సిరిసంపదలతో తులతూగాలి

ABN , First Publish Date - 2021-07-31T06:12:08+05:30 IST

సిరిసిల్ల జిల్లా సిరిసంపదలతో తులతూగాలని, కార్మిక, కర్షక క్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

సిరిసంపదలతో తులతూగాలి
కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- సిరిసిల్లకు మంచి రోజులు   

- మేడిన్‌ బ్రాండ్‌గా నిలవాలి

- టీ ట్యాప్‌తో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు  

- తెలంగాణ పత్తి దేశంలోనే నంబర్‌ వన్‌ 

- త్వరలో చేనేత బీమా అమలు 

- మరమగ్గాల ఆధునికీకరణ  

- సిరిసిల్ల అపెరల్‌ పార్కు ద్వారా  

    10 వేల మంది మహిళలకు ఉపాధి

- రూ.400 కోట్ల వ్యయంతో 

     నేతన్నలకు వర్కర్‌ టు ఓనర్‌ పథకం 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి 

     కే తారకరామారావు

-  సిరిసిల్ల అపెరల్‌ పార్కులో 

    తొలి ఫ్యాక్టరీకి భూమిపూజ 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 సిరిసిల్ల జిల్లా సిరిసంపదలతో తులతూగాలని,  కార్మిక, కర్షక క్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం  ఇస్తున్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో పెద్దూర్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అపెరల్‌ పార్కులో తొలి గార్మెంట్‌ సంస్థ గోకుల్‌ దాస్‌ ఇమేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అపెరల్‌ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శుక్రవారం  శంకుస్థాపన చేశారు. అనంత రం నిర్వహించిన సభలో మాట్లాడారు.   సిరిసిల్లలో అపెరల్‌ పార్కు ఉండాలనేది ఈ ప్రాంత వాసుల కలగా ఉందని, 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి అపెరల్‌ పార్కు పెడతామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అప్పటి మాటకు కేసీఆర్‌ నేతృత్వంలో బీజం పడిందని అన్నారు. సిరిసిల్ల అపెరల్‌ పార్కు ద్వారా కొద్ది రోజుల్లోనే 10 వేల మంది మహిళలకు ఉపాధి లభించనుందన్నారు. సిరిసిల్ల పరిస్థితులు అందరికీ తెలిసినవేనని,  ఇంట్లో ఉండే మగవారు మగ్గం నడిపితే అక్కలు, చెల్లెళ్లు బీడీలు చుట్టే వారని అన్నారు. ఇద్దరూ కలిసి రూ.10 నుంచి 12 వేలు సంపాదించేవారు కాదన్నారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లతో నేతన్నలకు రూ.15 నుంచి 16 వేలు వేతనాలు వస్తున్నా యని అన్నారు. అపెరల్‌ పార్కు ద్వారా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా నాణ్యమైన వాతావరణంలో పనిచేసే అవకాశం మహిళలక ఏర్పడుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఫ్యాక్టరీల్లో పనిచేసే పిల్లలకు చిల్డ్రన్స్‌ కేర్‌ సెంటర్‌లు, వైద్య సదుపాయంతో  ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 88 ఎకరాల్లో రూ.400 కోట్లతో కార్మికులను యజమా నులు చేసే విధంగా వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని అందిం చేందుకు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మహిళలు కష్టపడి పనిచేయడానికి ముందుకు రావాలని, నైపుణ్యానికి శిక్షణ అందిస్తామని అన్నారు. 


టీ ట్యాప్‌తో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు 

చేనేత, జౌళి రంగాల ప్రాముఖ్యం దృష్ట్యా  మనవాళ్లకు కొలువులు, ఉపాధి అవకాశాలు దక్కే విధంగా  ముఖ్యమంత్రి అలోచనతో టీ ట్యాప్‌ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రపంచంలో ఉండే ముఖ్యమైన సంస్థలు టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  టెక్స్‌ టైల్‌, అపెరల్‌ పాలసీ (టీ ట్యాప్‌)లో భాగంగా ప్రపంచం లోని ప్రముఖ సంస్థలను కలిసినట్లు చెప్పారు. అందులో భాగంగా యంగ్‌వన్‌ సంస్థ వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో 300 ఎకరాల్లో సంస్థను ఏర్పాటు చేస్తోందన్నారు. దీని ద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. వారం రోజుల క్రితం కేరళకు చెందిన కిటెక్స్‌ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీల ద్వారా 4 వేల మందికి ఉపాధి లభించనుం దన్నారు. వరంగల్‌ తరువాత టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలో పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని అన్నారు. మన దగ్గర ఉన్న నైపుణ్యానికి పెట్టుబడులు, ఫ్యాక్టరీలు తోడైతే నేతన్నలకు, మహిళలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. దేశంలోనే వరి సాగులో తెలంగాణ రెండవస్థానంలో ఉంటే పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందన్నారు. కేవలం పండించడంలోనే కాకుండా దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్పత్తి తెలంగాణలో జరుగుతోందన్నారు గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో కంటే తెలంగాణలో నాణ్యమైన పత్తి ఉత్పత్తి అవుతోందని సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ చెబుతోందన్నారు. తెలంగాణలో పత్తి పండే నేలలు బంగారం వంటివ=న్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని కార్యక్రమాలు నేతన్నల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నారన్నారు.  ఏ పరిస్థితుల్లోనైన నేత కార్మికుడు మరణిస్తే రైతుబీమా  తరహాలో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు  ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.  కరోనా  కష్టకాలంలో నేతన్నకు చేయూత  ద్వారా రాష్ట్రంలో 26 వేల కుటుం బాలకు రూ.110 కోట్లు అందించామన్నారు. పవర్‌లూం, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పది శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కలిపి 50 శాతం యారన్‌, రసాయనాల సబ్సిడీని తెలంగాణలోనే అందిస్తున్నా మన్నారు. సిరిసిల్ల, నల్లగొండ, కాటేదాన్‌ వంటి ప్రాంతాల్లో ఉండే మరమగ్గాలను అధునికీకరించనున్నట్లు చెప్పారు. నేతన్నలు, రైతుల ఆత్మహత్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లగలుగు తున్నామన్నారు.  దేశంలోనే తెలంగాణలో రైతుల అత్మహత్యలు అతి స్వల్పమని పార్లమెంట్‌ స్వయంగా చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకవెళ్లే క్రమంలో, నేతన్నలు బాగుండాలనే క్రమంలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజరామయ్యార్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, నాఫ్స్‌కాబ్‌  చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, రెడ్డినాయక్‌, గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ సంస్థ ఎండీ సుమీర్‌ హిందుజా, జౌళి శాఖ ఏడీ అశోక్‌రావు, టెక్స్‌టైల్‌ పార్కు ఏడీ తస్నీమ్‌ తదితరులు పాల్గొన్నారు. 


ప్రొటోకాల్‌ యాదికొచ్చింది.. 

జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించకపోవడం వివాదస్ప దమైంది. ఇద్దరు అధికారులకు కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు. శుక్రవారం అపెరల్‌ పార్కు సభ కార్యక్రమం వద్ద ప్రొటోకాల్‌ ప్రకారం వారు లేకపోయిన అధికారులు వేదిక మీదికి పిలిచారు. ఇది గమనించిన ప్రజాప్రతి నిధులు అధికారులకు ప్రొటోకాల్‌ యాదికచ్చిందని మాట్లాడుకోవడం గమనర్హం. 

Updated Date - 2021-07-31T06:12:08+05:30 IST