వేలాడే పొట్టకు సూది మందు చికిత్స.. ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడి..

ABN , First Publish Date - 2022-02-19T17:23:04+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా 650 మిలియన్ల ప్రజలు...

వేలాడే పొట్టకు సూది మందు చికిత్స.. ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడి..

ప్రపంచవ్యాప్తంగా 650 మిలియన్ల ప్రజలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఊబకాయం అనేది ఒక మహమ్మారి లాంటిది. దీనిని అరికట్టేందుకు ప్రపంచంలోని నలుమూలలకు చెందిన శాస్త్రవేత్తలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఊబకాయాన్ని తగ్గించేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశారు. స్థూలకాయంతో బాధపడేవారిపై దీనిని ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతారని వారు పేర్కొన్నారు. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంజెక్షన్ పేరు సెమాగ్లుటైడ్. దీనికి డ్రగ్ కంట్రోలర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు దీనిని UK ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్.. ఊబకాయంతో బాధపడుతున్న వారిపై ప్రయోగించింది. 


దీనిలో భాగంగా ప్రతి వారం రోగికి ఈ ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక సంవత్సరం తర్వాత బాధితుని బరువు 12 శాతం వరకు తగ్గింది. ఈ ప్రత్యేకమైన ఇంజెక్షన్‌ను వెగోవి అని కూడా అంటారు. అధిక బరువుతో బాధపడుతున్నవారికి ఈ ఇంజెక్షన్ ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఇంజెక్షన్ బాడీ మాస్ ఇండెక్స్ 30 ఉన్నవారికి కూడా ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇంజెక్షన్ శరీరంలో ఆకలిని అణిచివేసేందుకు పని చేస్తుంది. ఒక వ్యక్తి ఆహారం తిన్నప్పుడు అతని శరీరంలో గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్ 1 హార్మోన్ విడుదల అవుతుంది. అది మనిషికి కడుపు నిండిన సంగతి చెబుతుంది. ఈ ఇంజెక్షన్ శరీరంలోకి చేరడం ద్వారా గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్ 1 హార్మోన్ మాదిరిగా పనిచేస్తుంది. ఫలితంగా ఈ ఇంజెక్టన్ తీసుకున్న వ్యక్తి తన కడుపు నిండినట్లు భావిస్తాడు. ఫలితంగా అతను తక్కువ ఆహారం తీసుకుంటాడు. దీంతో అతని శరీర బరువు పెరగదు. ఇంగ్లాండ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వారు అనేక వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయి. ఒక్కో సందర్భంలో బాధితులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ ఇంజెక్షన్ ఈ ముప్పును తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2022-02-19T17:23:04+05:30 IST