భయపెడుతున్నా లెక్క చేయని మొండితనం జనంలో కనిపిస్తోంది. గత ఏడాది 93 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు అధికారికంగా నమోదైతే.. అనధికారిక సంఖ్య 98 వేలకు పైమాటే. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా.. 542 మంది కనిపిస్తుండగా, అనధికారికంగా మరో 130 మంది బలయ్యారు. గతంలో మిగతా జిల్లాలతో పోలిస్తే మనం కాస్త వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా చివరి మూడు నెలలు వాటితో పోటీ పడింది. ఈసారి తక్కువగానే ఉన్నట్లు కేసులు కనిపిస్తున్నా డేంజర్‌ బెల్స్‌ మోగుతూనే ఉన్నాయి. వారం క్రితం పట్టుమని పాతిక కేసులు నమోదు కాలేదు. బుధవారానికి అధికారికంగా 60 కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఈ కేసులే అత్యధికం. 


ఇక్కడ నుంచే.. కేసులు

జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు బయట ప్రాంతాల్లో తిరిగి వచ్చినవారే. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల్లో వివిధ పనులపై వెళ్లిన వారిలో అనేక మందికి పాజిటివ్‌ నమోదు కాగా అది తెలియకుండానే వారంతా జిల్లాకు చేరారు. ఫలితంగా కొద్దిరోజులుగా ఉండి, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు వంటి ప్రాంతాల నుంచి వరుసగా కేసులు బయటపడుతున్నాయి. కరోనా లక్షణాలు కనపడుతున్న అనేకమంది జిల్లా హద్దులు దాటి బయటి ప్రాంతాల్లోనే వైద్యానికి తరలిపోతూనే ఉన్నారు. ఈ సంఖ్య నిర్ధారణ కష్టమైనప్పటికీ ఒక అంచనా ప్రకారం రోజుకు పాతిక మందికి పైగా హైదరాబాద్‌, విజయవాడ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఇంకోవైపు బాధితుల కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 150 బెడ్లను సిద్ధం చేయగా ఇప్పటికే 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. తాడేపల్లిగూడెంలో 130, భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకు 30 బెడ్స్‌ చొప్పున ఉంచారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలోనూ ఈ తరహా ఏర్పాట్లే ఉన్నాయి. ఏలూరు ఆసుపత్రిలో బాధితులకు ఇంతకు ముందులా ప్రభుత్వం భోజనం సమకూర్చడం లేదు. ఆ బాధ్యతను సత్యసాయి సేవా బృందమే భుజానికి ఎత్తుకుంది. 


టీకాలకు జనం క్యూ 

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 14 : కరోనా నివారణ వ్యాక్సిన్‌ కోసం ప్రజల్లో ఆసక్తి పెరిగింది. జిల్లాకు అందిన 55 వేల డోసులు కోవి షీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకా మందు నిల్వలను రెండు రోజుల్లో ఖాళీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు రోజుకు గరిష్టంగా 12 వేల డోసులు పంపిణీ చేస్తుండగా బుధవారం ఒక్కరోజే 40 వేల మందికిపైగా టీకాలు వేశారు. గురువారం మధ్యాహ్నానికి మిగతా వ్యాక్సిన్‌ నిల్వలన్నీ అయిపోతాయని అధికారులు అంచనా వేశారు. ఒక్కో సచివాలయంలో రోజుకు 300 డోసుల మందు పంపిణీ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాలు మినహా అన్నిచోట్ల వ్యాక్సినేషన్‌ చురుగ్గా జరుగుతోంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు లబ్ధిదారులు స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారు. గురువారం రాత్రికి మరో 20 వేల డోసుల వ్యాక్సిన్‌ జిల్లాకు రానుంది.


60 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో బుధవారం మరో 60 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 94 వేల 862కి చేరాయి. హోం ఐసొలేషన్‌, ప్రభుత్వాసుపత్రుల్లో 336 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  


పీవీఎల్‌కు పాజిటివ్‌

కాళ్ళ,  ఏప్రిల్‌ 14 : వైసీపీ ఉండి నియోజకవర్గ మాజీ కన్వీనర్‌ పీవీఎల్‌ నరసింహరాజుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బుధవారం ఆయన ఆరోగ్యం కొంత మార్పు రావడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఉదయం పలు గ్రామాల్లో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.




Updated Date - 2021-04-15T05:23:41+05:30 IST