అందం.. ఆభరణం.. పట్టుచీరనే కట్టుకున్న.. కట్టుకున్నుల్లో.. కట్టుకున్న.. ఏడడుగుల బంధానికి ఏడు ఆభరణాలు!

ABN , First Publish Date - 2021-10-23T17:52:17+05:30 IST

పట్టుచీరనే కట్టుకున్న.. కట్టుకున్నుల్లో.. కట్టుకున్న.. ఇటీవల అందరి నోళ్లలో నానిన పాట. కోట్లాది వ్యూస్‌తో దూసుకుపోతోంది...

అందం.. ఆభరణం.. పట్టుచీరనే కట్టుకున్న.. కట్టుకున్నుల్లో.. కట్టుకున్న.. ఏడడుగుల బంధానికి ఏడు ఆభరణాలు!

  • ఏడడుగుల బంధానికి ఏడు ఆభరణాలు
  • ఒక్కో ఆభరణానికి ఒక్కో ప్రత్యేకత

పట్టుచీరనే కట్టుకున్న.. కట్టుకున్నుల్లో.. కట్టుకున్న.. ఇటీవల అందరి నోళ్లలో నానిన పాట. కోట్లాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటలో కొంత భాగం ఓ పల్లె పడుచు తన పెళ్లి అలంకారాన్ని వివరిస్తూ సాగుతుంది. నిజానికి నిన్నటి వరకు సాధారణ అమ్మాయిలా కనిపించిన ఆమె తమదైన ప్రత్యేక రోజును కలకాలం గుర్తుండి  పోవాలని, వివాహ రోజు చిరకాలం నిలిచిపోవాలని  కోరుకుంటారు. వస్త్రాభరణాల ధగధగల్లో మెరిసిపోవాలనుకుంటారు. నవ వధువుకు మరింత అందాన్ని అందించేందుకు తోడ్పడేవి వస్త్రాభరణాలు. అందుకే వాటి ఎంపికకు పెద్ద పరిశోధనే చేస్తారు.


హైదరాబాద్‌ సిటీ : ఆభరణాలు కుటుంబ వారసత్వానికి ప్రతీకగా నిలవడమే కాదు.. వధువు వ్యక్తిగత అభిరుచులకూ ప్రతీకగా నిలుస్తుంటాయి. అటువంటి ఆభరణాల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డిజైనర్లు. ఇటీవల నగరంలో జరిగిన ఆభరణాల ప్రదర్శనకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన డిజైనర్లు ఆసక్తికరమైన ధోరణులను వివరించారు. అవేమిటంటే..


చోకర్స్‌.. ఇక్కడే ఉంటాయి...

సాధారణ నెక్లె్‌సల స్థానంలో మూడేళ్లుగా ట్రెండ్‌గా కొనసాగుతున్నవి చోకర్స్‌. కొన్నాళ్ల వరకు ఇవి ఫ్యాషన్‌గానే కొనసాగుతాయని పలువురు ఆభరణాల వర్తకులు చెబుతున్నా రు. సంప్రదాయ నెక్లె్‌సలతో పోలిస్తే చోకర్స్‌ ఒకరి నెక్‌లైన్‌ను అనుసరించి ఉంటాయి కాబట్టి ఏ డ్రెస్‌తో అయినా అందాన్నిస్తాయి.


కాక్‌టైల్‌ రింగ్స్‌..

ప్రామాణికమైన స్టేట్‌మెంట్‌ పీస్‌లలో ఒకటిగా కాక్‌టైల్‌ రింగ్స్‌ను చెప్పొచ్చు. వివాహ వస్త్రాలకు తక్షణమే అందాన్ని అందించాలంటే కాక్‌టైల్‌ రింగ్‌ అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. ఇప్పుడు ఇది వెడ్డింగ్స్‌లో తప్పనిసరి అయింది.


కఫ్‌ బ్రేస్‌లెట్స్‌..

