ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2022-09-17T04:59:32+05:30 IST

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలో ఉన్న సందేహాలు, సస్పెన్స్‌లకు, మరిన్ని ప్రచారాలకు తెలుగుదేశం అధిష్టానం క్రమంగా తెరదించుతోంది.

ఎన్నికలకు లైన్‌ క్లియర్‌
చంద్రబాబుతో భేటీ అయిన ఏలూరు కన్వీనర్‌ చంటి

గెలుపు గుర్రాలకే అత్యధిక ప్రాధాన్యం
రామానాయుడు, రామరాజుకు పోటీకి మరో చాన్స్‌కు ఓకే
ఇదే రూటులో మరో అరడజను మంది
ముఖాముఖి భేటీల్లో చంద్రబాబు స్పష్టత
తాజా మాజీల్లో అత్యధికులకు ప్రాధాన్యత
సందిగ్ధత, సస్పెన్స్‌కు ఇక చెల్లుచీటి
వ్యూహాలకు పదును పెడుతున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం
ప్రజా పోరాటాలు కొనసాగించాల్సిందే  అంటూ సీరియస్‌ సూచనలు
తాజాగా బడేటి చంటితో చంద్రబాబు భేటీ


 (ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలో ఉన్న సందేహాలు, సస్పెన్స్‌లకు, మరిన్ని ప్రచారాలకు తెలుగుదేశం అధిష్టానం క్రమంగా తెరదించుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ తిరిగి  సీట్లు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనితో పశ్చిమ గోదావరి జిల్లాలోని శాసనసభా  పక్ష ఉప నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులకు లైన్‌ క్లియర్‌ అయినట్టే. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లతో ఇప్పటికే ముఖాముఖి భేటీ అవుతున్న చంద్రబాబు మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేయనున్నారు.

పాలకొల్లుకు నిమ్మల
ఇప్పటికే వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలపైగాని, వినూత్న నిర సనలు, అసెంబ్లీలో గళమెత్తడం, వీలైతే జిల్లాస్థాయిలో అందరినీ కూడగట్టుకుని అధికార పార్టీకి ఎదురొడ్డడం వంటి చర్యల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల ముందు వరుసలో ఉన్నారు. పార్టీలో అత్యంత సమర్థవంతంగా పనిచేసే నేతల్లో ఆయనొకరుగా చంద్రబాబు గుర్తించారు. అందుకనే చాలా అంశాల్లో పార్టీ అధినేత రామానాయుడు నుంచి సలహాలను స్వీకరిస్తున్నారు. తదనుగుణంగానే పార్టీకి దీటైన నాయకత్వం తన నియోజకవర్గంలో వహించడమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లోనూ దీని ప్రభావం ఉండేలా రామానాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి వరద సాయం, బడి పిల్లల సమస్యల్లోనూ దూకుడు ప్రదర్శించడమే కాకుండా పార్టీ ఆశించినట్టు స్పష్టమైన వైఖరి అవలంభించారు. రెండోసారి పాలకొల్లు నుంచి ఎన్నికైన ఆయన అక్కడ పట్టు సడలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుటుంబపరమైన సమస్యలు ఎదురైనా, వ్యక్తిగతంగా తను ఇబ్బందికి గురైనా వీటిని ఖాతరు చేయకుండా ప్రజాభిమానం కూడగట్టుకోవడంలో నిమ్మల మెరుగైన స్థానంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న లుకలుకలను గమనిస్తూనే పార్టీపరంగా తాను వ్యూహం ప్రకారం వ్యవహరించడం వంటి పరిణామాలను కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. శాసన సభలో పార్టీ ఉపనేతగా ఆయన ఇప్పటికే గళం విప్పడంలో తిరుగులేని పనితనం చూపించారు. గత ఎన్నికలకు ముందుగానే పాలకొల్లు నుంచి పోటీ చేసే అభ్యర్థి రామానాయుడే అంటూ అప్పట్లో నారా లోకేశ్‌  రాష్ట్రంలో తొలి ప్రకటన చేయడం, ఇప్పుడు తిరిగి సిట్టింగ్‌లకే మరో అవకాశం అంటూ చంద్రబాబు ప్రకటించడం సహజంగానే పాలకొల్లులో మంచి ఊపునిచ్చేలా చేసింది.

ఉండిలో రామరాజు

మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసేలా పార్టీ అధిష్టానం ఒప్పించింది. ఆయన స్థానంలో రామరాజుకు అవకాశం ఇవ్వడంతో అలవోకగా గెలుపొందారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేపై వైసీపీ అనేక ఆటంకాలు సృష్టించింది. పార్టీ మారతారంటూ దుమారం రేపి టీడీపీ కార్యకర్తల్లో కాస్త గందరగోళం నింపేందుకు ప్రయత్నించింది. ఆక్వా వ్యాపారంలో రామరాజుకు వున్న పరిచయాలను తెర ముందుకు తీసుకువచ్చారు. అయినప్పటికీ వీటికి దీటుగా పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోవడం ప్రారంభించారు. కరోనా రెండో విడత అనంతరం నియోజకవర్గంలో పూర్తిగా నిలదొక్కుకోవడానికి మిగతా కేడర్‌ను, నేతలను కలుపుకోవడం మరో కారణమైంది. ఇప్పుడు తనంతట తానుగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించడం, రోడ్ల మీద నాట్లు వేయడం, వైసీపీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక చర్యలను నిలదీయడం వంటి అన్నింటిలోనూ ప్రాచుర్యంలోకి వచ్చారు. రామరాజుకు సీటు ఇస్తారా, మార్చి ఇంకొకరికి అవకాశం ఇస్తారా అనేక సందేహాలకు చంద్రబాబు ప్రకటన పటాపంచలు చేసింది.

మిగతా వారికి కలిసొచ్చినట్టేనా
పార్టీ వ్యవహారాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు ఏ రీతిన పనిచేస్తున్నారు.  ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో వారికున్న మార్కులు, రిమార్కులు, చురుకైన పాత్ర పోషిస్తున్నారా ? అలసత్వం ప్రదర్శిస్తున్నారా ? అనే అంశాలపై తెలుగుదేశం అధిష్టానం పూర్తిస్థాయిలో ఆరా తీసింది. ఆయా నివేదికలను దగ్గర పెట్టుకుని నియోజకవర్గాల వారీగా నేతలను తన వద్దకు రప్పించుకుని చంద్రబాబు ముఖాముఖి భేటీ అవుతున్నారు. ఇప్పటికే తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి ఎమ్మెల్యే రామరాజుల భేటీ విజయవంతంగా ముగిసింది. వీరిద్దరికీ ఆయా భేటీల్లోనే అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు లభించాయి. ఆచంట నుంచి తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత పితాని సత్యనారాయణ, ఉంగుటూరు నుంచి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌, పోలవరం నుంచి ఎం.శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం నుంచి వలవల బాబ్జీలతో ముఖాముఖి భేటీ జరిగే సమయంలో అధినేత ఇలాంటి స్పష్టత ఇవ్వనున్నారు. చింతలపూడి, భీమవరం, నరసాపురం లలో సందిగ్ధతకు పూర్తిగా తెరదించడమే కాకుండా ఈ నెలాఖరులోపు ఆ నియోజక వర్గాల్లోను గెలుపు గుర్రాలను పార్టీ ఫైనలైజ్‌ చేయబోతోందని చెబుతున్నారు. పార్టీ సీనియర్‌ నేత పితాని సత్యనారాయణకు ఆచంట నియోజకవర్గంలో పూర్తిగా సానుకూలత కనిపించడం, దీని ప్రభావం అటు పాలకొల్లు, తణుకు, నరసాపురంపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే పితానిపై అధిష్టానం పూర్తి సానుకూలతతో వ్యవహరిస్తోంది. బీసీ వర్గాలకు ప్రతినిధిగా ఆయనకు ఒకింత ప్రాధాన్యత ఇస్తోంది.

చంటి.. ఇక చకచక
‘వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రజలతో  కలిసి తిప్పికొట్టడం, నిలదీయడంలో ఒకింత చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి నుంచే మీరు సిద్ధం కావాలి. దానికనుగుణంగా కేడర్‌ను, స్థానిక నేతలతో ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఆపొద్దు’ అని ఏలూరు పార్టీ కన్వీనర్‌ బడేటి చంటితో పార్టీ అధినేత చంద్రబాబు అన్న మాటలివి. పార్టీ కన్వీనర్లతో ముఖాముఖిలో భాగంగా శుక్రవారం ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ చంటి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా వీరిద్దరి మధ్య పరస్పర అంశాలపై చర్చ సాగింది. పార్టీ సభ్యత్వం ఎంత వరకు వచ్చింది? ఈ మధ్య కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఏ మేరకు దూకుడుగా వెళ్ళారు ? స్థానిక సమస్యలపై ఎలా పోరాటాలకు దిగుతున్నారు ? కేడర్‌ పూర్తిగా కలిసొస్తుందా ? అంటూ ఆరా తీస్తూనే చంద్రబాబు సూచనలు చేశారు. ఏలూరు నియోజకవర్గం సంప్రదా యంగా ఎన్నికల గాలి అనుకూలంగా ఉన్నప్పు డు సానుకూల ఫలితాలు వస్తాయని, ఇప్పుడు కూడా పార్టీకి ఆ దిశగానే గెలుపు లభించేలా స్పష్టతతో కూడిన కార్యాచరణ అవసరం అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సంకేతాలు ఇవ్వడంతో చంటికి దాదాపు లైన్‌ క్లియర్‌ అయినట్టే. ఇప్పటిదాకా నియోజకవర్గ టీడీపీ వ్యవహారా లపై వివిధ రకాల ప్రచారాలు చేసిన కొందరికి చంద్రబాబు కీలక నిర్ణయం గొడ్డలిపెట్టే. ఏలూ రు టీడీపీ కేడర్‌ కూడా చంద్రబాబు తాజా సూచనలతో ఆనందంతో మునిగితేలుతోంది.

Updated Date - 2022-09-17T04:59:32+05:30 IST