వీక్‌‘ఎండ్‌..’ : వారాంతాల్లోనే Hyderabadలో అధిక రోడ్డు ప్రమాదాలు.. ఇలా చేస్తే అరికట్టొచ్చు..!

ABN , First Publish Date - 2021-12-13T19:12:27+05:30 IST

వారాంతపు రోజుల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత శని/ఆదివారం రాత్రి

వీక్‌‘ఎండ్‌..’ : వారాంతాల్లోనే Hyderabadలో అధిక రోడ్డు ప్రమాదాలు.. ఇలా చేస్తే అరికట్టొచ్చు..!

  • ప్రాణాలు కోల్పోతున్న కొందరు
  • మద్యం తాగినా వాహనాల డ్రైవింగ్‌
  • వారం రోజుల్లో ఏడుగురి దుర్మరణం 
  • రోడ్డున పడుతున్న కుటుంబాలు

హైదరాబాద్‌ సిటీ : వారాంతపు రోజుల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత శని/ఆదివారం రాత్రి నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న మందుబాబుల డ్రైవింగ్‌ ఈ వారం కూడా మరో ముగ్గురు యువకులను బలి తీసుకుంది. డ్రంకెన్‌ డ్రైవింగ్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం మత్తులో జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం... డ్రంకెన్‌ డ్రైవ్‌ కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒకరు గాయాల పాలవుతున్నారు. మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కేవలం డ్రైవ్‌ చేసిన వ్యక్తి మాత్రమే కాకుండా.. వాహనంలోని ప్రయాణికులు, రోడ్డుపై వెళ్తున్న బైకర్లు, పాదచారులు, చిన్నారులు, రోడ్డు క్రాస్‌ చేసే వారు, పెంపుడు జంతువులు, వాకింగ్‌ చేసే వారందరికీ ప్రమాదకరంగా మారుతోంది. 


ఇలా చేస్తే..

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న పోలీసులు మరికొన్ని చర్యలు చేపడితే ప్రమాదాలను అరికట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. చౌరస్తాల వద్ద కాకుండా బార్‌లు, పబ్‌లు, వైన్‌షాపులు, రెస్టారెంట్ల పార్కింగ్‌ల వద్ద ఒకరిద్దరు సిబ్బందిని కేటాయించి మద్యం తాగి బయటకు వచ్చిన వ్యక్తి వాహనం తీస్తున్న సమయంలోనే బ్రీత్‌ అనలైజర్‌తో చెక్‌ చేయాలి. తనిఖీలకు బార్‌ యజమానులు ఒప్పుకోకుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. వాహనాలపై వచ్చి మద్యం తాగి అలాగే తిరిగి వెళుతున్న వారి గురించి బార్‌ల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వాలనే నిబంధన కూడా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. బార్‌లు, పబ్‌ల వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇందులో భాగస్వాములుగా చేయాలి. ఇంట్లో, లేక నిర్మానుష్య ప్రదేశాల్లో తాగి బయటకు వచ్చి వాహనాలు డ్రైవ్‌ చేసే వారిని గుర్తించేలా సిటిజన్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేయాలి. కౌన్సెలింగ్‌, జైలు, లైసెన్సుల రద్దుతో పాటు బాధితుల చికిత్సకయ్యే ఖర్చులు, మృతి చెందితే వారికి పరిహారం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.


గత వారం..

బంజారాహిల్స్‌లో తాగి వాహనం నడిపి ఇద్దరు పాదచారుల ప్రాణాలను బలి తీసుకున్నారు. అదే రోజు నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్ల మరో ఇద్దరు దుర్మరణం చెందారు. మాదాపూర్‌లోనూ తాగిన మైకంలో వాహనం నడపడంతో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. 


ఈ వారం..

దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో నలుగురు యువకులు ఓ కారులో వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మద్యం తాగి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యానగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైకి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనం నడిపిన వ్యక్తికి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ చేయగా 86 శాతం వచ్చింది.


లారీ - ఆర్టీసీ బస్సు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుఝామున లారీ - బస్సు ఢీ కొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. తెల్లవారుఝామున 5.30 సమయంలో మేడ్చల్‌ ఆర్టీసీ డిపో బస్సు మేడ్చల్‌ జాతీయరహదారి పై నుంచి డిపో లోపలికి వెళ్తుండగా నిజామాబాద్‌ నుంచి నగరం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్‌ స్తంభించింది.


మద్యం మత్తులో డివైడర్‌కు ఢీ..

వేగంగా దూసుకొచ్చిన కారు రైల్వేఓవర్‌ బ్రిడ్జిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కారు నడిపిన వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లకుంట ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. డీడీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిరణ్‌ (40) ఆదివారం ఉదయం 6.30 సమయంలో కారులో విద్యానగర్‌ నుంచి డీడీ కాలనీ వైపు వేగంగా వెళ్తున్నాడు. విద్యానగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైకి చేరుకున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. కిరణ్‌పై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి కారు సీజ్‌ చేశారు. అనంతరం నల్లకుంట లా ఆండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-12-13T19:12:27+05:30 IST