ఇద్దరు ముఖ్యమంత్రుల ముచ్చట!

ABN , First Publish Date - 2020-02-07T21:45:38+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా సక్సెస్‌ అయ్యారు. బడుగుల మనోభావాలను పట్టించుకోని ప్రతిపక్షాలు చివరకు ఆత్మరక్షణలో పడిపోయాయి.

ఇద్దరు ముఖ్యమంత్రుల ముచ్చట!

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా సక్సెస్‌ అయ్యారు. బడుగుల మనోభావాలను పట్టించుకోని ప్రతిపక్షాలు చివరకు ఆత్మరక్షణలో పడిపోయాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉంది. అయినా ఆ విషయం మరుగునపడిపోయి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే తమ కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారని బడుగులు నమ్ముతున్నారు. మాతృభాష అంటూ ఒక సామాజికవర్గం మాత్రమే గొడవ చేస్తున్నదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రస్తావించడం ద్వారా కమ్మవారిని బడుగులకు శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. నిజానికి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వెంకయ్యనాయుడు మాతృభాష పట్ల తన తపనను ప్రదర్శించేవారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయరన్న ప్రశ్న కేసీఆర్‌కు ఎదురవుతున్నది. దీంతో జగన్మోహన్‌ రెడ్డికి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్‌ వచ్చారని చెబుతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ, కేసీఆర్‌ను ధిక్కరించే పరిస్థితి ఆయనకు లేదు. జగన్మోహన్‌ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలగడంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలకు అభ్యంతరాలు ఉన్నాయని తెలుసుకున్న జగన్‌ తన పని తాను చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట! మొత్తానికి ఆరు నెలలు కూడా ముగియక ముందే ఇరువురు ముఖ్యమంత్రుల దారులు వేరయ్యాయి. 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మధ్య సంబంధాలు చెడిపోయాయా? తన సన్నిహితుల వద్ద కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇది నిజమేనని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి కొన్ని నెలలపాటు కేసీఆర్‌తో యుగళగీతం పాడారు. కేసీఆర్‌ తాడేపల్లిలోని జగన్‌ ఇంటికి వెళ్లడం, ఆతిథ్యం స్వీకరించడం, తమిళనాడులోని కంచి నుంచి తిరిగివెళుతూ మార్గమధ్యంలో తన ఇంటికి విందుకు వచ్చిన కేసీఆర్‌కు వైసీపీ ఎమ్మెల్యే రోజా పూలు పరిచి నడిపించడం, జగన్‌ హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌ ఆతిథ్యం స్వీకరించడం, ఈ సందర్భంగా రాయలసీమను కోనసీమ చేద్దామని కేసీఆర్‌ ప్రకటించడాన్ని మనం చూశాం, విన్నాం! ఇప్పుడు ఇదంతా గతం. గోదావరి నదిపై ఉమ్మడిగా తలపెట్టిన ప్రాజెక్టుకు తొలుత తలూపిన జగన్మోహన్‌ రెడ్డి.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కినుక వహించారు.

 

‘‘ఎన్నికల సందర్భంగా నేనెంతో సహాయం చేశాను. అయినా జగన్మోహన్‌ రెడ్డి ఇలా చేస్తారా? అనుభవిస్తాడు’’ అని కేసీఆర్‌ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని జగన్మోహన్‌ రెడ్డి పదేపదే ప్రశంసిస్తూ కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పారు. అయినా, తాను ప్రతిపాదించిన ఉమ్మడి ప్రాజెక్టును తిరస్కరించడంపై కినుక వహించిన కేసీఆర్‌ ఇక ఎవరి దారి వారిదే అని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే విషయంలో కూడా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం. సీబీఐ, ఈడీ కేసులలో తనపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అవసరం కాగా, తెలంగాణలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నందున బీజేపీతో అంటకాగితే రాజకీయంగా కేసీఆర్‌కు నష్టం జరుగుతుంది.

 

ఈ కారణంగా ఇరువురి దారులు వేరు అయ్యాయి. అంతేకాదు, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగలేరనీ, త్వరలోనే జైలుకు వెళతారనీ కేసీఆర్‌ తన పార్టీ ముఖ్యుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయరన్న ప్రశ్న కేసీఆర్‌కు ఎదురవుతున్నది. దీంతో జగన్మోహన్‌ రెడ్డికి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్‌ వచ్చారని చెబుతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ, కేసీఆర్‌ను ధిక్కరించే పరిస్థితి ఆయనకు లేదు. జగన్మోహన్‌ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. ఈ కారణంగా జగన్‌ను ఎప్పుడైనా కట్టడి చేయవచ్చునన్న అభిప్రాయంతో కేసీఆర్‌ అండ్‌ కో ఉంది. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలగడంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలకు అభ్యంతరాలు ఉన్నాయని తెలుసుకున్న జగన్మోహన్‌ రెడ్డి కూడా తన పని తాను చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట! మొత్తానికి ఆరు నెలలు కూడా ముగియక ముందే ఇరువురు ముఖ్యమంత్రుల దారులు వేరయ్యాయి.

 

ఏపీ ఉన్నతాధికారుల్లో ఉక్కపోత

కాగా, ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా మనీశ్‌ కుమార్‌ సిన్హాను నియమించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సిన్హా సీబీఐలో పని చేసినప్పుడు... అమిత్‌షాకు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారికి ఏపీలో పెద్దపీట వేయడంపై ఆగ్రహంతో ఉన్నందునే ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్‌ రెడ్డికి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ కారణంగానే ఎంకే సిన్హాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వద్ద ప్రస్తుతం ప్రవీణ్‌ మాటే చెల్లుబాటు అవుతోందని ప్రచారంలో ఉంది. ఆయనకు సంజాయిషీ నోటీస్‌ ఇచ్చిన కారణంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయిన విషయం విదితమే.

 

ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలిపై పలువురు ఐఏఎస్‌ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. దాదాపు 20 మంది ఐఏఎస్‌ అధికారులు ఇటీవల ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌తోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారశైలి కూడా తమకు ఇబ్బందికరంగా మారిందని వారు ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ‘అది చేయండి.. ఇది చేయండి’ అని ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారనీ, ఈ పరిస్థితులలో ఎలా ముందుకు వెళ్లాలో తమకు అర్థంకావడం లేదనీ పలువురు అధికారులు వాపోయారట! ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట! ‘‘జగన్మోహన్‌ రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదనుకోవడం పొరపాటు.

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఏమైనా చెబితే వినేవారు. తర్వాత కాలంలో అప్రియమైన విషయాలు చెబితే వినడానికి ఇష్టపడేవారు కాదు. ఆ తర్వాత ఏమి చెబితే అదే చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఫలితంగా నాపై ముఖ్యమంత్రికి నమ్మకం పోయింది’’ అని ఆయన చెప్పుకొచ్చారట. ముఖ్యమంత్రి ఏదో చేయబోతున్నారనీ, అందుకు తాను అడ్డువస్తానన్న ఉద్దేశంతోనే తనను తప్పించారనీ ఎల్వీ అభిప్రాయపడ్డారట! తనను తప్పించినా, మిగతా అధికారులు కూడా ఉక్కపోతకు గురవుతున్నారనీ, త్వరలోనే అధికారులు బాహాటంగానే నిరసన వ్యక్తంచేసే అవకాశం లేకపోలేదనీ తన సన్నిహితుల వద్ద ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారట! ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో తాము ఇబ్బందులపాలు కావొచ్చునని కూడా కొంతమంది అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారని హైకోర్టు శుక్రవారంనాడు ప్రభుత్వాన్ని నిలదీయడం ఈ సందర్భంగా గమనార్హం. ఇలాంటి చర్యలను అనుమతిస్తున్న అధికారులు భవిష్యత్తులో న్యాయస్థానానికి సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తుందని నేను గతంలోనే పేర్కొన్నాను. ఇప్పుడిదే జరుగుతోంది. వైసీపీ రంగులను ప్రభుత్వ భవనాలకు పులమడంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి వ్యవహారాలలో మౌఖిక ఆదేశాలు ఇచ్చినవారు బాగానే ఉంటారు. వాటిని ఉత్తర్వులుగా జారీ చేసిన అధికారులే చిక్కుల్లో పడతారు.

 

సరికొత్త రాజకీయం...

ఈ విషయం అలా ఉంచితే, రాజకీయంగా మరింత బలపడే దిశగా జగన్మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆయన సంప్రదాయ రాజకీయాలను నమ్ముకోవడం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజికవర్గాలను కూడగట్టారు. 2014లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్మోహన్‌రెడ్డి.. 2019 ఎన్నికలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచనలు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలలో మునిగితేలుతూ పార్టీని, రాజకీయాలను పూర్తిగా విస్మరించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చాలు... తనకు ఓట్లవర్షం కురుస్తుందని ఆయన భ్రమలోకి వెళ్లిపోయారు. జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో దీనికి విరుగుడుగా ‘రాజధాని ఎవరి కోసం?’ అని చేయించిన ప్రచారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అమరావతి విషయమై ప్రస్తుత మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా రాయలసీమ ప్రజలపై వాటి ప్రభావం ఏమాత్రం లేదు.

