కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నాం.. ఆదుకోరూ

ABN , First Publish Date - 2022-05-19T06:34:03+05:30 IST

కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ్‌ జిల్లాలో చిక్కుకుపోయిన తమను ఆదుకోవాలని తిప్పర్తికి చెందిన ఐదుగురు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని కోరారు.

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నాం.. ఆదుకోరూ
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న ఈశ్వరాచారి

 ఈ నెల 17న భారీవర్షంతో విరిగిన కొండచరియలు

 ఆదుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యేకు వినతి

తిప్పర్తి, మే 18: కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ్‌ జిల్లాలో చిక్కుకుపోయిన తమను ఆదుకోవాలని తిప్పర్తికి చెందిన ఐదుగురు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని కోరారు. బాధితుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిప్పర్తి గ్రామానికి చెందిన బాణాల ఈశ్వరాచారి కొన్ని సంవత్సరాలుగా నల్లగొండ పట్టణంలో నివసిస్తున్నాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఈశ్వరాచారి, మాధవి దంపతులు, మహిళా ప్రాంగణానికి చెందిన గోర్క శివారెడ్డి, కోటేశ్వరమ్మ, జంగా శివకుమారితోపాటు మొత్తం ఐదుగురు కేదార్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. 15వ తేదీ సాయంత్రం నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడినుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. అక్కడినుంచి హరిద్వార్‌ వెళ్లి, 16వ తేదీ ఉదయం కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. 17వ తేదీ కేదార్‌నాథ్‌ గుట్టపైకి బయలుదేరేందుకు సిద్ధంకాగా భారీ వర్షం కురిసింది. దాంతో అక్కడ ఉన్న గుట్టలు రోడ్డుపై పడి రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఎక్కడికిక్కడ వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. రెండు రోజులుగా వారు ఉన్న ప్రదేశంలో కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై ఎక్కడికీ వెళ్లలేకుండా ఉండటంతో నల్లగొండలోని బంధువులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తమ ప్రాంతానికి చెందినవారిని హెలికాప్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుతూ ఉత్తారాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ్‌ కలెక్టర్‌కు లేఖ పంపారు. ఈ సందర్భంగా ఈశ్వరచారి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మార్గం పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడికీ వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. ఇక్కడి నుంచి వెళ్లడానికి హెలికాప్టర్‌ తప్ప మరో మార్గం లేదని, తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఈశ్వరాచారి వేడుకుంటున్నారు.   

Updated Date - 2022-05-19T06:34:03+05:30 IST