వీకెండ్స్‌లో స్పెషల్‌ She Team.. అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్‌

ABN , First Publish Date - 2022-05-27T14:19:05+05:30 IST

ఐటీ కారిడార్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 24/7 పనిచేసే మహిళలూ ఉంటారు. అర్ధరాత్రి వేళ వారికి ఈవ్‌టీజింగ్‌ తప్పడం లేదు.

వీకెండ్స్‌లో స్పెషల్‌ She Team.. అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్‌

  • ఐటీ కారిడార్‌పై నజర్‌
  • 2 నెలల్లో 75 మంది పోకిరీల ఆటకట్టు

హైదరాబాద్‌ సిటీ : ఐటీ కారిడార్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 24/7 పనిచేసే మహిళలూ ఉంటారు. అర్ధరాత్రి వేళ వారికి ఈవ్‌టీజింగ్‌ తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో తిష్ఠ వేస్తున్న అల్లరిమూకలు, పోకిరీలు, ఆకతాయి ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోకిరీలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు విమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ విభాగం డీసీపీ అనసూయ పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌ను వీకెండ్స్‌లో రంగంలోకి దింపారు. ఈ మేరకు మహిళా పోలీస్‌ సిబ్బందికి  ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అనసూయ తెలిపారు.


ఈ ప్రాంతాలపై ఫోకస్‌.. 

ఐటీ కారిడార్‌లోని జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనే అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్స్‌పై స్పెషల్‌ టీంలు ఫోకస్‌ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, మియాపూర్‌, చందానగర్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లోని ఫుడ్‌ కోర్టులు, లేడీస్‌ హాస్టళ్ల వద్ద, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మెట్రో స్టేషన్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని బస్టాపులు, 100 ఫీట్‌ రోడ్డు, మిగిలిన హాట్‌స్పాట్‌లలో ప్రత్యేక నిఘా పెట్టారు.


పెరిగిన బృందాలు

మహిళల సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీకి పెద్దపీట వేస్తున్న సైబరాబాద్‌ పోలీసులు గతంలో నాలుగు టీమ్‌లుగా ఉన్న షీటీమ్స్‌ బృందాలను 11కు పెంచారు. ఫిర్యాదు అందిన 5 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వీకెండ్స్‌లో అర్ధరాత్రి వేళ జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో ఉంటున్నారు. పోకిరీలు, ఆకతాయిలపై కన్నేసి ఉంచుతున్నారు. మహిళలను కామెంట్‌ చేసినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. షీ టీమ్స్‌ సిబ్బందికి రక్షణగా పెట్రోలింగ్‌ పోలీసులు రంగంలోకి దిగుతారు. పక్కా ప్లాన్‌తో అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్‌లతో పోకిరీల భరతం పడుతున్నారు. ఈ మేరకు శుక్ర, శని, ఆది వారాల్లో ఒక్కో స్పెషల్‌ టీమ్‌ను రంగంలోకి దింపుతున్నారు.


మహిళల భద్రతకు..

ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి మహిళల రక్షణ, భద్రతకు వీకెండ్‌లో ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. డెకాయ్‌ ఆపరేషన్స్‌లో రెండు నెలల్లో 75 మంది పోకిరీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. బాధిత మహిళలు భయపడొద్దు. షీ టీమ్స్‌ మీకు అండగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో డయల్‌-100, సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444లకు ఫోన్‌ చేయొచ్చు. హాక్‌ఐ అప్లికేషన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు.

- అనసూయ, డీసీపీ షీటీమ్స్‌ ఇన్‌చార్జి, సైబరాబాద్‌

Updated Date - 2022-05-27T14:19:05+05:30 IST