ఐశ్వర్యం - జ్ఞానం!

ABN , First Publish Date - 2021-06-20T09:08:25+05:30 IST

తెనాలి రామకృష్ణ గొప్ప పేరున్న కవి అని అందరికీ తెలుసు. ఆయనకు కాళీ దేవత అనుగ్రహం వల్ల ఆ జ్ఞానం అబ్బింది అని అంటారు. ఒకరోజు తెనాలి రామకృష్ణ నివసించే

ఐశ్వర్యం - జ్ఞానం!

తెనాలి రామకృష్ణ గొప్ప పేరున్న కవి అని అందరికీ తెలుసు. ఆయనకు కాళీ దేవత అనుగ్రహం వల్ల ఆ జ్ఞానం అబ్బింది అని అంటారు. ఒకరోజు తెనాలి రామకృష్ణ నివసించే ఊరికి ఒక గొప్ప జ్ఞాని వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రజలందరూ ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. అందులో రామకృష్ణ కూడా ