చంద్రబాబుకు పేటలో ఘన స్వాగతం

ABN , First Publish Date - 2020-02-20T07:51:36+05:30 IST

జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశంపార్టీ బుధవారం నుంచి తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా వెళుతున్న

చంద్రబాబుకు పేటలో ఘన స్వాగతం

చిలకలూరిపేట, ఫిబ్రవరి 19 : జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశంపార్టీ బుధవారం నుంచి తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11:45 నిముషాలకు చంద్రబాబు కాన్వాయ్‌ 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా చిలకలూరిపేట వద్దకు చేరుకుంది. ఏఎంజి వద్ద మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు జాతీయ జెండాలతో ఏఎంజి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని సీఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను రద్దు చేయాలని నిరసన ప్రదర్శన చేసి చంద్రబాబుకు, ప్రత్తిపాటి పుల్లారావులకు వినతిపత్రం అందించారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కూడా చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఆగిన చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలపై తెలుగుదేశంపార్టీ స్పష్టంగా ఉందని ప్రజలను విడగొట్టే చట్టాలను ఉపసంహరించుకునేదాక తెలుగుదేశంపార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్‌ సమద్‌ఖాన్‌ దుకాణాన్ని సందర్శించి ఆయనను అభినందించారు.  అనంతరం బొప్పూడి గ్రామ పరిధిలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ప్రసన్నాంజనేయస్వామి వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. బొప్పూడి గుడి వద్ద పర్చూరు, చీరాల, అద్దంకి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కరణం బలరామకృష్ణమూర్తి, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌, బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్‌ మాల్యాద్రితోపాటు ఆయా నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. బొప్పూడి గుడి కూడలి ప్రాంతం జనసంద్రమైంది. మహిళలు కూడా చంద్రబాబు రాకకోసం ఎదురు చూశారు. ఒక శనగ రైతు శనగ పంట మొక్కలతో అక్కడ బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి గుడి వద్ద నిలబడి ఉండటం గమనించిన చంద్రబాబు అతనని పిలిచి వివరాలు అడిగారు. అకాల వర్షానికి పంట నష్టపోయామని, శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన శనగకు గుంటూరు జిల్లాలో ప్రభుత్వం రాయితీ అందచేయలేదని రైతు వాపోయాడు. అనంతరం ప్రసన్నాంజనేయస్వామి గుడిలో చంద్రబాబు పూజలు నిర్వహించారు. అర్చకులు, దేవాలయ కమిటీ మాజీ చైర్మన్‌లు చంద్రబాబును సత్కరించి జ్ఞాపికలు అందించారు. 12:30 గంటల సమయంలో బొప్పూడి గుడి ముందు ప్రత్యేక వాహనంపై శంఖువు ఊది ప్రజాచైతన్య యాత్ర శంఖారావాన్ని పూరించి ప్రకాశం జిల్లా మార్టూరుకు వెళ్లారు.

Updated Date - 2020-02-20T07:51:36+05:30 IST