డ్రగ్స్‌ దందాలో సంపన్నులు

ABN , First Publish Date - 2022-01-28T08:41:00+05:30 IST

పబ్‌లు.. క్లబ్‌లు.. ఈవెంట్లే అతడి టార్గెట్‌..! ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇలాంటి పార్టీలు జరిగినా..

డ్రగ్స్‌ దందాలో సంపన్నులు

  • ఇప్పటికి ఏడుగురు పెద్దల అరెస్టు
  • చిట్టాలో మరికొందరి పేర్లు!
  • టోనీ నోరు విప్పితే కటకటాల్లోకి మరికొందరు!
  • అతని రిమాండ్‌ రిపోర్టులో ఆసక్తికర అంశాలు
  • సంపన్నుల కస్టడీకి నేడు హైకోర్టులో పిటిషన్‌?


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పబ్‌లు.. క్లబ్‌లు.. ఈవెంట్లే అతడి టార్గెట్‌..! ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇలాంటి పార్టీలు జరిగినా.. వెంటనే వాలిపోతాడు..! ఆ పార్టీలకు వచ్చే సంపన్నులను మచ్చిక చేసుకుంటాడు..! తన డ్రగ్స్‌ దందాలో వారిని కలుపుకొంటాడు..! వందలు.. వేల కోట్ల సంపన్నులనూ ముగ్గులోకి దింపుతాడు..! అలా దేశవ్యాప్తంగా తన డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలనుకున్నాడు..! ఇదీ.. హైదరాబాద్‌ పోలీసులు వలపన్ని, అరెస్టు చేసిన నైజీరియన్‌ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ టోనీ నేరశైలి..! టోనీ అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇతని నెట్‌వర్క్‌లో సంపన్నులే ఏజెంట్లుగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా.. మరో 10 మంది నిందితులను పట్టుకోవాల్సి ఉంది. శుక్రవారం నుంచి ఐదురోజుల పోలీసు కస్టడీలో.. టోనీని విచారిస్తే.. మరికొందరు సంపన్నుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.


సంపన్నుల చిట్టా ఇదే..!

ఈ కేసులో ప్రధాన నిందితుడు చుగ్వు ఒగ్బోనా డేవిడ్‌ అలియాస్‌ టోనీ. నైజీరియా నుంచి 2013లో విజిటర్స్‌ వీసాపై భారత్‌కు వచ్చి.. ముంబైలోని అందేరీలో మకాం పెట్టాడు. వీసా గడువు ముగిసినా.. ఇక్కడే ఉంటూ గంజాయికి బానిసయ్యాడు. ఆ తర్వాత మత్తుపదార్థాల విక్రయాన్ని దందాగా మార్చుకున్నాడు. 2019లో అలా ముంబై, గోవాల్లో డ్రగ్స్‌ దందాను ప్రారంభించి, కోట్లకు పడగలెత్తాడు. దేశమంతా తన సామ్రాజ్య విస్తరణకు ప్లాన్‌ వేశాడు. ఆయా నగరాల్లోని సంపన్నులను తన నెట్‌వర్క్‌లో కలుపుకొంటూ దక్షిణాదికి తన దందాను విస్తరించాడు. ఈ నెల 20న సిటీ పోలీసులు ఇతణ్ని అరెస్టు చేశారు.


పోలీసులు టోనీతో పాటు.. హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ కుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు. ఇతను హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కాంట్రాక్టులు తీసుకుంటుంటాడు. వెయ్యికోట్ల టర్నోవర్‌ ఉన్న ఇతను.. టోనీ నుంచి 30 సార్లు పెద్దమొత్తంలో డ్రగ్స్‌ కొనుగోలు చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఈటా వాషింగ్‌ పౌడర్‌ డిస్ట్రిబ్యూషన్‌తో పరిచయమైన శశావత్‌ జైన్‌ వందల కోట్లు సంపాదించాడు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఓ వెలుగు వెలిగాడు. శంషాబాద్‌లోనూ వందల కోట్ల రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలున్నాయి. ఇతను కూడా టోనీ నెట్‌వర్క్‌లో ఉన్నాడు. కటకటాలు లెక్కిస్తున్నాడు.

పాతనగరంలోని గౌలీపురకు చెందిన యజ్ఞ ఆనంద్‌ మసాలా దినుసుల వ్యాపారి. ఇదే దందాలో వందల కోట్ల టర్నోవర్‌కు ఎదిగాడు. ఇప్పుడు డ్రగ్స్‌ దందాలో అరెస్టయ్యాడు.

బంజారాహిల్స్‌కు చెందిన దండు సూర్య సుమంత్‌రెడ్డి ఓ బడా కాంట్రాక్టర్‌. బ్రిడ్జిల నిర్మాణంలో యాక్టివ్‌. వందల కోట్ల వ్యాపారముంది. టోనీతో జతకట్టి అరెస్టయ్యాడు.

ఎర్రగడ్డకు చెందిన బండి భార్గవ్‌ బడా కాంట్రాక్టర్‌. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టాడు. ఇతనూ డ్రగ్స్‌ దందాలో పీకల్లోతు మునిగిపోయాడు.

బంజారాహిల్స్‌కు చెందిన వెంకట్‌ చలసాని ప్రముఖ వ్యాపారి. ఎక్స్‌పోర్ట్స్‌/ఇంపోర్ట్స్‌ దందా. డ్రగ్స్‌ను కూడా తన దందాలో చేర్చి, కటకటాలపాలయ్యాడు.

వీరితోపాటు.. బంజారాహిల్స్‌కు చెందిన మరో సంపన్నుడు తమ్మినేని సాగర్‌, ప్రైవేటు ఉద్యోగి అల్గాని శ్రీకాంత్‌, ఆఫీ్‌సబాయ్‌ గోడి సుబ్బారావు, టోనీ ప్రధాన అనుచరుడు ఇమ్రాన్‌ బాబు షేక్‌, నూర్‌ మహమ్మద్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


చిక్కాల్సిన నిందితులు..

పోలీసులు అరెస్టు చేయాల్సిన మిగతా పదిమంది నిందితుల్లోనూ సంపన్నులే అధికంగా ఉన్నట్లు తెలిసింది. వారిలో.. మహమ్మద్‌ ఆసిఫ్‌ ఆరిఫ్‌ షేక్‌, ఖాజా మహమ్మద్‌ షాహిద్‌ ఆలం, అఫ్తాబ్‌ పర్వేజ్‌, రెహ్మాన్‌, ఇర్ఫాన్‌, ఫిర్దౌజ్‌(ఇమ్రాన్‌ భార్య), సోమ శశికాంత్‌, గజేంద్ర ప్రకాశ్‌, సంజయ్‌ గర్డపల్లి, అలోక్‌జైన్‌ ఉన్నారు.


కస్టమర్‌ ఎవరో తెలియకుండా జాగ్రత్తలు

డ్రగ్స్‌ సమకూర్చుకోవడంలో.. తర్వాత వాటిని సరఫరా విషయంలో టోనీ జాగ్రత్తగా వ్యవహరించేవాడని పోలీసులు గుర్తించారు. కస్టమర్ల వివరాలు తన ఏజెంట్లకు కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన వద్ద ఉన్న ఇంటర్నేషనల్‌ మొబైల్‌ నంబర్‌, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే స్థానిక మొబైల్‌ నెంబర్ల ద్వారా..  వాట్సాప్‌ కాల్స్‌ మాత్రమే మాట్లాడుతుండేవాడు. కస్టమర్లతో ఇంటర్నేషనల్‌ నంబర్‌ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడుతూ వారికి ఎంత మొత్తంలో డ్రగ్స్‌ కావాలి? ఎక్కడ డెలివరీ చేయాలి? అనే వివరాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన ఏజెంట్లకు డెలివరీపై సూచనలు చేస్తాడే తప్ప.. కస్టమర్‌ వివరాలు ఇవ్వడు. ఉదాహరణకు కస్టమర్‌కు డ్రగ్స్‌ డెలివరీ చేయాలంటే.. ఏజెంట్‌ను సరుకుతోపాటు రంగంలోకి దింపుతాడు. కస్టమర్‌ పేరు, మొబైల్‌ నంబర్‌ వివరాలు ఇవ్వకుండా.. ఎక్కడికి వెళ్లాలి?ఏ కారులో కస్టమర్‌ ఉన్నాడు? అనే విషయం మాత్రమే చెబుతాడు. కస్టమర్‌ ఇచ్చే డబ్బును వెస్టర్న్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా తన విదేశీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకుంటాడు. అంటే.. పోలీసులకు కస్టమర్‌ దొరికితే.. తాను ఎవరో తెలియదు. అలాగే ఏజెంట్‌ పట్టుబడితే.. కస్టమర్‌ తెలియదు అనేది టోనీ వ్యూహంలో భాగమని పోలీసులు గుర్తించారు.


సంపన్నుల కస్టడీకి.. నేడు హైకోర్టులో పిటిషన్‌

ప్రస్తుతం డ్రగ్స్‌ కేసు కస్టడీ పిటిషన్లు నాంపల్లి కోర్టు పరిధిలో జరుగుతుండగా.. దర్యాప్తు అధికారులు అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ కేసులో వందల కోట్లకు పడగలెత్తిన సంపన్నులు కూడా ఉండడంతో.. కస్టడీ పిటిషన్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-01-28T08:41:00+05:30 IST