Abn logo
Oct 23 2020 @ 02:10AM

సంక్షోభాలుగా సంక్షేమాలు!

బీసీలకు అమోఘమైన పథకాలు అందిస్తున్నామని ప్రకటించుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాల వివరాలూ తెలియజేస్తే బాగుంటుంది. విదేశీవిద్యకు ఇచ్చే రూ.400 కోట్లు, ఆదరణ పథకం కింద రూ.2000 కోట్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందించే ఆర్థిక సాయం రూ.150 కోట్లు, పండుగ కానుకల ద్వారా బీసీలకు అందే రూ.300కోట్లు, చివరికి రేషన్ సరుకుల ద్వారా అందించే సరుకుల ధరలను కార్పొరేషన్ల ఖర్చుగా చూపించడం న్యాయమేనా? ఇది బీసీలను వంచించడం కాదా?


బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు, ‘బ్యాక్‌బోన్’ క్లాసులంటూ ప్రభుత్వం ప్రచార్భాటంలో చూపిస్తున్న శ్రద్ధ వాస్తవ రూపంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాచరణ పుణ్యమా అంటూ ‘బ్యాక్‌బోన్’ తరగతుల్ని గోబ్యాక్ అంటూ ఇంకా వెనకకు నెట్టేందుకు తెగబడుతున్నారు. బడుగులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వైకల్యం సోకకుండా చూడాల్సిన వారే శిలువ వేసే ప్రయత్నం చేయడం దారుణం.


బీసీలకు అది చేశాం, అంత అందించామంటూ బీరాలు పలుకుతున్నారు కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో బీసీలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, వారిలో నెలకొన్న అభద్రతాభావాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే విస్తుగొలిపే నిజాలు భయటపడతాయి. బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తూ వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. హత్యలకు తెగబడుతున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఈ ప్రభుత్వం బీసీలంటే కేవలం ఓటర్లుగా మాత్రమే భావిస్తుంది. వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని కనబరిచిన దాఖలాల్లేవు. 


‘రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అధిక నిధులు కేటాయిస్తాం. 139 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని’ 2017 నవంబర్ 13న జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు, మడమ తిప్పారు. 139 కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఊహల పల్లికిలో ఊరేగించారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల తర్వాత వెనుకబడిన వర్గాల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు అంటూ.. చివరికి 139 కులాలకు కార్పొరేషన్లను కేవలం 56 కి పరిమితం చేశారు. అందులోనూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను కూడా మిళితం చేసి తామే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆర్భాటం చేసుకుంటున్నారు. ఇంత ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయంలో ఏర్పాటై, పుష్టిగా నిధులిచ్చిన కార్పొరేషన్లకు, వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా కేటాయించిన దాఖలాల్లేవు. దీనిబట్టి ఇప్పుడు కొత్తగా ప్రకటించిన కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 


కార్పొరేషన్ల గురించి ఆర్భాటంగా మాట్లాడుతున్న వైసీపీ అధికారంలోకి వచ్చేటప్పటికే ఉన్న 24 బీసీ కార్పొరేషన్లకు ఏడాదిన్నరలో ఎంత నిధులు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు బయటపెట్టాలి. గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా లక్షల మందికి ఉపాధిని కల్పించింది. వెనుకబడిన వర్గాలు సమాజానికి వెన్నముకగా ఉండాలని సంకల్పించింది. పని చేసే స్థాయి నుంచి పని ఇచ్చే స్థాయికి, జీతాలు తీసుకునే స్థాయి నుంచి జీతాలు ఇచ్చే స్థాయికి జీవన ప్రమాణాలు పెంచింది. ఆదరణ పథకం ద్వారా వృత్తి దారులకు పనిముట్లు అందించింది. బీసీలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటును అందించింది.


ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2,71,37,253 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చు చేశామని 2020 అక్టోబర్ 16న ప్రకటించుకున్నారు. అంటే గడిచిన 16 నెలలుగా ఒక్కొక్క బీసీపై ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత.? ఉదాహరణకు విదేశీ విద్యా కానుక ద్వారా 425 మంది విద్యార్ధులకు రూ.22.36 కోట్లు కేటాయించామని ప్రకటించారు. అంటే ఒక్కో విద్యార్ధికి సగటున రూ.5,26,117 మాత్రమే అందించారు. గత ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఒక్కో విద్యార్ధికి రూ.15 లక్షల సాయం అందించింది. ఈ ఏడాది వైసీపీ ప్రభుత్వం బీసీలకు బడ్జెట్‌లో కేటాయించింది రూ.25,331.30 కోట్లు. అందులో రూ.23,458.8 కోట్లు నవరత్నాల కోసం ఖర్చు చేస్తామని చెప్పడం బీసీలను వంచించడం కాదా.? బీసీ ద్రోహి అనే పేరును సార్ధకం చేసుకోవడం కాదా.? చేనేతలకు మగ్గాలు, రజకులకు దోబీఘాట్స్, నాయి బ్రాహ్మణులకు పని ముట్లు అందించాల్సింది పోయి అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన సమయంలో ఆర్థిక సాయం చేశాం ఇక చాలు అనేలా వ్యవహరించడం ముమ్మాటికీ బడుగు బలహీన వర్గాలను అణచివేయాలనుకోవడమే.


రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీల్లో కేవలం ఒకరిద్దరికి పదవులిచ్చి బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం ఎంత వరకు సమంజసం? స్థానిక సంస్థల్లో వెనుకబడినవర్గాలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ 73, 74ద్వారా కల్పించింది. కాని బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని మార్చి 2న హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీలకు 34 నుంచి 24 శాతం తగ్గించారు. దీంతో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను నాశనం చేశారు. 16,800 మంది బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్ అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, అధికారంలోకి వచ్చాక జీవో తెచ్చి వందలాది ప్రభుత్వ సలహాదారుల నియామకంలో ఎంత మంది బీసీలకు పదవులు ఇచ్చారో చెప్పలేకపోతున్నారు. జంబో బోర్డుగా పిలుచుకుంటున్న టీటీడీ బోర్డులో ఎంత మంది బీసీలకు అవకాశాలు కల్పించారో కళ్లారా చూస్తున్నాం. అంతెందుకు.. మేం బీసీల వెంటే ఉన్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం టీటీడీ, ఏపీఐఐసీ, తుడా, యూనివర్శిటీల వీసీ పదవుల్లో ఉన్న బీసీలను తొలగించి ఏకపక్షంగా సొంత సామాజికవర్గాన్ని నింపుకున్న వైనం చూశాం. ఇంకా బీసీల పక్షపాతి ఈ ప్రభుత్వం అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం.


వెనుకబడిన వర్గాల్లో అనాదిగా వస్తున్న చేతివృత్తులు ఈనాడు కుప్పకూలుతున్నాయి. ఆర్ధిక అవస్థలతో కునారిల్లుతున్నాయి. ఈ వృత్తులనే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చేతిలో చేవ ఉన్నా పని లేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తులను మరింత మెరుగు పరచుకోవడాన్ని ప్రోత్సహించి, ఉపాధికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం రూ.10వేలు ఇస్తున్నాం ఇక చాలు అన్నట్లు వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన చేతులు.. రాజీపడాలనడం ఏ విధంగా వారి జీవితాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చేనేతల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సదుపాయం కల్పించారు. నూలు, రంగులు, ఇతర చేనేత ముడిసరుకులపై సబ్సిడీలిచ్చారు. వర్షాకాలంలో ఉపాధి లేనందున భృతి అందించారు. కానీ నేడు ఆ సబ్సిడీలన్నింటినీ ఎత్తేసి రూ.24వేలు చేతిలో పెట్టి సరిపెట్టుకోండి అంటున్నారు. మత్స్యకారులకు పడవలు, వలలు, ఐస్‌బాక్సులు, మోటార్‌సైకిళ్లు 70నుండి 90 శాతం సబ్సిడీతో అందిస్తే.. గత 17 నెలల్లో సబ్సిడీపై ఇచ్చిన పరికరాలు ఏమీ లేవు. రూ.10వేలు చేతిలో పెట్టి సర్దుకోమంటున్నారు. 


ప్రభుత్వాలు అన్నాక సంక్షేమ పథకాలు రూపొందించి అమలుపరుస్తాయి. వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను సంక్షోభాలుగా మార్చి కేవలం తమకు కావాల్సిన వారికి ఫలాలు అందిస్తూ బీసీ బాంధవుడిగా డప్పు కొట్టుకుంటోంది. బీసీలకు అమోఘమైన పథకాలు అందిస్తున్నామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వం.. రద్దు చేసిన పధకాల వివరాలు కూడా తెలియజేస్తే బాగుంటుంది. విదేశీ విద్యకు ఇచ్చే రూ.400 కోట్లను, ఆదరణ పథకం కింద రూ.2000 కోట్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం రూ.150 కోట్లు, అన్న క్యాంటిన్లలో బీసీలు తినే తిండిని, పండుగ కానుకల ద్వారా బీసీలకు అందే రూ.300 కోట్లు, చివరికి రేషన్ సరుకుల ద్వారా అందించే సరుకుల ధరలను కూడా కార్పొరేషన్ల ఖర్చుగా చూపించి బీసీలను వంచిస్తోంది. రాష్ట్రంలో ఎటు చూసినా వెనుకబడిన వర్గాల వారికి అవమానాలు అపహాస్యాలే ఎదురవుతున్నాయి. బీసీలంటే ఓటర్లు కాదు అని గుర్తించినది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందుకు నిన్నటికి నిన్న ప్రకటించిన జాతీయ కమిటీ సభ్యుల జాబితానే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం బీసీలకు అండగా ఉంటుంది. వారి తరుపున పోరాడుతుంది.

కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి

Advertisement
Advertisement
Advertisement