ఖజానాకు కరోనా!

ABN , First Publish Date - 2020-04-01T08:04:15+05:30 IST

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. అసలే మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పరిస్థితిపై కరోనా సంక్షోభం వచ్చిపడింది. ఫలితంగా అన్ని రంగాల నుంచి ఆదాయం

ఖజానాకు కరోనా!

  • మాంద్యం కష్టాల్లోనే కరోనా సంక్షోభం
  • పలు రంగాల్లో పడిపోతున్న వ్యాపారం
  • బాగా తగ్గిపోయిన రాష్ట్ర ఆదాయం
  • జీతాలు, పింఛన్లు, రుణాల చెల్లింపులకు ఇబ్బంది
  • మిగతా అన్ని రకాల చెల్లింపులూ వాయిదా
  • రూ.10 వేల కోట్ల ఓడీకి ఆర్బీఐ వద్దకు ప్రభుత్వం!
  • నేటి నుంచే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. అసలే మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పరిస్థితిపై కరోనా సంక్షోభం వచ్చిపడింది. ఫలితంగా అన్ని రంగాల నుంచి ఆదాయం తగ్గిపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ)’కి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏప్రి ల్‌ నెల ఆర్థిక అవసరాల నిమిత్తం రూ.10 వేల కోట్ల ఓడికి అనుమతి కోసం రిజర్వ్‌ బ్యాంకును ఆశ్రయించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు అవసరమైతే వివిధ రుణాల చెల్లింపుపై మారటోరియం విధించాలనీ కోరనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులుగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయిందని సీఎం కేసీఆరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీతాల కొంతమేర వాయిదా కూడా ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనుదారులు 4 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వారికి నెలకు దాదాపు రూ.2,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.


ఆ చెల్లింపుల్లో కొంత శాతా న్ని వాయుదా వేయడం ద్వారా సుమారు వెయ్యికోట్ల మేర భారం తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అలాగే రూ.800 కోట్ల దాకా వృద్ధాప్య, వితంతు పింఛన్ల వంటివాటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఇవే కాక.. రుణాల చెల్లింపు, వడ్డీల చెల్లింపుల కోసం రూ.3-4 వేల కోట్ల మేర నిధులు అవసరం ఉంటుందని అంచనా. మామూలురోజుల్లో అయితే ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల ఆదాయం వివిధ రూపాల్లో వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆదాయంలో భారీ కోత పడింది. దాంతో అత్యవసర చెల్లింపులకు కూడా ప్రభుత్వం వద్ద సరైన నిధులు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓడీకి వెళ్లాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బుధవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే ఓడీకి వెళ్లాల్సి వస్తోంది.


అన్ని రంగాల్లో..

మాంద్యం కారణంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో అనుకున్న విధంగా ఆదాయం రాలేదు. దీని ప్రభావం కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఒక కారణంగా మారుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గణాంకాలు చూస్తే.. ఏడాదిలో 1.13 లక్షల కోట్ల ఆదాయం రావాల్సి ఉండ గా, జనవరి వరకూ రూ.79,488 కోట్లు వచ్చింది. అందులో పన్నుల రూపంలో రూ.67,574 కోట్లు రాగా, పన్నేతర ఆదాయం రూ.3,456 కోట్లు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో మరో రూ.8,456 కోట్ల ఆదాయం సమకూరింది. 2019-20 బడ్జెట్‌ రూ.1.36 లక్షల కోట్లు కాగా, 2020-21 బడ్జెట్‌ను ఏకంగా రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ పెట్టే నాటికి కరోనా విపత్తు చైనాను కుదిపేస్తున్నప్పటికీ అది మన వరకూ వస్తుందని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఊహించలేదు. అందుకే, అనేక రంగా ల నుంచి భారీ ఆదాయాన్ని అంచనా వేసి బడ్జెట్‌ను పెంచేశారు. పన్ను ఆదాయం ద్వారా రూ.85 వేల కోట్లు వస్తుందని చూపించారు. పన్నేతర ఆదాయం రూ.30 వేల కోట్లు, కేంద్రం గ్రాంట్లు రూ.16 వేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు.


కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ పౌలీ్ట్ర. దేశంలోనే తెలంగాణ పౌలీ్ట్రకి మంచి పేరుంది. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూఇక్కడి నుంచి పౌలీ్ట్ర ఎగుమతులు ఉంటాయి. కరోనా కారణంగా ఈ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయింది. హోటళ్లు, రవాణా, పర్యాటక రంగాల్లోనూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ ముగిసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినా ఈ రంగాల్లో మునుపటి వైభవం రావడానికి చాలాకాలం పడుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికీ పన్ను ఆదాయం తగ్గే అవకాశం ఉంది. సినిమా రంగం నుంచి వచ్చే వినోద పన్ను ఆగిపోయింది. విందులు, ఈవెంట్లు, ఇతర ఫంక్షన్లు తగ్గిపోవడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. కరోనా ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే నిర్మాణ రంగానికీ కష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు.


నిర్మాణ రంగం బాగుంటే స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, పె ట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లు బాగుంటాయి. ఈ రంగంలో వేగం తగ్గితే వాటి కొనుగోళ్లు అనుకున్నంత ఉండవు. దాంతో రాష్ట్రానికి రావాల్సిన సేల్స్‌ ట్యాక్సు, జీఎస్టీ వంటి పన్నులతో పాటు సేవా రంగం ద్వారా వచ్చే ఆదా యం భారీగా పడిపోనుంది. నిర్మాణ రంగం సంక్షోభంలో పడితే పన్నేతర ఆదాయమూ దెబ్బ తింటుంది. వచ్చే ఏడాది సుమారు రూ.30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. నిర్మాణ రంగంలో సమస్యలు ఉత్పన్నమైతే భూముల కొనుగోళ్లు అనుకున్నంతగా జరగవు. దాంతో రాష్ట్ర ఆదాయంపై తీవ్రప్రభావం పడే ప్రమాదం ఉంది.

Updated Date - 2020-04-01T08:04:15+05:30 IST