 

అమరావతితో తమకు సంబంధం లేదన్నట్టుగానే సీమ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రచారం చేస్తున్నట్టుగానే, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికే అమరావతి అని మెజారిటీ జిల్లాల ప్రజలు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా ప్రచారాన్ని కట్టడిచేయడంలో నాడు చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా అమరావతి, పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టుల వల్ల లబ్ధిపొందిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా సక్సెస్‌ అయ్యారు. బడుగుల మనోభావాలను పట్టించుకోని ప్రతిపక్షాలు చివరకు ఆత్మరక్షణలో పడిపోయాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉంది. అయినా ఆ విషయం మరుగునపడిపోయి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే తమ కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారని బడుగులు నమ్ముతున్నారు.

 

మాతృభాష అంటూ ఒక సామాజికవర్గం మాత్రమే గొడవ చేస్తున్నదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రస్తావించడం ద్వారా కమ్మవారిని బడుగులకు శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. నిజానికి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వెంకయ్యనాయుడు మాతృభాష పట్ల తన తపనను ప్రదర్శించేవారు. శాసనసభ ప్రస్తుత సమావేశాల్లో జరుగుతున్న రభస పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం వ్యూహాత్మకంగానే ఆయా అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఈ సమావేశాలలో చంద్రబాబు వయసును అధికారపార్టీ ప్రధానంగా చర్చకు తెచ్చింది. ఏడు పదుల వయసున్న చంద్రబాబుకు గానీ, ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి గానీ భవిష్యత్‌ లేదని ప్రజలను, ‘దేశం’ కార్యకర్తలను నమ్మించడమే వారి లక్ష్యంగా కనిపిస్తున్నది.

 

నిజానికి అధికారపక్షం నుంచి ఎదురవుతున్న దాడిని చంద్రబాబు దీటుగానే ఎదుర్కొంటున్నారు. అయినా సంఖ్యాబలం కారణంగా అధికారపక్షం వాళ్లు ప్రతిపక్షాన్ని బుల్డోజ్‌ చేస్తున్నారు. శుక్రవారంనాడు జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తనను అడ్డుకున్న చీఫ్‌ మార్షల్‌ను చంద్రబాబు ‘బాస్టర్డ్‌’ అని దూషించారని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా బల్లగుద్ది మరీ ఆరోపించడమే కాకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు.. తాను నిజంగా అన్నానేమో అని భావించి గతంలో తనను తిట్టినవారు క్షమాపణ చెబితే, తాను కూడా క్షమాపణ చెబుతానని చెప్పడం ద్వారా బాస్టర్డ్‌ అన్న పదం వాడినట్టుగా పరోక్షంగా అంగీకరించారు. సభ వెలుపల తీరిగ్గా సదరు వీడియోను పరిశీలించిన చంద్రబాబు... తాను ఆ పదం వాడనేలేదని తెలుసుకుని తెల్లబోయారు.

 

‘నో క్వశ్చన్‌’ అని తాను వాడిన పదాన్ని అలా వక్రీకరించారని విలేకరుల సమావేశంలో వివరించారు గానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ తరఫున 23 మంది గెలిచినా, దాదాపు పదిమంది శాసనసభ సమావేశాలలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీకి దూరం కాగా, మరికొందరు చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఐదారుగురు మాత్రమే సభలో చంద్రబాబుకు అండగా ఉంటున్నారు. శాసనసభ తొలి సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులపై కీలక ఉపన్యాసం చేసిన జగన్మోహన్‌రెడ్డి ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చెప్పేటందుకే నీతులు అని ఆయన రుజువు చేసుకున్నారు. తెలుగుదేశం తరఫున గెలిచినవారిని తన పార్టీలో నేరుగా చేర్చుకోకుండా, సభలో వారిని స్వతంత్ర సభ్యులుగా గుర్తించే సరికొత్త విధానానికి ముఖ్యమంత్రి తెరతీశారు.

 

పార్టీలో చేర్చుకుంటే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించాల్సి వస్తుంది కనుక ప్రస్తుతానికి వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా జగన్‌ పావులు కదుపుతున్నారు. ఇతరత్రా లొసుగులు ఉన్న ఎమ్మెల్యేలను జగన్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుంది. ఈ కారణంగానే అరడజనుకుపైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూనే అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి వంటివారి సహకారంతో తనపై జరుగుతున్న దాడిని చంద్రబాబు ఎదుర్కోగలుగుతున్నారు. సన్నబియ్యం విషయమై తన సొంత పత్రిక తప్పురాసిందనీ, ఆ రోజు ఇతర పత్రికలను చదివితే విజ్ఞానం వస్తుందనీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే చెప్పించడం ద్వారా చంద్రబాబు పైచేయి సాధించారు. మరో సందర్భంగా, ‘మీకు కొన్ని పత్రికలు, కొన్ని చానెళ్లు.. నాకు కొన్ని పత్రికలు, కొన్ని చానెళ్లు అండగా ఉన్నాయి’ అని జగన్‌తోనే చెప్పించారు.

