పరీక్షల కోసం మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-06T23:08:01+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలపై..

పరీక్షల కోసం మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

కోల్‌కతా:  పశ్చిమబెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలపై మమతా బెనర్జీ సర్కార్ తాత్కాలికంగా నిషేధం విధించింది. మాధ్యమిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. మాల్డా, ముర్షీదాబాద్, ఉత్తర్ దీనజ్‌పూ‌ర్, కూచ్‌బెహర్, జల్పాయ్‌గురి, బిర్‌భూమ్, డార్జిలింగ్ జిల్లాల్లోని కొన్ని బ్లాకుల్లో సోమవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి 3.15 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అలాగే, ఈనెల 9, 11,12 తేదీల్లోనూ, 14 నుంచి 16వ తేదీ వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది.


రాష్ట్ర వ్యాప్తంగా మాధ్యమిక్ పరీక్షల కోసం 4,194 పరీక్షా కేంద్రాల్లో ఆఫ్‌లైన్ పరీక్షలు జరుగనుండగా, 11.2 లక్షల మంది హాజరుకానున్నారు. రాబోయే కొద్దిరోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ట్రాన్స్‌మిషన్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనీ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వార్తాపత్రికలపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని, తద్వారా ఎలాంటి సమాచార లోపం తలెత్తకుండా చూస్తున్నామని తెలిపింది.

Updated Date - 2022-03-06T23:08:01+05:30 IST