Abn logo
Apr 6 2021 @ 03:52AM

లాక్‌డౌన్‌ వద్దనుకుంటే మాస్కులు ధరించండి

  • కరోనా ఇంకా పూర్తిగా పోలేదు
  • వైరస్‌ నియంత్రణకు సహకరించాలి: కేటీఆర్‌
  • పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
  • అందుబాటులోకి హైటెక్‌సిటీ రోడ్‌ అండర్‌ బ్రిడ్జి

హైదరాబాద్‌ సిటీ/కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా పూర్తిగా పోలేదు. రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది. మరోసారి లాక్‌డౌన్‌ వద్దనుకుంటే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు సహకరించాలని, బాధ్యతగా ఉండాలని ఆయన చెప్పారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రూ.66.59 కోట్లతో కూకట్‌పల్లి-హైటెక్‌ సిటీ  మధ్య నిర్మించిన రోడ్‌ అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని ఆయన సోమవారం ప్రారంభించారు. అలాగే, కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లో రూ.3.50 కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, రూ.40 లక్షలతో నిర్మించిన కర్మల భవనం, ఖైత్లాపూర్‌లోని అంబేడ్కర్‌నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డు వరకు రూ.99 లక్షలతో నిర్మించ తలపెట్టిన వీడీసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 


చెత్త డంపింగ్‌తో ఇబ్బందులు పడుతున్నామని, దుర్వాసన వల్ల అనారోగ్యపాలవుతున్నామని ఖైత్లాపూర్‌లో స్థానికులు మంత్రితో చెప్పారు. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ఆధునికీకరించి ఇబ్బందులు లేకుండా చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లోని మునిసిపాలిటీల్లో రూ.3,500 కోట్లతో సివరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయనున్నట్టు చెప్పారు. మురుగు ప్రవాహ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. వర్షాలతో కాలనీలు, బస్తీలు ముంపునకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని, ఈ బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకుంటారని చెప్పారు. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఆర్భాటంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావడంతో కార్యక్రమాల వద్ద భౌతిక దూరం పాటించే పరిస్థితి లేకుండా పోయింది. 

ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌

హైటెక్‌సీటీ ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పడనుంది. 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఆర్‌యూబీతో హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. 

Advertisement
Advertisement
Advertisement