సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు చినరాజప్ప, సోమిశెట్టి
చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు (అగ్రికల్చర్), మే 17: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కర్నూలుకు వస్తున్నారని, ఆయనను ఘనంగా స్వాగతిద్దామని పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం కర్నూలు నగరంలోని కమ్మ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి 8.30 గంటలకు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ హోటల్లో బస చేస్తారని తెలిపారు. మర్నాడు ఉదయం 11గంటలకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం నగర సమీపంలోని కమ్మ కమ్యూనిటీ హాల్లో క ర్నూలు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామం లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. తర్వాత పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించే ప్రాంగణాన్ని పొలిట్‌బ్యూరో సభ్యులు చిన్నరాజప్ప, సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్, నాగేంద్ర, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, పోతురాజు రవికుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, కొరకంచి రవికుమార్, ఐటీడీపీ ఇన్చార్జి గట్టు తిలక్, తిరుపాల్ బాబు తదితరులు పాల్గొన్నారు.