Abn logo
Aug 6 2021 @ 00:49AM

కళాకారులకు ఆప్తుడు

-మిత్రుడు జిఎల్ఎన్ మూర్తి (అ)కాలధర్మం చెంది ఏడాది అయిందంటే అది నమ్మలేని నిజం. వందలాదిమంది తెలుగు కళాకారులకీ, సాహితీమిత్రులకీ ఆయన తలలో నాలుక. బతికినంతకాలం ఆయనొక కదిలే స్ఫూర్తిగా, గొప్ప స్నేహశీలిగా పరిచితులందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పాఠకులకు ఆయన సాంస్కృతిక విలేకరిగా తెలుసు. సన్నిహిత పరిచయం ఉన్నవారికి ఆయనొక నిరాడంబరుడు. పరోపకారి. తన ఆర్థిక పరిమితులను పట్టించుకోకుండా తరచూ గుప్తదానాలు చేసేవాడని చాలా కొద్దిమందికే తెలుసు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉద్యోగిగా, ఉద్యోగుల సంఘంలో ఒక నాయకుడిగా చురుకుగా పనిచేస్తూనే వారి పోరాటాలలో అప్పుడప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉండేవాడని అక్కడి వారికి మాత్రమే తెలుసు. అంతేకాదు. ఆయన ఏపీ పౌరహక్కుల సంఘంలో సభ్యుడనేది కొందరికి వార్త కావచ్చు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారుల్లో అత్యధికులకు మూర్తి బాగా తెలుసు. కొందరు కళాకారులకు -ముఖ్యంగా జానపద కళాకారులకు - సాంస్కృతిక శాఖ ఇచ్చే ‘మర్యాద’ చూసి మూర్తి చలించిపోయేవాడు. ఒకసారి ఎక్కడో అదిలాబాద్, శ్రీకాకుళం లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద జానపద కళాకారులకు శిథిలమై, ముక్కి వాసన కొడుతున్న నాంపల్లి సరాయ్ (సత్రం)లో ‘బస’ ఏర్పాటు చెయ్యడం సహించలేకపోయాడు. అలాగే రవీంద్రభారతి మెయిన్ ఆడిటోరియంను ప్రైవేటు ప్రోగ్రామ్‌లకు అద్దెకిచ్చి, జానపదులకు ట్యాంక్‌బండ్ కేటాయించడం లేదా ట్రాఫిక్ రొద మధ్య ఘంటసాల కళాప్రాంగణం అనే బహిరంగ ప్రదేశంలో వేదికనివ్వడం ఆయనకు మింగుడు పడేది కాదు. సాంస్కృతిక కార్యక్రమాల మీద సమీక్షలు, కళాకారులకు కల్పించే సౌకర్యాల మీద పత్రికలో మూర్తి రాసే రిపోర్టుల వల్ల, ఫర్వాలేదు, మనల్ని పట్టించుకునేవాడొకడున్నాడు అనే భావన నాటక, నాట్య, జానపద, సంగీత కళాకారుల్లో కలిగినందువల్లనే ఆయన పట్ల వారికంత అభిమానం. కొంతమంది సాంస్కృతిక శాఖ అధికారులకు, రేపు మూర్తి ఏం రాయబోతున్నాడో అనే సస్పెన్స్ ఉండేది. తంజావూర్ జిల్లా మేలటూర్ గ్రామంలో రెండు భాగవత బృందాలున్నాయి. వారు ఏటా మూడు రాత్రుల భాగవత మేళా జరుపుతారు. అక్కడ పీష్వాల పాలనాకాలంలో మేలటూర్ వెంకటరామ శాస్త్రి రచించిన తెలుగు యక్షగానాలు వందల ఏళ్ళ నుంచి ప్రదర్శిస్తున్నారు. అవి ప్రహ్లాద చరిత్ర, హరిశ్చంద్ర చరిత్ర, మార్కండేయ చరిత్ర వగైరా. రెండు బృందాలకూ చెందిన నటరాజన్, మహాలింగం.. మూర్తికి బాగా పరిచితులు. మూర్తీ, నేనూ ఆ ప్రదర్శనలు రెండుసార్లు చూశాం. మహాలింగం బృందం మెదక్ జిల్లా లింగంపల్లి గ్రామం ఆలయంలో ఇచ్చిన ప్రదర్శనను కూడా వెళ్లి చూశాడు. 


హైదరాబాద్ ఫిలింక్లబ్ తెప్పించే నాన్-హాలీవుడ్ సినిమాలూ, అలాగే ఆఫ్ బీట్ ఇండియన్ సినిమాలూ సారథి స్టూడియో ప్రీవ్యూ థియేటర్‌లో వేసే రోజుల్లో అక్కడ మూర్తి కచ్చితంగా హాజరయ్యేవాడు. తెలుగు నేల మీదనే కాదు. దేశంలో ఎక్కడ తెలుగు నాటకం జరుగుతుందని తెలిసినా అక్కడ మూర్తి హాజరు. ఖర్చులన్నీ తనవే. ఎక్కడున్నారు అని అడిగితే బెంగళూరు అనో, బాంబే అనో, చిలకలూరిపేట అనో, విజయనగరం అనో, కావలి అనో జవాబు. కన్యాశుల్కం పూర్తి నిడివి నాటకం ఉత్తరాంధ్ర వారు ప్రదర్శించే రోజుల్లో ఆయన సంబరం అంతా ఇంతా కాదు. పాటిబండ్ల ఆనందరావు మెగా నాటకం ‘పడమటి గాలి’ చూసి పదిమందికీ గొప్పగా చెప్పి సంతోషించాడు. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలతో పాటు ఉదయభాను, ఇండ్ల చంద్రశేఖర్, రాజీవ్ వెలిచేటి రూపొందించే ఆధునిక నాటకాలకు మూర్తి ముందువరసలో ఉండవలసిందే. గుమ్మడి గోపాలకృష్ణ, బాబురాజ్ వేసే పౌరాణిక నాటకాలకు, వై.జీ. మహేంద్రన్ తమిళ నాటకాలకు మూర్తి రెగ్యులర్ ప్రేక్షకుడు. గొప్ప గొప్ప వాటితో పాటు నాసిరకం నాటకాలు సైతం ఓపికగా చూసి తోచిన సలహాలు ఇవ్వడం మూర్తికి అలవాటు.


చివరిసారిగా ఆయన చనిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు రావిర్యాల (శంషాబాద్)లో ఆయన ఉంటున్న కొత్త ఇంటికి నేనూ, మరో మిత్రుడు సుదర్శన్ వెళ్లాం. లాక్‌డౌన్ రోజుల్లో తాము ఓటీటీలో చూసిన దాదాపు ఇరవై మళయాళ, తమిళ సినిమాల గురించి మూర్తీ, ఆయన శ్రీమతీ చాలా ఉత్సాహంగా చెప్పారు. రెండు గంటల పైగా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆయన కన్నుమూశాడన్న వార్త వందలాదిమంది మిత్రులకు షాక్. అందరిలోనూ ఒక ఆత్మీయుడు హఠాత్తుగా పోయాడనే ఆవేదన. మంచితనం అరుదుగా ఉన్న లోకం నుంచి ఒక మంచి మనిషి సెలవు తీసుకోవడం ఓ తీరని విషాదం.

వి.యస్. ప్రకాశరావు

(ఆగస్టు 7: జిఎల్ఎన్ మూర్తి తొలి వర్థంతి)­

ప్రత్యేకంమరిన్ని...