 

నిండుసభలో ఈ వాస్తవాన్ని చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి.. ఇతర మీడియాను ఎందుకు నిందిస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. కాగా, జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను కూడా తనవైపు తిప్పుకోవడంలో జగన్మోహన్‌ రెడ్డి సఫలం అయ్యారు. అధికారం లేకపోతే బతకలేని పరిస్థితులు ఉండటం, అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా వ్యవహరించి తప్పులుచేయడం వల్ల ప్రతిపక్షంలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడటం వల్లనే పార్టీ ఫిరాయింపులు సాదాసీదా వ్యవహారంగా మారిపోయాయి.

 

అత్యాచారాలు ఆగేదెలా?

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా జగన్‌ ప్రభుత్వం ‘దిశ’ పేరిట శుక్రవారం నాడు ఒక బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు స్వేచ్ఛగా తిరగవచ్చునన్న అభిప్రాయం కలిగించడానికై అధికార పార్టీ ప్రయత్నిస్తున్నది గానీ.. కేవలం చట్టాలు మాత్రమే ఈ తరహా మనోవికారాలను, నేరప్రవృత్తిని నిరోధించలేవన్న విషయం ఆచరణలో చూస్తున్నాం. దిశ చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో పోలీస్‌ విచారణ వారంరోజుల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఆచరణలో ఇది అసాధ్యం. తెలంగాణలో దిశపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఫోరెన్సిక్‌ నివేదిక రావడానికే 15 రోజుల వ్యవధి పట్టింది. ఆచరణలో ఇటువంటి సమస్యలు ఎన్నో ఉత్పన్నమవుతాయి. అంతేకాదు... దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేగానీ అమలులోకి రాదు.

 

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, చట్టాలపై ప్రజలకు నమ్మకం కుదరాలంటే విచారణ త్వరితగతిన పూర్తయి శిక్షపడాలని చెప్పారు. ఈ సూత్రం ఆయనపై ఉన్న కేసులకు కూడా వర్తిస్తుందనుకోవచ్చు కదా! జగన్‌పై సీబీఐ చార్జిషీట్లు దాఖలై ఏళ్లు గడుస్తున్నా ఇంకా విచారణ కూడా మొదలుకాలేదు. చట్టంలో ఉన్న వెసులుబాటును అడ్డుపెట్టుకుని విచారణ ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది జగన్‌ అండ్‌ కో కాదా? అత్యాచార నిందితులు కూడా ఇదే వెసులుబాటుని ఉపయోగించుకుంటున్నారు.

 

ఇదిలా ఉండగా, తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య సంఘాన్ని నియమించడంతో సంబంధిత పోలీస్‌ అధికారులకు విచారణ పూర్తయ్యేవరకు కంటిమీద కునుకు ఉండదు. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు పోలీసులకు పూలాభిషేకం, పాలాభిషేకం చేసిన వారెవ్వరూ ఇప్పుడు కనిపించడం లేదు. దిశపై అత్యాచారం జరిగినప్పుడు కలుగుల్లో ఉండిపోయిన తెలుగు సినిమా హీరోలు, ఎన్‌కౌంటర్‌ జరిగాక పోటీలు పడి మరీ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. త్రిసభ్య కమిషన్‌ విచారణలో ఎన్‌కౌంటర్‌ బూటకం అని తేలితే హ్యాట్సాఫ్‌ అనిపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమీకాదు.

 

సదరు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ అధికారులే ఇబ్బందులపాలు అవుతారు. తక్షణ న్యాయం కావాలని ప్రజలు కోరుకోవచ్చు గానీ, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన వారు ఎమోషన్స్‌కు గురికాకుండా సంయమనంతో వ్యవహరించడం అవసరం. చట్టాలు, వ్యవస్థల పట్ల అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేసే సెలబ్రిటీలు అనబడేవారు కూడా ఇలాంటి సందర్భాలలో సంయమనం పాటించితే మంచిది! ఒకట్రెండు సందర్భాలలో ఎన్‌కౌంటర్‌ చేసినంత మాత్రాన మహిళలపై అత్యాచారాలు ఆగిపోవు. ఇంకేదో జరగాలి...  అది ఏమిటో ఆలోచించడం అవసరం!  

ఆర్కే

Updated Date - 2020-02-07T21:45:38+05:30 IST