సమస్యల్లో సంక్షేమ వసతి గృహాలు! విద్యార్థుల ఆహార నాణ్యతపై దెబ్బ

ABN , First Publish Date - 2022-08-10T16:09:33+05:30 IST

భోజనం నాసిరకం.. వసతి ఇబ్బందికరం.. సబ్బులు కొందామంటే డబ్బులు లేవు.. విద్యార్థులు(students) టూత్‌ పేస్టు, కొబ్బరి నూనె ఇంటి నుంచే తెచ్చుకోవాలి.. అప్పులు చేసి.. ఆఖరికి బంగారం కుదువ పెట్టి సరుకులు తెస్తున్న

సమస్యల్లో సంక్షేమ వసతి గృహాలు! విద్యార్థుల ఆహార నాణ్యతపై దెబ్బ

నెలలుగా పెండింగ్‌లో బిల్లులు

ఒక్కో జిల్లాల్లో రూ.కోట్లలో బకాయి!

సరుకుల ఖరీదుకు వార్డెన్ల అప్పులు

బంగారం కుదువపెట్టి కొనుగోళ్లు

డబ్బులు రాక కాంట్రాక్టర్ల లబోదిబో

విద్యార్థుల ఆహార నాణ్యతపై దెబ్బ

టూత్‌పేస్టు, సబ్బులు ఇంటి నుంచే..


హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): భోజనం నాసిరకం.. వసతి ఇబ్బందికరం.. సబ్బులు కొందామంటే డబ్బులు లేవు.. విద్యార్థులు(students) టూత్‌ పేస్టు, కొబ్బరి నూనె ఇంటి నుంచే తెచ్చుకోవాలి.. అప్పులు చేసి.. ఆఖరికి బంగారం కుదువ పెట్టి సరుకులు తెస్తున్న వార్డెన్లు(Wardens).. బిల్లులు రాక లబోదిబో అంటున్న కాంట్రాక్టర్లు! ఇదీ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి. లక్షలమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన హాస్టళ్లకు ప్రభుత్వం నిధుల విడుదలను జాప్యం చేస్తుండడంతో నిర్వహణ రోజురోజుకు ఇబ్బందిగా మారుతోంది. రాష్ట్రంలో మొత్తం 1,750 హాస్టళ్లుండగా 650 పోస్ట్‌ మెట్రిక్‌, మిగతావి ప్రి మెట్రిక్‌ హాస్టళ్లు. సుమారు 2.50 లక్షలమంది విద్యార్థులు వీటిలో ఉంటూ స్థానికంగా ఉన్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. అయితే, సగం పైగా హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బీసీ హాస్టళ్లలో ప్రి మెట్రిక్‌కు  సొంత భవనాలు ఉండగా, పోస్ట్‌ మెట్రిక్‌వి అన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అద్దెలను ప్రతి నెల కాకుండా సంవత్సరానికి రెండు, మూడు దఫాల్లో ప్రభుత్వం విడుదల చేస్తున్నది. దీంతో భవనాలకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే యజమానులు సరిగా స్పందించడం లేదు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా హాస్టళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు భారీగానే ఉన్నాయి. కొన్నింటికి 2 నెలలు, మరికొన్నింటికి 5 నెలల నుంచి చెల్లింపులు లేవు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రూ.4.60 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.1.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ హాస్టళ్లకు రూ.60 లక్షలు, ఎస్సీ హాస్టళ్లకు రూ.1.18 కోట్లు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రూ.2.50 కోట్లు బకాయి పేరుకుంది.


మెస్‌ చార్జీల కింద 3-7 తరగతి విద్యార్థులకు నెలకు రూ.950, 8-10 తరగతులవారికి రూ. 1,100, ఇంటర్‌, డిగ్రీ వారికి రూ.1,500ను ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ చార్జీలు చాలాచోట్ల నెలల తరబడి ఇవ్వడం లేదు. దీంతో ఆహార నాణ్యతపై ప్రభావం పడుతున్నది. ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం అందించాలి. వారానికి రెండుసార్లు గుడ్డు, అరటి పండ్లు, ఒకట్రెండు రోజులు చికెన్‌ ఇవ్వాలి. కానీ, పప్పు, కూర స్థానంలో నీళ్ల చారు, చికెన్‌ నామమాత్రంగా పెడుతున్నారు. సన్న బియ్యంతో వంట చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పౌర సరఫరాల శాఖ నుంచి అందుతున్న బియ్యం చాలా సందర్భాల్లో సరిగా ఉండడం లేదు. ఒక్కోసారి నూకలే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తినేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. స్నానం, దుస్తులు ఉతికేందుకు సబ్బులు, పళ్లు తోముకునేందుకు పేస్టు, కొబ్బరి నూనె, కటింగ్‌కు చెల్లించే కాస్మొటిక్‌ చార్జీలను కొద్ది నెలలుగా ఇవ్వడం లేదు. బాలురకు నెలకు రూ.62, బాలికలకు రూ.75 ఇస్తుండగా ఇవి ఏమాత్రం చాలడం లేదు. విద్యార్థులు తమను చూసేందుకు వచ్చే తల్లిదండ్రుల ద్వారానో, సెలవులకు ఊరెళ్లినప్పుడో సమకూర్చుకుంటున్నారు. మరోవైపు.. మెస్‌ చార్జీలను ఎప్పటికైనా ప్రభుత్వం విడుదల చేస్తుందనే ఉద్దేశంతో వార్డెన్లు కూరగాయలు, పాలు, గుడ్లు, చికెన్‌, పండ్లు ఇతర వస్తువులను అరువుపై లేదా అప్పు తెచ్చి కొంటున్నారు. కొందరు వార్డెన్లు బంగారం కుదువపెడుతున్నారు. ‘‘ప్రభుత్వం సమయానికి ఇవ్వడం లేదు. బంగారం కుదువ పెట్టి బకాయిలు కట్టిన వారు చాలామందే ఉన్నారు’’ అని హాస్టల్‌ వార్డెన్‌ ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


అరకొర జీతం.. మూడు నెలలకోసారి!

మెస్‌ చార్జీలు, అద్దెలే కాదు సిబ్బంది వేతనాల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి వంద మంది విద్యార్థులకు ముగ్గురు సిబ్బంది ఉండాలి. బీసీ సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లకే రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లన్నింటిలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందే ఉన్నారు. వీరికి వచ్చేదే తక్కువ జీతం అదికూడా 3, 5 నెలలకు ఒకసారి చెల్లిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


విలీనంపై అధికారుల దృష్టి

సరైన వసతి, ఆహారం లేకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు(parents) ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రి మెట్రిక్‌ హాస్టళ్లలో చాలావరకు ఖాళీలు ఉన్నాయి. కాస్త పెద్దవారు కావడం, బయట రూ.వేలకు వేలు చెల్లించాల్సి ఉండడంతో పోస్ట్‌ మెట్రిక్‌లో విద్యార్థులు సర్దుకుపోతున్నారు. ఆదరణ కరువవడం, నిర్వహణ భారంగా మారడంతో విద్యార్థులు తక్కువగా ఉన్న హాస్టళ్లను విలీనం చేసే విషయంపై సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు దృష్టిసారించారు. అద్దెల భారం తగ్గడంతో పాటు, విద్యార్థులంతా ఒకే దగ్గర ఉంటారని ప్రతిపాదిస్తున్నారు.



Updated Date - 2022-08-10T16:09:33+05:30 IST