సంక్షేమ.. రుణం!

ABN , First Publish Date - 2020-09-19T09:29:40+05:30 IST

‘సంక్షేమం’కాస్తా రుణ రూపం సంతరించుకుంటోంది. ‘నేరుగా ప్రతి ఏటా మీ ఖాతాలోకే సొమ్ములు’ అనే విధానం స్థానంలో... ‘బ్యాంకు నుంచి రుణం తీసుకోండి’

సంక్షేమ.. రుణం!

బ్యాంకులతో సర్కారు బేరం

అప్పుగా ఆసరా, చేయూత సొమ్ము

ఒకేసారి చెల్లించేలా యోచన

వడ్డీ ఎవరు కట్టాలో తెలియదు

అసలుపైనా అయోమయమే

బ్యాంకర్లలోనే కొరవడిన స్పష్టత


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘సంక్షేమం’కాస్తా రుణ రూపం సంతరించుకుంటోంది. ‘నేరుగా ప్రతి ఏటా మీ ఖాతాలోకే సొమ్ములు’ అనే విధానం స్థానంలో... ‘బ్యాంకు నుంచి రుణం తీసుకోండి’ అనే కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తోంది. ఏరోజుకారోజు డబ్బులకోసం వెతుక్కుంటున్న సర్కారు... సంక్షేమ ఖర్చును ఒకేసారి బ్యాంకుల ‘ఖాతా’లో వేయాలని భావిస్తోంది. 45 ఏళ్లు దాటిన మహిళలకు ‘చేయూత’... డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేసి ‘ఆసరా’! మహిళలకు నేరుగా నగదు సహాయం అందించే ప్రధాన పథకాలు ఇవి! ఈ రెండు పథకాలకు నేరుగా ప్రభుత్వమే వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలి. ఇప్పుడు ఆ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన నిధులను బ్యాంకుల ద్వారా రుణం రూపంలో ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు గత రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో చర్చలు కూడా జరిపారు. ముందుగా ‘చేయూత’ పథకాన్ని బ్యాంకు రుణం రూపంలో మలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.


బ్యాంకులు కూడా ‘చేయూత’ రుణాలకు రంగం సిద్ధం చేయాలని కింది స్థాయి సిబ్బందికి సర్క్యులర్లు  జారీ చేశాయి. రాబోయే మూడేళ్లలో ఇవ్వాల్సిన మూడు విడతల ‘చేయూత’ మొత్తం రుణం రూపంలో ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదన ఉంచింది. దీంతో ఒక్కో లబ్ధిదారుకు ఒకేసారి రూ.56,250 అందుతాయి. దీనికి తోడు చేయూత మొదటి విడత 18,750 కలిపి మొత్తం రూ.75,000 అవుతాయి. ఈ మొత్తంతో లబ్ధిదారులు ఏదైనా వ్యాపారం లేదా ఇతర వ్యాపకంతో స్వయం ఉపాధి పొందవచ్చునని ప్రభుత్వం బ్యాంకులకు తెలిపింది. ఈ ఆలోచన పైకి చూడటానికి బాగానే ఉన్నా... అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ‘చేయూత’ మొదటి విడత నిధులిచ్చి దాదాపు 2 నెలలు కావస్తోంది. ఆ డబ్బులు అందుకున్న లబ్ధిదారులు ఇంకా ఖర్చు పెట్టకుండా ఉన్నారా? అనేది ప్రశ్నార్థకం. ‘ఆసరా’ నిధుల పంపిణీ కూడా మొదలైంది. అన్నింటికీ మించి... బ్యాంకులు ఎలాంటి ప్రయోజనమూ ఆశించకుండా లబ్ధిదారులకు డబ్బులివ్వవు. బిజినెస్‌ రుణం రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది.


వీటిపై వడ్డీ కూడా వేస్తారు. ఇప్పుడు అసలు, వడ్డీని లబ్ధిదారులు చెల్లించాలా? వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందా అనేది ఎస్‌ఎల్‌బీసీలో తేలలేదు. ఎస్‌ఎల్‌బీసీలో బ్యాంకర్లు దీనిపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించలేదని తెలిసింది.   ఒకవేళ వడ్డీని ప్రభుత్వం చెల్లించకపోతే బ్యాంకులు లబ్ధిదారుల నుంచే వసూలు చేసుకునే అవకాశముంది. ఈ మొత్తం రుణాన్ని  పూర్తిగా లబ్ధిదారుల నెత్తినే వేసే అవకాశాలనూ తోసిపుచ్చలేకపోతున్నారు. ‘చేయూత’కు రుణాలు ఇవ్వండి అని ఇప్పటికే సర్క్యులర్లు జారీ చేసిన బ్యాంకు అధికారులకు కూడా అసలు, వడ్డీపై స్పష్టత రాలేదని తెలిసింది.


‘ఆసరా’లోనూ అదే కథ...

‘ఆసరా’  పథకం విషయంలోనూ అదే అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది ఆసరా కోసం రూ.6750 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే ఏడాది ఈ ఖర్చు కనీసం ఇంకో రూ.500 కోట్లకుపైగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగులకు వేతనాలే సకాలంలో ఇవ్వలేకపోతున్న ప్రభుత్వానికి ఇంత భారం భరించే సామర్థ్యం లేదని ప్రభుత్వ పెద్దలు, అధికారులు అర్థమైంది. అందువల్లే... బ్యాంకు రుణాల దిశగా అడుగులేసి, ప్రభుత్వం ఇవ్వలేని పక్షంలో లబ్ధిదారులే వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించేలా చూడాలనీ భావిస్తున్నారు. కాగా ప్రభుత్వాలు మారడం సహజం! రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఈ పథకాలకు నిధులు విడుదల చేస్తారా లేదా అనే భయం బ్యాంకర్లను వెంటాడుతోంది. ఇప్పుడు రుణాలిస్తే రేపు ఎవరైనా చెల్లిస్తారా లేదా అనే భయం కూడా బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-09-19T09:29:40+05:30 IST