కేంద్రం, పశ్చిమ బెంగాల్ జగడం ఫెడరల్ వ్యవస్థకు సవాల్ : శివసేన

ABN , First Publish Date - 2021-06-13T19:07:48+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై శివసేన

కేంద్రం, పశ్చిమ బెంగాల్ జగడం ఫెడరల్ వ్యవస్థకు సవాల్ : శివసేన

ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సమస్యలను పరిష్కరించడానికి బదులు ‘థర్డ్ క్లాస్’ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టింది. శివసేన పత్రిక ‘సామ్నా’ ఆదివారం ఓ వ్యాసంలో కేంద్రం, పశ్చిమ బెంగాల్ మధ్య ఇటీవలి జగడాలను ప్రస్తావించింది. 


శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ‘సామ్నా’లో రాసిన వ్యాసంలో, ప్రస్తుత కేంద్ర-రాష్ట్ర జగడాలు సమాఖ్య పాలనా వ్యవస్థకు సవాలు విసురుతున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో బీజేపీ తీవ్రంగా బాధపడుతుండటం నిజమేనని, అయితే ఈ ఓటమిని కేంద్ర ప్రభుత్వం మనసుకు పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ రాజీనామాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఘర్షణ కొళాయి దగ్గర మంచినీటి కోసం మహిళల కొట్లాటలా ఉందన్నారు. 


బంధోపాధ్యాయ 1987 పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన మే 31న పదవీ విరమణ చేయవలసి ఉండగా, మూడు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే న్యూఢిల్లీలోని శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖలో మే 31 ఉదయం 10 గంటలకు హాజరవాలని తెలిపింది. బంధోపాధ్యాయ ఆ విధంగా హాజరు కాకుండా, పదవి నుంచి విరమించుకున్నారు. అనంతరం ఆయనను మమత బెనర్జీ తన చీఫ్ అడ్వయిజర్‌గా నియమించుకున్నారు. 


Updated Date - 2021-06-13T19:07:48+05:30 IST