వెబ్‌ల్యాండ్‌ అక్రమాలు..38 మంది రెవెన్యూ అధికారులపై కొరడా!

ABN , First Publish Date - 2022-06-28T08:06:03+05:30 IST

వెబ్‌ల్యాండ్‌ భూమి రికార్డుల్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన అధికారులపై రెవెన్యూ శాఖ కొరడా ఝళిపించింది.

వెబ్‌ల్యాండ్‌ అక్రమాలు..38 మంది రెవెన్యూ అధికారులపై కొరడా!

  • వీరిలో ముగ్గురు డిస్మిస్‌.. 
  • 8 మందిపై సస్పెన్షన్‌ వేటు
  • మరో ఆరుగురికి రివర్షన్‌.. 
  • ఇంకొకరికి నిర్బంధ పదవీ విరమణ
  • పీలేరు భూముల కేసుల్లో 12 మందికి షోకాజ్‌ నోటీసులు
  • ఇంకో 15 మందిపై విచారణ..
  • సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు
  • ఆ శాఖ చరిత్రలో ఇదే తొలిసారి!..
  • గుట్టుగా ఉంచుతున్న రెవెన్యూ శాఖ?


అవినీతికి మారుపేరన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ చరిత్రలో మొదటిసారి అక్రమార్కులపై వేటు పడింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డులను తారుమారు చేసిన తహశీల్దార్లు, ఇతర సిబ్బందిపై సీసీఎల్‌ఏ కన్నెర్ర చేశారు. 23 మంది అధికారులపై కఠిన చర్యలు తీసుకోగా.. మరో 15 మందిపై వచ్చిన ఫిర్యాదులపై నిశిత పరిశీలన చేయిస్తున్నారు. తప్పుచేసినవారు ఎవరైనా దండన తప్పదని తన చర్యల ద్వారా హెచ్చరించారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వెబ్‌ల్యాండ్‌ భూమి రికార్డుల్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన అధికారులపై రెవెన్యూ శాఖ కొరడా ఝళిపించింది. డిజిటల్‌ కీలను దుర్వినియోగం చేసిన తహశీల్దార్లు, తప్పుడు నివేదికలు ఇచ్చిన డిప్యూటీ తహశీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు), గ్రామ రెవెన్యూ అధికారులపై(వీఆర్‌వో) చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 38 మంది రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. వీటిని నేరుగా సంబంధిత అధికారులకే వ్యక్తిగతంగా పంపించినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులను బహిర్గతం చేయకుండా రెవెన్యూ శాఖ గోప్యంగా ఉంచింది. క్రమశిక్షణ చర్యల్లో కొన్ని కఠినమైనవేగాక తీవ్ర సంచలనమైనవి కూడా ఉన్నట్లు తెలిసింది.


 చర్యలు ఎదుర్కొన్నవారిలో 11 మంది తహశీల్దార్లే. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో వీరిలో ముగ్గురిని (కడప జిల్లాలో ఒకరు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు) సర్వీసు నుంచి డిస్మిస్‌ చేసినట్లు తెలిసింది. అసైన్డ్‌ భూముల ఖాతాల్లో అసలు  హక్కుదారుల పేర్లు తొలగించి, ఇతరుల పేర్లు చేర్చినందుకు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో విఫలమైనందుకు, ప్రైవేటు భూముల ఖాతాల్లో అడ్డగోలు సవరణలు చేసినందుకు కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాల పరిధిలో ఎనిమిది మంది తహశీల్దార్లను సస్పెండ్‌ చేశారు. ఇవే ఆరోపణలపై ఆరుగురు తహశీల్దార్లకు ఆ కేడర్‌ నుంచి దిగువ శ్రేణి పోస్టులకు (డిప్యూటీ తహశీల్దార్‌ లేదా ఆర్‌ఐ) రివర్షన్‌  ఇచ్చారు. వీరిలో అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ తహశీల్దార్‌కు దిగువ శ్రేణి కేడర్‌కు శాశ్వత రివర్షన్‌ ఇచ్చారు. అంటే ఇకపై ఆయనకు ఎలాంటి పదోన్నతులూ రావు. రిటైరయ్యేవరకు ఆ పోస్టులోనే కొనసాగాలి. 


