సిద్ధమవుతున్న కోడి పందేల బరులు

ABN , First Publish Date - 2021-01-13T05:23:39+05:30 IST

సంక్రాంతి కోడిపందాలు ఉన్నాయా..? గ్రామాల్లో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశం.

సిద్ధమవుతున్న కోడి పందేల బరులు
చినగరువులో సిద్ధమవుతున్న కోడిపందేల బరి

కోడి పందేలు ఉంటాయా.. లేదా.. అంతటా ఇదే ఉత్కంఠ. కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినా కొన్ని చోట్ల బరులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పందెకోళ్ల విక్రయాలు కూడా సాగుతున్నాయి. పోలీస్‌, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పందేల నిలుపుదలపై అవగాహన ర్యాలీలు, సదస్సులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడక్కడా ఏర్పాట్లు చేయడంతో పందేల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. ఎస్‌ఈబీ అధికారులు గతంలో బరులు నిర్వహించే ప్రదేశాలను స్వయంగా పరిశీలించి మరీ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  పందేలు నిలుస్తాయా.. కోళ్లు ఢీకొంటాయనేది చర్చనీయాంశమైంది.


భీమవరం రూరల్‌ / ఆచంట, జనవరి 12: సంక్రాంతి కోడిపందాలు ఉన్నాయా..? గ్రామాల్లో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశం. కోడిపందేలు నిషేధం, జూదాలు నేరం అంటూ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే చాటుమాటున బరుల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కొన్ని ప్రాంతాలలో ఏర్పాటుచేసిన బరుల వద్ద అధికార యంత్రాంగం నిఘా ఉంచింది. బరి వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరగకపోయినా అప్పటికప్పుడు బరులు నిర్వహించేలా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మండలంలో గత ఏడాది పది ప్రాంతాలకు పైగా కోడిపందేలు సాగాయి. ఈసారి కూడా అదే ప్రాంతాల్లో ఏర్పాట్లుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఏటా మాదిరి పండుగ మూడురోజులు పందేలు జరుగుతాయని గ్రామా ల్లో ప్రచారం జరుగుతోంది. ఆచంట నియోజకవర్గంలోని పోడూరులో గత ఏడాది పెద్ద బరి నిర్వహించారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. ప్రస్తుతం బరులు సిద్ధం చేయకున్నా గత ఏడాది నిర్వహించిన చోటే పందేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


అమ్మకానికి పందెం పుంజులు


భీమవరం క్రైం, జనవరి 12 : కోడిపందేలు, జూదం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు పందేలకు రెడీ అవుతున్నారు. కోడిపందేలకు కోడిపుంజులను వెతికే పనిలో పడ్డారు. భీమవరం పట్టణ శివారు ఉండి జాతీయ రహదారి పక్కన వందల సంఖ్యలో కోడి పుంజులు విక్రయాలు సాగుతున్నాయి. బహిరంగంగా పందెం పుంజుల విక్రయాలు సాగ డంతో పందేలు జరుగుతాయని పలువురు భావిస్తున్నారు. కొవిడ్‌, బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కోడిపందేలకు అనుమతి లేదని చెబుతున్నప్పటికీ పందెగాళ్లు మాత్రం సన్నద్ధం అవుతున్నారు.


గత ఏడాది బరుల ప్రాంతం పరిశీలన


ఆకివీడు రూరల్‌ జనవరి 12 : కోడి పందేలు నిర్వహించకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు తెలిపారు. మండలంలోని గతంలో కోడి పందేల బరులు నిర్వహించిన ప్రదేశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. జూదం, కోడి పందేలు నిర్వహించకుం డా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ అఖిల్‌జామా, ఎస్‌ఐ వీరభద్రరావు తదితరులున్నారు.

–––––––––––––––––––––––––––

Updated Date - 2021-01-13T05:23:39+05:30 IST