ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి కానీ, పోలవరం కానీ వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రామానాయుడు ఇంటికి భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరంగా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. నేడు జగన్ దానిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు అమరావతికి జై అన్న జగన్ నేడు 3 ముక్కలు అంటున్నారన్నారు. నాడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అని చెప్పి నేడు 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదన్నారు. జగన్ పాలనలో అమరావతి అటకెక్కిందని, పోలవరం పడకేసిందని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో అమరావతి రైతులు రోడ్డెక్కారని.. పోలవరం నిర్వాసితులు నిరసన దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని నిమ్మల రామానాయుడు అన్నారు.