Abn logo
Apr 9 2020 @ 00:29AM

నిరుపేదల హక్కుగా సంక్షేమం

కరోనా కల్లోలంలో బతుకుదెరువు కోల్పోయిన పేదలను, ప్రత్యేకించి అసంఘటితరంగ కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలి. ఇందుకు, అమర్త్యసేన్ ప్రతిపాదించిన హక్కుల సిద్ధాంతం వెలుగులో కొత్త అంటువ్యాధుల చట్టాన్ని రూపొందించాలి. సంక్షేమాన్ని, సహాయాన్ని హక్కుగా పొందే అవకాశాన్ని కల్పిస్తే తప్ప ప్రజలు గౌరవప్రదంగా జీవించలేరు. ఆరోగ్య భద్రతను పెంపొందించడం, సామాజిక సంక్షేమాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత కావాలి. వాటిని పొందడానికి ప్రజలకు హక్కులు ఉండాలి. ఇది వెంటనే జరగాలి.


శాస్త్రపరిజ్ఞానం ఎంతో అభివృద్ధిచెందిన ఈ కాలంలో కూడా అంటువ్యాధులు ఇంతగా ప్రబలుతాయని ఎవ్వరమూ ఊహించలేకపోయినం. అతివేగంగా వ్యాపిస్తున్న కొవిడ్ -19ను చూస్తుంటే, ఎప్పుడో 1895లో హెచ్.జి.వెల్స్ సృజించిన ‘టైమ్ మెషిన్’లో మనను కూర్చోబెట్టి కాలంలో వెనుకకు ప్ర యాణించి 19వ శతాబ్దంలోకి చేర్చినట్టు అనిపిస్తున్నది. బహుశా అందుకేనేమో ఆయన కాలం నాటి 1897 చట్టం మనకు ఇప్పుడు దిక్కు అయింది!


19వ శతాబ్దంలో కాలిడి, ప్రస్తుత సమస్యలకు పరిష్కారం కనుగొనలేము కదా? అట్లా చేస్తే అది ఒక ప్రహసనం అవుతుంది. ఇప్పటి కాలమాన పరిస్థితుల నుండి వ్యాధిని అర్థం చేసుకోవాలి. ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వ్యూహరచనా, ప్రణాళికా రచించాలి, వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. ఇప్పుడు వైరస్ బాధితులే కాదు, ఇంకా దాని బారిన పడకుండా కాపాడాల్సిన ప్రజలనూ, లాక్‌డౌన్ కారణంగా బతుకు దుర్భరం అవుతున్న కటిక పేదలనూ ఆదుకోవడానికి అప్పటి చట్టం ఒక్కటే సంపూర్ణంగా సరిపోదు అన్నది నిర్వివాదం.


1970 నాటికే వైరస్‌లపై విజయం సాధించామనే ధీమా ప్రపంచమంతటా వ్యక్తమైంది. ఈ భావన బలంగా ఉండగానే 1976లో ఎబోలా వైరస్, 1983లో హెచ్.ఐ.వి. వైరస్ బయటపడ్డాయి. అయినా మనిషి విశ్వాసం చెదిరిపోలేదు. ఏదో ఒక రోజు వాటిని రూపుమాపగలమనే అనుకున్నాం. కానీ, వాస్తవం మరో రకంగా ఉన్నది. 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన తరువాత వైరస్‌ల దాడి నానాటికీ పెరుగుతున్నది. 2003లో సార్స్ బయటపడితే, 2009లో ఫ్లూ వ్యాధి తీవ్రతరమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2011–-2017 మధ్యకాలంలో వైరస్ దాడి చేసిన ఉదంతాలు 1307 ఉన్నాయి. ఆ నివేదిక వైరస్ వ్యాధుల స్వభావాన్నికూడా విశ్లేషించింది. గతంలోవలెగాక ఈ తరం వైరస్ ప్రపంచీకరణ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతుందని, వాటిని రూపుమాపే మందులు లేవని, వైరస్ దాడుల వలన వర్తక, వ్యాపారాలు నిలిచిపోతాయని హెచ్చరించింది. 


ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహ రచన చేయాలంటే రెండు విషయాలను గుర్తించాలి. వ్యాధి ప్రభావం కానీ, దాన్ని ఎదుర్కొనడానికి అనుసరించవలసిన వ్యూహం కానీ సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. వర్తమాన పరిస్థితుల్లో ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి చూసి, వ్యాధి వలన తలెత్తుతున్న సామాజిక, ఆర్థిక సమస్యలను రూపుమాపడానికి వ్యూహరచన జరగాలి. 123 ఏళ్ళనాటి చట్టాలు నేటి మహమ్మారిని ఎదుర్కొనడానికి ఒక ప్రాతిపదికగా పనిచేస్తాయేమో కానీ, ప్రస్తుత బీదల పాట్లకు సమాధానాలు కావన్న గ్రహింపు అవసరం!


అభివృద్ధి-సంక్షేమ విధానాలపై, ముఖ్యంగా హక్కుల కోణంలో నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అధ్యయనం ఈ దిశగా అత్యవసరమైన సూచనలు చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో క్షామాన్ని సమర్థంగా ఎదుర్కొనవచ్చని ఆయన అంటారు. అది నిజం కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేస్తాయి. ప్రజల సమస్యలను విస్మరించినపుడు ప్రభుత్వాలు నిరసనను ఎదుర్కొంటాయి. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఈ నిరసనలను బలంగా వ్యక్తం చేస్తాయి. సోషల్ మీడియా విస్ఫోటనం తర్వాత క్షణాలలో ప్రజాగ్రహం ప్రభుత్వాల దృష్టికి చేరుతున్నది. ఎన్నికలలో ఈ నిరసనల తాలూకు సెగలకు ప్రభుత్వాలే కూలిపోవచ్చు. అందుకే ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. 


ప్రజలు కనీస సౌకర్యాలను పొందడానికి కావలసిన హక్కు లను చట్టబద్దంగా పొందుతుంటారు. వీటిని ప్రజలకు అందించవలసిన బాధ్యతను చట్టమూ రాజ్యాంగమూ ప్రభుత్వంపైన ఉంచాయి. అయితే, ఇవన్నీ యాంత్రికంగా జరిగే విషయాలు కావు. ప్రజల సమిష్టి కృషి వల్ల కొత్త హక్కులు ఎప్పటికప్పుడు సమాజ అవసరాలను తీర్చడానికి వస్తుంటాయి. అవి క్రమంగా చట్టబద్దమౌతాయి. మన దేశంలో సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత హక్కు, అటవీ భూమిపై హక్కు లాంటివి సమిష్టి పోరాటాలలో నుండి పుట్టి చట్టబద్ధమయ్యాయి. ఒక విషాదం ఏమంటే, హక్కులు సాధించుకోవడంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదు. వాటి అమలుకు కూడా మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తూంటుంది. రాజ్యాంగంలోని అనేక హక్కులు ఆ విధంగానే ఆచరణలోకి వచ్చినాయి. అందుకే హక్కుల దృష్టి కోణం నుండి ఆలోచించడం చాలా అవసరం. ఈ సందర్భంలో కూడా అదే దృష్టికోణం నుండి కరోనాను కట్టడి చేయడానికి వ్యూహరచన జరగాలి. అంతకంటే ముఖ్యంగా ఈ వ్యూహాలూ నియంత్రణలు బతుకుదెరువు కోల్పోయిన నిరుపేదల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.


తీవ్ర అసమానతలున్న మన దేశంలో అందరికీ ఆరోగ్య భద్రతను సమానంగా అందించడానికి, కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక దుస్థితి నుండి పేద ప్రజలను ఆదుకోవడానికి అమర్త్యసేన్ చెప్పిన హక్కుల కోణం మాత్రమే చట్టాల కల్పనలో మనకు వెలుగు కావాలి. అదే సరయినది! 