వధువు వెడ్డింగ్‌ అలంకరణ చేతులకు గాజలు వేయకుండా పూర్తి కాదు. అందునా బ్రైడల్‌ బ్రాస్‌లెట్స్‌ ఇప్పుడు ఓ ట్రెండ్‌గా వెలుగొందుతున్నాయి.  డిటైలింగ్‌తో కూడిన స్టేట్‌మెంట్‌ బ్యాంగిల్స్‌ బాగా కనిపిస్తున్నాయి. 


లేయర్డ్‌ పెరల్స్‌..

చోకర్స్‌ లేదంటే నెక్లెస్‌లను ఇష్టపడని నేటి వధువుల కోసం మల్టీ లేయర్స్‌ నెక్‌పీసెస్‌ వచ్చాయి. విలాసవంతమైన లుక్‌ కావాలనుకుంటే లేయర్డ్‌ జెమ్‌స్టోన్స్‌ ధరించవచ్చు.


చిన్నగా ఉండాలి.. ప్రభావం చూపాలి..

అంగరంగ వైభవం అనే మాటకు నూతన అర్థాన్ని ఇచ్చింది కరోనా. తక్కువ మంది అతిథులు, భౌతిక దూరం, మాస్కులు. ఆప్యాయత ఉన్నా ఆలింగనం చేసుకోలేని భయం. ఈ భయాల నేపథ్యంలో భారీ తనం తగ్గింది. మినమిలిస్టిక్‌ (కొద్దిపాటి) అనేది ట్రెండ్‌గా మారింది. ఏదో ఆ సందర్భానికి మాత్రమే ధరించే ఆభరణంగా కాదు, ప్రతి సందర్భంలోనూ ఆ నగను ధరించాలనుకుంటున్న నవతరం పెరిగింది. దీనికి తోడు వివాహమంటే, వధువు మొహం మీదనే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఈ మినమలిస్టిక్‌ ధోరణిలో చాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌ కొత్తందాలను అందిస్తాయి. బంగారం లేదంటే వజ్రాలతో చేసిన చాండ్లియర్స్‌ ఎలాంటి ఔట్‌ఫిట్‌కు అయినా నూతనత్వాన్ని అందిస్తాయి.


ముక్కు మీద కోపం మాత్రమే కాదు..

ముక్కు మీద కోపం అమ్మాయికి అందమిస్తుందా అంటే చెప్పడం కష్టం. కానీ ముక్కుపుడక కచ్చితంగా అందాన్నిస్తుందనే చెబుతున్నారు వ్యాపారులు. వివాహమైన వారు ముక్కు పుడుక పెట్టుకోవాలన్నది కొన్ని కమ్యూనిటీలలో  సంప్రదాయం కావొచ్చేమో కానీ ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి అంటూ అమ్మాయిలు వీటిని ట్రై చేస్తున్నారు. నిజానికి నేటి తరపు శైలి,ధైర్యం వెల్లడిచేసే మార్గాలవి కూడా అని చెబుతున్నారు డిజైనర్లు. వజ్రాలతో రూపొందించిన శైలి మాత్రమే కాదు బంగారంతో చేసిన ముక్కుపుడకలూ ఇప్పుడు భిన్న ఆకృతులలో లభ్యమవుతున్నాయి.


నుదుటిన సింధూరం పెట్టేంత వరకైనా..

వివాహమైన అమ్మాయికి నుదుటిన సింధూరం కనిపించడం సహజం. కానీ నవ వధువుకు మాంగ్‌ టిక్కా అందాన్నే కాదు, ధైర్యమూ అందిస్తుందట! కాకపోతే ముక్కు పుడకను బట్టి ఈ మాంగ్‌ టిక్కా ఉంటే బాగుంటుంది. ముక్కుపుడక పెద్దగా ఉంటే మాంగ్‌ టిక్కా సన్నగా ఉండాలని చెబుతున్నారు డిజైనర్లు. మాంగ్‌ టిక్కా వద్దనుకునే వారు మాతా పట్టీలను ధరించవచ్చట.



Updated Date - 2021-10-23T17:52:17+05:30 IST