పండుగ వేళ కరోనా భయం

ABN , First Publish Date - 2021-01-11T05:58:22+05:30 IST

జిల్లాలో కరోనా చాపకింద నీరులా పాకుతోందా.. అంటే అవుననే అనిపి స్తోంది.

పండుగ వేళ కరోనా భయం
ఏలూరు ఆర్‌ఆర్‌పేటలో జనం రద్దీ

 పెరుగుతున్న కేసులు

 ఏలూరులో తగ్గని ప్రభావం

 పండగ రద్దీతో  ఆందోళన

ఏలూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా చాపకింద నీరులా పాకుతోందా.. అంటే అవుననే అనిపి స్తోంది. కిందటి నెలకంటే ఈ నెలలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడమే అందుకు నిదర్శనంగా అనిపిస్తోంది. వేల సంఖ్యలో కేసులతో కరోనా కరాళ నృత్యాన్ని కళ్లారా చూసిన జిల్లా వాసులు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆ ఊసే మరిచిపోయారు. ఎవరి పనిలో వారు పడ్డారు. జిల్లా అంతటా పండగ సందడి నెలకొంది. ప్రయాణాలు, షాపింగులతో జిల్లా అంతటా హడావుడి కనిపిస్తోంది. ఇదే అదనుగా మహమ్మారి తన పని తాను చేసుకుపోతోంది. పండగ రద్దీని ఆసరా చేసుకుని కరోనా క్రమంగా విస్తరిస్తోంది. కిందటి నెలలో సింగిల్‌ డిజిట్‌లో నమోదవుతూ వచ్చిన కేసులు తాజాగా డబుల్‌ డిజిట్‌కు పెరుగు తున్నాయి. మరో మారు ప్రమాద హెచ్చరికలు పంపుతున్నాయి. 


మళ్లీ పెరుగుతున్న కేసులు.. 

డిసెంబరు ప్రారంభంలో జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 50 నుంచి 60 మధ్య నమోదవుతూ వచ్చింది. రెండో వారం వచ్చే సరికి కేసుల సంఖ్య 20 కేసు లకు అటూ ఇటూ ఉంటూ వచ్చింది. డిసెంబరు 20న కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కు చేరింది. ఆ తరువాత ప్రతి రోజూ కేసుల సంఖ్య 10కి కాస్త అటు ఇటుగా నమోదవుతూ వచ్చేది. డిసెంబరు 20 నుంచి 31 మధ్య కేసుల సంఖ్య రెండు సార్లు మాత్రమే 20కి మించి నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 25 నుంచి 30 వరకూ పెరిగాయి. గడిచిన 10 రోజుల్లో ఒక్క 4వ తేదీ మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ కేసుల సంఖ్య 25కు తగ్గలేదు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉండడం మరో ఆందోళనకరమైన అంశం. పండగ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఏలూరు వచ్చే ప్రజల సంఖ్య వేలల్లో ఉంటోంది. దీంతో ఇది జిల్లా అంతటా విస్తరించే ప్రమాదం ఉంది.  


 నిబంధనల పట్ల నిర్లక్ష్యమే కారణం

జిల్లాలో కరోనా మహమ్మారి ఉపశమించిందే తప్ప పూర్తిగా నశించి పోలేదు. ఈ విషయం గ్రహించని ప్రజలు యథేచ్ఛగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో, షాపులు, దుకాణాలు, షాపింగ్‌ మాళ్లలో గుంపులుగా చేరుతున్నారు. దీనికి తోడు సినిమా థియేటర్లు కూడా పూర్తిగా తెరుచుకున్నాయి. దీంతో మహమ్మారి మరోసారి విజృంభించేందుకు సిద్ధమవుతూ ఉంది. కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో అధికార యంత్రాంగం కూడా నిబంధనల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంలో కూడా నియమాలకు విరుద్ధంగా ప్రజలు పోగుపడుతున్నారు. ఇది కూడా జిల్లాలో కరోనా కేసులు పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. 


16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌:ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని 

ఏలూరు రూరల్‌, జనవరి 10 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈనెల 16 నుంచి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రారంభం కానుందని ఉపముఖ్యమంత్రి ఆళ్ళనాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11న ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో నిర్వహించే వీడియోకాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై తుది రూపు సిద్ధమవుతుందన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య, సఫాయి కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ భద్రపరిచేందుకు 17 కోల్డు స్టోరేజ్‌ సెంటర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 17 వేల మందికి శిక్షణ అందించినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉందన్నారు. 


138 కేంద్రాల్లో వ్యాక్సిన్‌... పల్స్‌పోలియో  వాయిదా

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 10 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈనెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన పల్స్‌ పోలియో వాయిదా వేశారు. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకా/వ్యాక్సిన్‌ పంపిణీకి జిల్లాలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. తొలి విడతలో మొత్తం 27,850 మంది వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, తదితర వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనుండగా, వ్యాక్సినేషన్‌ కోసం మొత్తం 138 కేంద్రాలను (సెషన్‌ సెంటర్లు) ఎంపిక చేశారు. వీటితో పాటు 14 ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఎంపిక చేసి వాటిలో పనిచేస్తున్న హెల్త్‌కేర్‌ వర్కర్లందరికీ అక్కడే వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా, జిల్లాకు 14 లేదా 15 తేదీల్లో వ్యాక్సిన్‌ నిల్వలు రావచ్చునని భావిస్తున్నారు. 


Updated Date - 2021-01-11T05:58:22+05:30 IST