2018లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ దాడుల నుండి రానున్న ముప్పును వేలెత్తి చూపినా ప్రపంచంలోని ఏ దేశమూ జాగ్రత్త పడలేదు. మన దేశమూ ఆలస్యంగానే మేల్కొన్నది. జనవరి 30 నాడు మొదటి కొవిడ్ కేసు కేరళలో బయటపడింది. ఫిబ్రవరి నెల అంతా కీలక వ్యూహరచనకు అవకాశం ఉండింది. అయినా ప్రభుత్వం కదలలేదు. రాజకీయ పార్టీలకు, ప్రజాసంఘాలకు కూడా ఏమి చేయాలో తోచలేదు. 


ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రపంచమంతటా ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. దాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి లాక్‌డౌన్ ఒక సాధనంగా ఉపయోగపడుతున్నది. అయితే, సామాజిక దూరం మనిషి స్వభావానికి విరుద్ధమైన అంశం. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసే జీవిస్తారు మనుషులు. మానవజాతి తన మనుగడకు కావలసిన అవసరాలను సాటి మనుషులతో మమేకతతోనే తీర్చుకుంటుంది. కానీ ఇపుడు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా మనుషులు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిలపడానికి ఇది అనివార్యమైంది కాబట్టి. కానీ, మనుషులు కలవకుండా ఉంటే ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఆర్థిక రంగం స్తంభించినపుడు కలిగే దుష్ఫలితాలు ప్రజలందరిపైనా సమానంగా ఉండవు. అసంఘటితరంగ కార్మికులు మిగతా ప్రజలకంటే ఎక్కువ కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటారు. అసంఘటితరంగంపై అధ్యయనం చేసిన కె.పి. కన్నన్ అనే సామాజిక శాస్త్రవేత్త దేశంలో ఉన్న 46కోట్ల కార్మికులలో 80శాతం అసంఘటిత రంగంలోనే బతుకుదెరువు పొందుతున్నారని తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గీత కార్మికులు, రజకులు, క్షురకులు... ఇంకా చిన్న పరిశ్రమలలో పనిచేసేవారంతా అసంఘటిత రంగంలో భాగమే. 


దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఈ మట్టిమనుషుల పాత్ర ఎంతో గొప్పది. ‘గల్లీ చిన్నది గరీబోల్ల కథ పెద్దది’ పాటలో వీరి వ్యధలు గోరటి వెంకన్న చెప్తారు కదా, అట్లాంటి బతుకులు వీరివి. స్వంత బతుకులకు పూచీ లేని దురవస్థలో కూడా వీరు ఆర్థిక రంగాన్ని నిలబెడుతారు. సంఘటిత రంగానికి కావలసిన సేవలను, సౌకర్యాలను అగ్గువకు సమకూర్చడమే కాక కొన్నిసార్లు ముడిసరుకులను కూడా వీరు అందిస్తారు. ట్యాక్సీలు లేకుండా ఐటీ రంగాన్ని ఊహించగలమా? ఇటుకలు తయారు చేసే కార్మికులు, ఇసుక రవాణా చేసే డ్రైవర్లు లేకుండా నిర్మాణరంగం నిలిచేనా? అందుకే, అసంఘటితరంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిది. కానీ, ఇంత కీలకమైన అసంఘటితరంగ కార్మికులకు ఏ వసతులూ లేవు. అసలు వారి గురించి ఆలోచించేవారే కరువైతున్నరు. కాబట్టే, కరోనా తాకిడితో ఆర్థిక రంగం మూతపడిపోగానే రక్షణ కరువై, తిండి లేక చంటిపిల్లలను చంకనేసుకుని, మూటలు నెత్తిన పెట్టుకొని లక్షలాది మంది వందల కిలోమీటర్ల దూరాన ఉన్న తమ స్వంత ఊళ్లకు కాలిబాటన బయలుదేరినారు. ఈ ఘటనలో వలస కార్మికుల వెతలు బయటికి వచ్చినాయి. ఇక్కడే ఉండి బతుకుదెరువు కోల్పోయినవారి పరిస్థితి కూడా ఇంతే దుర్భరంగా ఉన్నది. 


