వసతిగృహ విద్యార్థుల ఆకలికేకలు

ABN , First Publish Date - 2021-04-17T05:55:53+05:30 IST

జిల్లాలోని వసతిగృహాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వేలాదిమంది జిల్లాలో కాలే కడుపులతో బడుల్లోనే విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10.30 నుంచి రాత్రి ఏడు గంటల వరకు మంచినీటితోనే తమ చదువులను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం ఉదయం 10.30గంటలకే పెడుతుండటం హాస్టళ్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.

వసతిగృహ విద్యార్థుల  ఆకలికేకలు
విద్యార్థుల కోసం తెచ్చిన సంకటిలాంటి భోజనం

పాఠశాలల్లో ఉదయం 10.30కే మధ్యాహ్న భోజనం

అప్పటి నుంచి రాత్రి 7గంటల వరకు 

ఆకలితోనే అలమటిస్తున్న విద్యార్థులు

నాసిరకంగా భోజనం తినలేని పరిస్థితి 

పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 16: జిల్లాలోని వసతిగృహాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వేలాదిమంది జిల్లాలో కాలే కడుపులతో బడుల్లోనే విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10.30 నుంచి రాత్రి ఏడు గంటల వరకు మంచినీటితోనే తమ చదువులను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం ఉదయం 10.30గంటలకే పెడుతుండటం హాస్టళ్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. వసతిగృహాల్లో విద్యార్థులకు అల్పాహారం అందించి స్కూళ్లకు పంపుతారు. వారు మఽధ్యాహ్నం పాఠశాలల్లో అందించే భోజనం తినాల్సి ఉంది. ఇక అప్పటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఏం ఉండదు. ఆ తర్వాత హాస్టల్‌ పెట్టే అరకొర భోజనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మధ్యలో దాదాపు 9గంటల పాటు విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట స్నాక్స్‌ అందించాల్సి ఉండగా వాటిని కూడా ప్రభుత్వం వసతిగృహాల్లో సక్రమంగా అందించటం లేదు. ఒకవేళ స్నాక్స్‌ అంటే ఒక వేరుశనగ ముద్ద ఇస్తున్నారు. జిల్లాలో 10వతరగతి వరకు చదువుకునే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 89వసతిగృహాలు నడుస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఐదువేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వెనుకబడిన సంక్షేమశాఖ హాస్టళ్లు 76 నడుస్తున్నాయి. వీటిలో ఏడు వేలమంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాల్లో దాదాపు 3వేలమంది చదువుకుంటున్నారు. వీరంతా ప్రస్తుతం ఆకలితో అలమటిస్తూనే చదువులు కొనసాగిస్తున్నారు. వసతిగృహాల విద్యార్థుల దీనస్థితిని చూసి పాఠశాల ఉపాధ్యాయులు అయ్యో అంటున్నారే గాని అటు ప్రభుత్వానికి గాని ఇటు సంక్షేమశాఖ అధికారులకు గాని చీమకుట్టినట్లయినా అనిపించటం లేదు. 


మధ్యాహ్న భోజనం కూడా అరకొరగానే..

పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం పూర్తిగా నాసిరకంగా ఉంటోంది. అన్నం ఉడ కటం లేదు. ఉడికితే చిమిడిపోయి ఉంటుంది. అధ్వానంగా మాడిపోయి ఉన్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నారు. ఏక్తాశక్తి సంస్థ సరఫరా చేస్తున్న పాఠశాలల్లో భోజనం మరీ దారుణంగా ఉంటోంది. దీన్ని విద్యార్థులు తినేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. వసతిగృహాల విద్యార్థులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భోజనమే తింటున్నారు. ఇతర విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ముట్టకుండా ఇళ్ళకు వెళ్లి తింటున్నారు. జిల్లాలోని మూడో వంతు మండలాలకు ఏక్తాశక్తి సంస్థ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ఈ మండలాల్లోని పాఠశాలల్లో అందిస్తున్న భోజనం తప్పనిసరి పరిస్థితుల్లో వసతిగృహాల విద్యార్థులే తింటున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ళకు వెళ్లి తింటున్నారు. ఇలా నాసిరకం భోజనం తింటున్న విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.


 జ్వరం వస్తే ఇంటికే..

ప్రస్తుతం వసతిగృహాల్లో అనేకమంది విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు అసలు అమలు కావటం లేదు. విద్యార్థులకు ఏడాదికాలంగా కాస్మెటిక్‌ చార్జీలు అందటం లేదు. పాఠశాలల్లో అందరూ విద్యార్థులు మాస్కులు పెట్టుకుని తరగతులకు హాజరవుతుండగా వసతిగృహాల విద్యార్థులే అవి లేకుండా హాజరవుతున్నారు. వసతిగృహాల్లో మాస్కుల పంపిణీ జరగలేదు. శానిటైజర్‌ ఎలా ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియటం లేదు. కొవిడ్‌ వచ్చి జ్వరం వస్తే వెంటనే వార్డెన్లు తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించేస్తున్నారు. హాస్టళ్లకు మందుల సరఫరా కూడా నిలిచిపోయింది. కొవిడ్‌ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వసతిగృహాల విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

Updated Date - 2021-04-17T05:55:53+05:30 IST