వెస్ట్ బెంగాల్లో టెన్షన్ అంతా.. ఆ ఒక్క సీటుపైనే.. ఎవరు గెలిచినా సంచలనమే..!

ABN , First Publish Date - 2021-05-02T12:12:42+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దేశం యావ‌త్తూ...

వెస్ట్ బెంగాల్లో టెన్షన్ అంతా.. ఆ ఒక్క సీటుపైనే.. ఎవరు గెలిచినా సంచలనమే..!

నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దేశం యావ‌త్తూ నందిగ్రామ్‌పైనే దృష్టి సారించింది. నిన్నమొన్న‌టి వరకూ కుడిభుజంగా మెలిగిన‌వాడే..ఇప్పుడు మ‌మ‌త‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. నందిగ్రామ్‌లో మమతా వర్సెస్ సుబేందు పోటీ ఎంతో ఆస‌క్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విష‌యానికొస్తే నందిగ్రామ్‌కు ఎంతో ఆస‌క్తిక‌ర‌ చ‌రిత్ర ఉంది. దశాబ్దాల త‌ర‌బ‌డి కొన‌సాగిన వామపక్ష ప‌రిపాలనకు చరమగీతం పాడుతూ దీదీని అధికారంలో కూర్చోబెట్టింది నందిగ్రామ్ నియోజకవర్గం.


14 ఏళ్ల అనంతరం ఇప్పుడు మరోసారి నందిగ్రామ్ చర్చనీయాంశంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన‌ రెండవ దశ పోలింగ్‌లో నందిగ్రామ్ కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  గ‌తంలో కుడి భుజంగా నిలిచిన‌ సుబేందు ఆమెతో పోటీ పడ‌టంతో టెన్షన్ వాతావ‌ర‌ణం నెలకొంది. ఈ నేపధ్యంలో  ఈరోజు ఓట్ల లెక్కింపు జ‌రుగుతున్నందున‌ నందిగ్రామ్‌లో భారీగా కేంద్ర బలగాలను మోహ‌రించారు. 22 క్యూఆర్ టీమ్స్( త‌క్ష‌ణం స్పందించే టీమ్‌)ల‌ను నందిగ్రామ్‌లో సిద్ధం చేశారు. నందిగ్రామ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 

ప‌శ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్​ పేరు వినగానే ముందుగా హింస, రక్తపాతం గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం జరిగిన అల్లర్లే ఇందుకు కారణంగా క‌నిపిస్తాయి. అయితే ఆ తరువాత‌ పరిస్థితులు మారిపోయి ఆ ప్రాంతానికున్న ప్రాముఖ్యత‌ కాస్త తగ్గింది. తిరిగి ఇప్పుడు శాసనసభ​ ఎన్నికల్లో నందిగ్రామ్ పేరు మారుమోగిపోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆమెకు అత్యంత సన్నిహితుడిగా మెలిగి, ఆమ‌ధ్య‌నే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి పోటీప‌డ‌టమే ఇందుకు ప్ర‌ధాన కారణం. 2007లో ఈ ప్రాంతాన్ని కెమికల్​ హబ్​గా మార్చేందుకు నాటి వామపక్ష ప్రభుత్వం ప్ర‌య‌త్నించింది. రైతుల నుంచి భారీగా భూముల‌ను సేక‌రించాల‌నుకుంది. అయితే ఇందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగింది. ఈ నేప‌ధ్యంలో రైతులు-పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ స‌మ‌యంలో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం తన ప్ర‌య‌త్నాల‌ను విరమించుకుంది. 


ఈ ఉద్యమానికి సార‌ధ్యం వ‌హించిన‌ మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఫ‌లితంగా వామపక్ష ప్రభుత్వం కూలిపోయి, టీఎంసీకి అధికారం చేరువ‌య్యింది. నాడు జ‌రిగిన ఉద్య‌మంలో సువేందు అధికారి కూడా కీలకపాత్ర పోషించారు. ఇదేవిధంగా టీఎంసీ విజయానికి సువేందు స‌హ‌కారం అందించారు.  అలాంటి వీరిద్ద‌రూ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌స్ప‌రం త‌ల‌ప‌డ‌టం ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది. టీఎంసీ కంచుకోటగా ఉంటూ వ‌చ్చిన‌ నందిగ్రామ్​ రెండుగా చీలిపోయింది. సువేందు అధికారి బీజేపీలో చేరడంతో ఆయన మద్దతుదారులు, ప‌లువురు కార్యకర్తలు టీఎంసీని వీడి, బీజేపీ చెంత చేరారు. నందిగ్రామ్ లో టీఎంసీ- బీజేపీల‌ గెలుపు 50-50 అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. నందిగ్రామ్​లో ఇప్పటికీ మమతకు భారీగానే మ‌ద్దతు ఉంది. నందిగ్రామ్​ ఉద్యమంలో మ‌మ‌త‌ పాత్ర మరిచిపోలేనిద‌ని స్థానికులు చెబుతుంటారు. మమత, సువేందు తమకు తల్లీ కొడుకులాంటి వారని, ఎవరికి ఓటు వేయాలో అర్థంకావడం లేద‌ని పోలింగ్ జ‌రిగిన రోజున స్థానిక ఓట‌ర్లు చెప్పారు. ఇంతటి ఆస‌క్తిక‌ర చ‌రిత్ర క‌లిగిన నందిగ్రామ్‌లో అసెంబ్లీ సీటుకు జ‌రిగిన ఎన్నిక‌ల పోరులో ఫ‌లితాలు ఆసక్తిక‌రంగా మారాయి. దీంతో ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా సంచ‌ల‌న‌మే అని చెప్పుకోవ‌చ్చు. 

Updated Date - 2021-05-02T12:12:42+05:30 IST