తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి మొదలవుతుందా? అయితే..

ABN , First Publish Date - 2022-02-15T17:40:53+05:30 IST

క్యాలరీలు తగ్గిస్తాం, క్రమం తప్పక వ్యాయామం చేస్తాం. అయినా బరువు తగ్గకపోగా, తిన్న కొద్ది సేపటికే ఆకలి మొదలవుతూ ఉంటుంది. బరువును తగ్గించే చర్యలు ఎన్ని చేపడుతున్నా, ఫలితం కనిపించకపోతే, లెప్టిన్‌ రెసిస్టెన్స్‌గా అనుమానించాలి.

తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి మొదలవుతుందా? అయితే..

ఆంధ్రజ్యోతి(15-02-2022)

క్యాలరీలు తగ్గిస్తాం, క్రమం తప్పక వ్యాయామం చేస్తాం. అయినా బరువు తగ్గకపోగా, తిన్న కొద్ది సేపటికే ఆకలి మొదలవుతూ ఉంటుంది. బరువును తగ్గించే చర్యలు ఎన్ని చేపడుతున్నా, ఫలితం కనిపించకపోతే, లెప్టిన్‌ రెసిస్టెన్స్‌గా అనుమానించాలి.


లెప్టిన్‌ పరీక్షతో రక్తంలో లెప్టిన్‌ హార్మోన్‌ మోతాదు తెలుస్తుంది. ఉపవాసంతో, లెప్టిన్‌ పరీక్ష చేయించుకున్నప్పుడు, ఫలితం 10 నానోగ్రామ్‌/మిల్లీమీటరు ఉండి, లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ తాలూకు లక్షణాలుంటే, లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నట్టుగా భావించాలి. 


లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ ఎందుకు?

శరీర బరువును, మెటబాలిజంను స్థిరంగా ఉంచడంలో లెప్టిన్‌ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ హార్మోన్‌ థైరాయిడ్‌ హార్మోన్‌ను నేరుగా ప్రభావితం చేయడం ద్వారా మెటబాలిజం హెచ్చుతగ్గులకు లోనయ్యేలా చేస్తుంది. బరువు అదుపులో ఉండాలంటే లెప్టిన్‌, థైరాయిడ్‌.. ఈ రెండు హార్మోన్లూ కలిసి సమర్థంగా పని చేయాలి. ఆకలిని నియంత్రించేలా, మెటబాలిజంను క్రమబద్ధీకరించేలా మెదడును ఈ రెండు హార్మోన్లూ నియంత్రిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొవ్వు కణాల మీద మెదడు నియంత్రణను ఈ రెండు హార్మోన్లూ సమీక్షిస్తూ ఉంటాయి. కొవ్వు కణాలు విడుదల చేసే హార్మోన్లలో లెప్టిన్‌ ఒకటి. ఈ హార్మోన్‌ రక్తం ద్వారా మెదడుకు చేరి, కొవ్వు కణాలు శరీరంలో సరిపడా ఉన్నాయనే సంకేతాన్ని అందిస్తాయి. దాంతో మెదడు అదనపు క్యాలరీలు శరీరంలో చేరకుండా ఉండడం కోసం ఆకలిని తగ్గిస్తుంది. అలా మెటబాలిజంను పెంచి, ఆకలిని తగ్గించడం ద్వారా మెదడు శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అయితే లెప్టిన్‌ రెసిస్టెన్స్‌కు గురైనప్పుడు కొవ్వు కణాలకూ మెదడుకూ మధ్య సమాచార ప్రసారం దెబ్బ తింటుంది. హైపోథైరాయిడిజం, వ్యాయామలోపం, ఎక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి మూలంగా శరీరంలో కొవ్వు కణాలు పెరిగిపోయి, మెదడు లెప్టిన్‌ సమాచారాన్ని గ్రహించలేనంత స్తబ్ధుగా మారిపోతుంది. ఫలితంగా శరీరంలో లెప్టిన్‌ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ, అందుకు పూర్తి వ్యతిరేకమైన స్థితికి శరీరం లోనైనట్టుగా (లెప్టిన్‌ డెఫిసియన్సీ) మెదడు భావిస్తుంది. దాంతో లెప్టిన్‌ తగ్గుదలను భర్తీ చేయడం కోసం ఆకలిని పెంచి, మెటబాలిజంను తగ్గిస్తుంది. అయితే ఈ పరిస్థితి ఒక్క రాత్రిలో తలెత్తేది కాదు. ఇందుకు వారాలు, నెలల సమయం పడుతుంది. 


లక్షణాలు ఇవే!

చల్లని శరీర ఉష్ణోగ్రత, వెంట్రుకలు రాలడం, అతి ఆకలి, పొడి చర్మం, నిస్సత్తువ లాంటి హైపోథైరాయిడ్‌ లక్షణాలు. ఈ లక్షణాలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా, ఒక్కొక రోజు ఒక్కోలా మారుతూ ఉంటాయి. కాబట్టి లెప్టిన్‌ పరీక్ష కోసం 12 గంటల పాటు ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాస సమయంలో నీళ్లు మినహా కాఫీలు, టీలు, తీపి పానీయాలేవీ తీసుకోకూడదు. 


చికిత్స సులువే!

లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ తీవ్రతను బట్టి వైద్యులు తగిన చికిత్సా విధానాన్ని సూచిస్తారు. హార్మోన్‌ లోపాలను సరిదిద్దడంతో పాటు, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం ద్వారా లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ గాడిలో పడుతుంది. దాంతో ఆకలి అదుపులోకి రావడంతో పాటు మెటబాలిజం వేగం పెరిగి శరీర బరువు అదుపులోకి వస్తుంది.


అపోహ - వాస్తవం

అపోహ: కొవ్వు తింటే కొవ్వు పడుతుంది

నిజం: కొవ్వు పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉండే మాట వాస్తవమే అయినా, ఆహారంలో కొంత మేరకు కొవ్వులు ఉండేలా చూసుకోవడం అవసరం. కొవ్వులు ఆకలిని నియంత్రించి, చిరుతిళ్ల మీదకు మనసు మళ్లకుండా చేస్తాయి.


అపోహ: భోజనం మానేయడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు

నిజం: భోజనం మానేయడం మూలంగా, ఉపవాసం తర్వాత అవసరానికి మించి తినేసే ప్రమాదం ఉంటుంది. 


అపోహ: సాధారణ శీతల పానీయాలకు బదులు డైట్‌ సోడాలు తీసుకోవడం మేలు

నిజం: డైట్‌ సోడాల్లో ఉండే కృత్రిమ స్వీటెనర్లు క్లోమం నుంచి ఎక్కువ ఇన్సులిన్‌ విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో ఆహారం మీద ధ్యాస పెరిగి, ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది.

Updated Date - 2022-02-15T17:40:53+05:30 IST