కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉండాలి. అయితే ఇందుకోసం మందులూ లేకపోలేదు. అయితే వీటి అవసరం ఎవరికి?
ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే ప్రతి ఒక్కరికీ వ్యాధినిరోధకశక్తి మెరుగ్గానే ఉంటుంది. రోజుకు 8 గంటలు తక్కువ కాకుండా నిద్రపోతూ, పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేసేవారిలో రోగనిరోధకశక్తి తప్పకుండా మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి వీరికి అదనంగా మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే వీరితో పోల్చుకుంటే పిల్లల్లో, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువే! అలాగే వీరికంటే కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్సలు తీసుకుంటున్నవారు, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌తో బాధపడుతూ స్టెరాయిడ్లు వాడుతున్న వారు, మధుమేహులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగి ఉన్నవారు, వ్యాధినిరోధకశక్తిని తగ్గించి ఉంచే మందులు వాడే అవయవ గ్రహీతలలో రోగనిరోధకశక్తి మరింత బలహీనంగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వైద్యుల సూచన మేరకు రోగనిరోధకశక్తిని పెంచే ఇమ్యూన్ బూస్టర్స్ వాడడం ద్వారా ప్రబలే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.