చిత్తూరు జిల్లాకు చెందిన ఓ తహశీల్దారుతో నిర్బంధంగా పదవీవిరమణ చేయించారు. ఆయనకు ఇంకా సర్వీసు చాలానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, ఏలూరు జిల్లాలో ఒక తహశీల్దార్‌కు సగటున రెండు వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేయాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ టైపిస్టును మరింత దిగువ కేడర్‌కు మార్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళా డిప్యూటీ సర్వేయర్‌కు ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపివేశారు. కాగా.. పీలేరు భూముల కేసుల్లో 12 మంది అధికారులపై తీవ్ర అభియోగాలు రావడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వీరిలో ఇందులో ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, 8 మంది వీఆర్‌వోలున్నారు. పీలేరు భూముల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం తిరుపతి నగరంలో కీలక రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. వారిపై ఇప్పటికే అభియోగాలు మోపారు. వారు కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత క్రమశిక్షణ చ ర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. 


మరో 15 మంది తహశీల్దార్లపై ఫిర్యాదులు

వెబ్‌ల్యాండ్‌ అక్ర మాల నేపథ్యంలో 8 జిల్లాల పరిధిలోని మరో 15 మంది తహశీల్దార్లపై వచ్చిన ఫిర్యాదులను ఉన్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు. కృష్ణా, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో 8 మంది తహశీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూముల రికార్డులను గుట్టుగా మార్చేశారని బాధితులు సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు. వీటిపై నిశిత పరిశీలన జరుగుతోంది. కడ ప జిల్లాలో ఇటీవల వివాదాస్పదమైన భూముల కేసుల్లో కూడా ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. 


ఇంతకు ముందెన్నడూ లేదు!

రెవెన్యూశాఖ అధికారులు భూ రికార్డులు మార్చడం, రైతులను కన్నీళ్లు పెట్టించడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. రైతులు పురుగుల మందు తాగి లేదా ఉరివేసుకొని చనిపోతే సంబంధిత తహశీల్దార్లపై చర్యలు తీసుకున్నా.. సస్పెన్షన్‌ చేయడమో లేదా షోకాజ్‌ నోటీసులివ్వడమో జరిగేది. కానీ ఆ శాఖ చరిత్రలో తొలిసారిగా అధికారులు చేసిన తప్పులకు డి స్మిస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. చేసిన తప్పులకు తదుపరి ఉద్యోగం చేయడానికి వీల్లేదని తహశీల్దార్‌ను నిర్బంధంగా పదవీ విరమణ చేయించడం ఇంతకు ముందెన్నడూ జరుగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో వెబ్‌ల్యాండ్‌లో అక్రమాలు జరిగితే తహశీల్దార్లను బదిలీ చేయడం లేవంటే పోస్టింగ్‌ ఇవ్వకుండా కలెక్టరేట్ల పరిధిలో వెయిటింగ్‌లో పెట్టేవారు. ఇప్పుడు అక్రమాల తీవ్రతను బట్టి తహశీల్దార్లకు దిగువ కేడర్‌కు రివర్షన్‌ ఇచ్చారు.


మాఫియాతో అంటకాగుతూ..!

తహశీల్దారు మండలానికి సర్వాధికారి. రెవెన్యూశాఖతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యక్రమాల్లో ఆయన/ఆమెదే పెత్తనం. మేజిస్ట్రేట్‌ అధికారాలు కూడా ఉన్నాయి. ఇంతటి కీలక అధికారాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నేతలు, భూ మాఫియాతో అంటకాగుతూ తమకు ఎదురే లేదన్నట్లు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేయడంతోపాటు ప్రైవేటు భూముల రికార్డులను సొంత విషయంలో మార్చేస్తున్నారు. ఈ పరిణామాలపై రెవెన్యూ శాఖకు ఎంతో మంది ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదు. తప్పులు చేసిన అధికారులు తమపై ఫిర్యాదులు రాగానే సెటిల్‌ చేసుకోవడం, మళ్లీ రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. తమకు కొమ్ముకాసే నేతలు, ప్రజాప్రతినిఽధులతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించి  చర్యల్లేకుండా అడ్డుకోవడం ఓ తంతుగా మారింది. ఇప్పుడు పరిస్థితి మారిపోవడం.. ఏకంగా 23 మంది సిబ్బందిపై ఒకేసారి సీసీఎల్‌ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం.. అక్రమార్కులైన అధికారుల్లో అలజడి రేపుతోంది.

Updated Date - 2022-06-28T08:06:03+05:30 IST