మార్చి 21న లాక్‌డౌన్ ప్రకటించేనాటికే వీరందరి రక్షణ కోసం కావలసిన పథకాలు, ప్రణాళికలు చేసి ఉండవలసింది. కానీ, హడావుడిగా, ఎటువంటి హెచ్చరికలు లేకుండానే లాక్‌డౌన్ ప్రకటించారు. వ్యూహాలూ, జాగ్రత్తలు మాత్రమే కాదు, ఆ సమయానికి పేదవర్గాలను ఆదుకోవడానికి కావలసిన చట్టాలు కూడా లేవు. ప్రభుత్వానికి బ్రిటిష్ పాలకులు 1897లో తయారు చేసిన అంటువ్యాధుల చట్టమే దిక్కయింది. ఈ చట్టంలోని సెక్షన్ -2 ప్రకారం, అమలులో ఉన్న చట్టాలు అంటువ్యాధుల నివారణకు చాలనప్పుడు, అవసరమైన కట్టుబాట్లను ప్రభుత్వం జారీ చేయవచ్చు. చట్టం లక్ష్యం కేవలం వ్యాధుల నివారణ. ఆ క్రమంలో బతుకుదెరువు కోల్పోయే ప్రజల అవసరాలను కాపాడే ఉద్దేశ్యమూ, పరిధీ ఈ 123ఏళ్ళ పాత చట్టానికి లేదు, ఉంటుందనీ మనం భావించకూడదు. వలస పాలకులు తెచ్చిన ఆ చట్టం ప్రజా ప్రభుత్వానికి పూర్తిగా పనికి వచ్చేది కాదు. అందుకే, మన బిడ్డల బతుకుల గురించిన ఆలోచన చేసి ఉండవలసింది అంటున్నాం. ఏమి చేసైనా సరే, ఆర్థిక వ్యవస్థ వెన్నెముక అయిన నిరుపేదల బతుకులను ఇన్ని కష్టనష్టాలకు ఒదిలేసి ఉండవలసింది కాదని అంటున్నాం.


బతుకుదెరువు కోల్పోయి ఇబ్బంది పడే పేదవర్గాలను, ప్రత్యేకించి అసంఘటితరంగ కార్మికులను ఆదుకోవడానికి, వైద్య సౌకర్యాలను అందుబాటులోనికి తేవడానికి అమర్త్యసేన్ ప్రతిపాదించిన హక్కుల సిద్ధాంతం వెలుగులో కొత్త అంటువ్యాధుల చట్టాన్ని రూపొందించాలి. 19వ శతాబ్దంలో వచ్చిన చట్టం ప్రజాస్వామ్యయుగంలో పనికి రాదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సహాయం ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన వారికి మాత్రమే దక్కుతున్నది. రేషన్ కార్డు లేనివారికి కూడా సహాయం అందాలంటే చట్టంలో వారికి హక్కులు కల్పించాలి. క్వారంటైన్‌లో ఉన్నవారికి సదుపాయాలూ కల్పించాలి. అందుకు యుద్ధప్రాతిపదికన చట్టాన్ని సవరించాలి.


సంక్షేమాన్ని, సహాయాన్ని హక్కుగా పొందే అవకాశాన్ని కల్పిస్తే తప్ప ప్రజలు గౌరవప్రదంగా జీవించలేరని గ్రహించాలి. ఆరోగ్య భద్రతను పెంపొందించడం, సామాజిక సంక్షేమాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత కావాలి. వాటిని పొందడానికి ప్రజలకు హక్కులు ఉండాలి. ఇది వెంటనే జరగాలి.

ప్రొఫెసర్ కోదండరాం 

శ్రీశైల్ రెడ్డి పంజుగుల

తెలంగాణ జన సమితి

Advertisement
Advertisement
Advertisement