పెళ్లిళ్లు లేక వ్యాపారాలు డీలా..

ABN , First Publish Date - 2020-08-03T10:47:42+05:30 IST

కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజారోగ్యం నుంచి వ్యాపారాలు దాకా అన్ని దెబ్బతిన్నాయి.

పెళ్లిళ్లు లేక వ్యాపారాలు డీలా..

ఆదాయంలేక భారమైన అద్దెలు

కార్మికుల బతుకులు దుర్భరం

ఆదుకోవాలంటూ వినతి


చేజర్ల, ఆగస్టు 2 : కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజారోగ్యం నుంచి వ్యాపారాలు దాకా అన్ని దెబ్బతిన్నాయి. మధ్యతరగతి ఆర్థిక పరిస్ధితులు కూడా తలకిందులయ్యాయి. దాదాపు మూడు నెలల అనంతరం వ్యాపారాలు అంతంతమాత్రాన కొనసాగినా, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోక పోవడంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.

 

 వ్యాపారాల నిర్వహణ ఎలా?

 చేతిలో చిల్లిగవ్య లేకుండా  వ్యాపారం కొనసాగించడమా..మానడమా..అనే పరిస్ధితి నెలకొందని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము ఆశించిన స్ధాయిలో వ్యాపారాలు జరిగేవని, ప్రస్తుతం అద్దెకు సరిపోయేంత వ్యాపారం కూడా జరగడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు. చాలా మంది వ్యాపారులు ఖర్చులు తగ్గించుకోవడానికి తమ వద్ద పనిచేసే వర్కర్లను తొలగిస్తున్నారు. అయినా పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో కరోనా తీవ్రత తగ్గేనా..తిరిగి వ్యాపారాలు పుంజుకునేనా ? అనే సందిగ్దంలోనే వారు సతమతమవుతున్నారు.  యజమానులు జీతం ఇచ్చే పరిస్ధితి లేకపోవడంతో కరోనా ఎప్పుడు పోతుందో తెలియక పనిచేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.


కార్మికుల పరిస్ధితి దారుణం

 వ్యాపారం చేస్తున్న వాళ్లు ఎంతో కొంత ఆర్ధికంగా నిలదొక్కుకుని ఉంటారు. ఇప్పుడు నష్ఠాలు వచ్చినా, షాపులు మూసివేసినా కొంతకాలం కుటుంబాన్ని పోషించుకోగలరు. కానీ వారి దగ్గర పనిచేసే కార్మికుల పరిస్ధితి ప్రశ్నార్ధకంగా మారింది. రోజూవారీ కూలీతో పాటు, నెల జీతమే వారికి ఆదాయం. ఒక్క నెల జీతం రాకపోతే వారి పరిస్ధితులు తలకిందులవుతాయి. అలాంటి వారిలో ఫొటోగ్రాపర్లు, క్యాటరింగ్‌ ,హైరర్స్‌, విద్యుత్‌ దీపాలంకరణ నిర్వాహకుల దగ్గర పనిచేసే గుమస్తాలు, కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు.  కరోనా ప్రభావంతో వారికి పని దొరక్క కుటుంబం గడవడం కష్టంగా మారింది. కొందరు అర్ధాకలితో అలమటిస్తుండగా, మరికొంద రు ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గర చేయి చాపలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.


భారీగా అద్దెలు

నగరాలతో పోటాపోటీగా, పల్లెల్లో కూడా షాపుల అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. పైగా రెండు, మూడు నెలల అద్దె అడ్వాన్సు చెల్లించి మరి షాపులు నిర్వహిస్తున్న వారు ఎందరో ఉన్నారు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఈ మూడు నెలలు వ్యాపారం సాగకపోవడంతో అద్దె భారమైపోయింది. ఓ వైపు ఆదాయం లేక, బయట అప్పు పుట్టక, మరో వైపు షాపు యజమానుల నుంచి వచ్చే ఒత్తిళ్లతో వందలాది మంది వ్యాపారులు సతమతం అవుతున్నారు. ఇంట్లో ఖర్చులకు తోడు, షాపుల నిర్వహణ అంతంతమాత్రంగా ఉండడంతో, పులువురు షాపులు ఖాళీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇకనైనా ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్‌,హైరర్స్‌, విధ్యుత్‌ దీపాలంకరణ నిర్వాహకుల కష్టాలు గుర్తించి, ఆర్ధికంగా తమను ఆదుకోవాల ని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-08-03T10:47:42+05:30 IST