కొవిడ్‌ నియంత్రణలో వీడని నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2020-08-12T09:18:16+05:30 IST

తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన 42 ఏళ్ళ వ్యక్తికి గతవారం కరోనా పాజిటివ్‌గా తేలింది.5వ తేదీ నుంచీ అతడు హోమ్‌ ఐసొలేషన్‌లో వుం

కొవిడ్‌ నియంత్రణలో వీడని నిర్లక్ష్యం!

సకాలంలో వైద్యమందక తిరుపతిలో బాధితుడిమృతి

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సమాచారమివ్వని అధికారులు

సమాచారమిచ్చిన మరొకరిని ఆస్పత్రికి తరలించని సిబ్బంది


       తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన 42 ఏళ్ళ వ్యక్తికి గతవారం కరోనా పాజిటివ్‌గా తేలింది.5వ తేదీ నుంచీ అతడు హోమ్‌ ఐసొలేషన్‌లో వుంటున్నారు. మంగళవారం ఉదయం హఠాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. హడావిడిగా కుటుంబసభ్యులు తక్షణ వైద్యసాయం అందుతుందన్న భావనతో ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నాలుగైదు ఆస్పత్రులకు వెళ్ళగా రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే చేర్చుకుంటామంటూ కండీషన్లు పెట్టారని బాధితుని కుటుంబీకులు వాపోతున్నారు.


      అంత స్థోమత లేని వారు పద్మావతి స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని, ఓపీలో రాయించుకుని నిరీక్షించండంటూ వైద్యులు సూచించారు. ఈలోపు బాధితుడికి శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో రుయా ఆస్పత్రికి వెళ్ళారు.అక్కడ చేర్చుకుని వెంటిలేటర్‌ అమర్చుతుండగానే బాధితుడు మరణించాడు. ఉదయం 10 గంటల నుంచీ మధ్యాహ్నం 3.30 గంటల దాకా సుమారు ఐదున్నర గంటలపాటు బాధితుడికి వైద్యం అందలేదు. సకాలంలో వైద్యం అందివుంటే బహుశా అతడి ప్రాణం నిలిచివుండేది. దీంతో అతడి భార్య, ఇద్దరు బిడ్డలు, సన్నిహిత బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


     టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగి ఒకరు మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. గత గురువారం జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారు. జ్వరం, నీరసం అధికంగా వుండడంతో ఎందుకైనా మంచిదని కరోనా టెస్టు చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. దాంతో అదే రోజు ప్రభుత్వాస్పత్రికి వెళ్ళి శ్వాబ్‌ నమూనా ఇచ్చారు. టెస్టులో పాజిటివ్‌ వచ్చిందంటూ సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచీ సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పారు. ఇంట్లోనే వుండాలని, మంగళవారం ఉదయాన్నే సిబ్బంది లేదా వలంటీరు వచ్చి ఆస్పత్రికి తీసుకొస్తారని సూచించారు. మంగళవారం ఉదయం కాదు కదా సాయంత్రం వరకూ ఎవరూ రాలేదు.


ఆస్పత్రిలో చెస్ట్‌ ఎక్స్‌రే, ఈసీజీ వంటి టెస్టులు చేసి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులూ లేవని తేలితే హోమ్‌ ఐసొలేషన్‌లో వుండేందుకు అనుమతి ఇస్తారు.ఇబ్బంది ఏదైనా వుంటే వయసు రీత్యా ఆయన్ను కొవిడ్‌ కేర్‌ సెంటరుకు లేదా కొవిడ్‌ ఆస్పత్రికి తరలించాలి. అయితే 24 గంటలు గడిచినా ఎవరూ రాకపోవడంతో బాధితుడు వలంటీరుకు ఫోన్‌ చేశారు. తనకు చెప్పకుండా మీ పాటికి మీరు నేరుగా ఆస్పత్రికి ఎందుకు వెళ్ళారంటూ దబాయింపుగా మాట్లాడిన వలంటీరు ఏ మాటా చెప్పకుండానే ఠక్కున ఫోన్‌ పెట్టేశారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో 62 ఏళ్ళ ఆ బాధితుడు సతమతమవుతున్నారు.


 మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ చిరుద్యోగి 4వ తేదీ కరోనా టెస్టు కోసం నమూనా ఇచ్చారు. వాస్తవానికి 10వ తేదీన సోమవారం టెస్టు ఫలితాలు వచ్చాయి. అందులో ఆ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. అయితే బాధితుడికి ఆ సమాచారం మంగళవారం మధ్యాహ్నం దాకా అందించలేదు. జాబితాలో పేరు చూసి ఓ మిత్రుడు అప్రమత్తం చేయడంతో విషయం తెలుసుకుని బాధితుడు షాక్‌ తిన్నారు.


