సీఎం జగన్‌కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-08-07T06:35:08+05:30 IST

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పలువురు మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

సీఎం జగన్‌కు ఘన స్వాగతం
రన్‌వే నుంచి బయటకు వస్తున్న సీఎం జగన్‌

గోపాలపట్నం, ఆగస్టు 6: అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పలువురు మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విశాఖపట్నం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీ కేఎస్‌ విశ్వనాథన్‌, ఏసీపీ సుమిత్‌ సునీల్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి జగన్‌ హెలికాప్టర్‌లో మంత్రులు బొత్స, అమర్‌నాథ్‌తో కలిసి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వెళ్లారు. అక్కడ వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు విశాఖపట్నం చేరుకుని 5.40 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.  


పెనుగాలులు...జడివాన

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వాతావరణ అనిశ్చితితో శనివారం సాయంత్రం ఆరున్నర గంటల తరువాత ఒక్కసారిగా నగరంపై దట్టంగా మేఘాలు ఆవరించాయి. అరగంటపాటు పెనుగాలులు వీయడంతో ఆరుబయట ఉన్నవారంతా కంగారుపడ్డారు. ఆ తరువాత ఒక మోస్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి ఎండలు పెరిగాయి. ఉక్కపోత కూడా తోడవ్వడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వుండడంతో మేఘాలు ఏర్పడ్డాయి. నగరంతోపాటు చుట్టుపక్కల తేలికపాటి నుంచి ఒక మోస్తరు, అక్కడక్కడా భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాణిపేటలో 45.75 మి.మీ.లు, పెందుర్తి వెంకట్రాదినగర్‌లో 43, ఓల్డ్‌డెయిరీ ఫారం వద్ద 36.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. 



Updated Date - 2022-08-07T06:35:08+05:30 IST