ఎందుకంటే మంగళవారం మధ్యాహ్నం దాకా రోజూ బాధితుడు సహచర ఉద్యోగులతో కలసి విధులకు హాజరవుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులతోనూ గడుపుతున్నారు. వారిలో వృద్ధులైన తల్లిదండ్రులూ వున్నారు. తన వల్ల సహచర ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు వైరస్‌ సోకి వుంటుందేమోనని వేదన చెందుతున్న అతడు ప్రత్యేకించి వృద్ధులైన తల్లిదండ్రులకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని కన్నీటి పర్యంతమవుతున్నారు.


తిరుపతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాంగపు నిర్లక్ష్య ధోరణులు తగ్గుముఖం పట్టడం లేదు.ఎక్కడికక్కడ కొవిడ్‌ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేవారు, తప్పిదాలను, లోపాలను గుర్తించే వారు లేకపోతున్నారు. ఉదాహరణకు తిరుపతిలో హోమ్‌ ఐసొలేషన్‌లో వున్న బాధితుడికి శ్వాస సంబంధ సమస్య తలెత్తితే ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్ళాలో ముందస్తుగా సూచించిన వారు, సమాచారమిచ్చిన వారు, రోజువారీ ఆ బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసినవారూ లేకపోవడం గమనార్హం.


అలాగే మదనపల్లెలో 62 ఏళ్ళ వృద్ధుడికి పాజిటివ్‌ వస్తే సకాలంలో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళి సంబంధిత పరీక్షలు చేయించారా లేదా? హోమ్‌ ఐసోలేషన్‌లో వుండడానికి ఆయన ఫిట్‌గా వున్నారా? లేకుంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు గానీ ఆస్పత్రికి గానీ తరలించారా? అన్నది ఏ అధికారీ క్రాస్‌ చెక్‌ చేయలేదు. కిందిస్థాయిలో సంబంధిత సిబ్బంది ఏం చేస్తున్నారని ఎవరూ పట్టించుకోలేదు.అలాగే మదనపల్లెలోనే ఆస్పత్రిలో పనిచేసే ఓ చిరుద్యోగికి పాజిటివ్‌ వచ్చిన తర్వాత కూడా 24గంటలైనా సమాచారం అందకపోవడాన్ని ఏమనుకోవాలి? 4వ తేదీన నమూనా ఇస్తే ఆరు రోజుల తర్వాత ఫలితం రావడమేమిటి? అంత ఆలస్యం ఎందుకైంది? వీటిని కనీసం ర్యాండమ్‌గానైనా చెక్‌ చేసే యంత్రాంగం కరువైంది.


కనీసం మండలంలో వైద్యాధికారో, తహసిల్దారో, ఎంపీడీవోనో ఎవరో ఓ అధికారి రోజులో గుర్తించిన మొత్తం కేసుల్లో నలుగురైదుగురు బాధితుల విషయంలోనైనా లోతుగా ఆరా తీస్తే కొవిడ్‌ నియంత్రణ చర్యలు ఏమాత్రం అమలవుతున్నాయో తెలిసి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో లోపాలు సరిదిద్దుకోవాల్సిన తక్షణావసరముంది.


20 వేలకు చేరువైన కేసులు

కొత్తగా 818 మందికి సోకిన కరోనా

  జిల్లాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచీ మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 818 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో 298 కేసులు కేవలం మంగళవారం ఉదయం 9 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ 12 గంటల్లో నమోదయ్యాయి.


తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 90, చిత్తూరులో 62, చంద్రగిరిలో 44, తిరుపతి రూరల్‌ మండలంలో 23, మదనపల్లెలో 11, వరదయ్యపాలెంలో 10, రేణిగుంటలో 6, శ్రీకాళహస్తి, కేవీపల్లె, ఏర్పేడు మండలాల్లో 5 చొప్పున, పిచ్చాటూరులో 4, పీలేరు, సత్యవేడు, సోమల, పుత్తూరు మండలాల్లో 3 చొప్పున, వడమాలపేట, కలికిరి మండలాల్లో 2, సదుం,  చిన్నగొట్టిగల్లు, వడమాలపేటలో 2, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, పలమనేరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, శాంతిపురం, వెదురుకుప్పం, యాదమరి, బి.కొత్తకోట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన కేసు ఒకటి వున్నాయి.


కాగా వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాలో 19750కు చేరుకుని 20 వేలకు చేరువయ్యాయి. మంగళవారం తిరుపతిలో సకాలంలో వైద్యం అందక కొవిడ్‌ బాధితుడొకరు మృతి చెందారు. సోమల మండలంలో టీచరు ఒకరికి, కేవీపల్లె మండలం వగళ్ళలో సచివాలయ ఉద్యోగి ఒకరికి కరోనా సోకింది.


12మంది మృతి....127 మంది డిశ్చార్జి 

కరోనా వ్యాధితో పోరాడుతూ 12మంది మృత్యువాత పడ్డారు. చికిత్స పొందుతూ కోలుకున్న 127 మందిని మంగళవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 47 మంది, రుయా నుంచి 13,  శ్రీనివాసం సెంటర్‌ నుంచి 67 మంది చొప్పున ఉన్నారు. 

Updated Date - 2020-08-12T09:18:16+05:30 IST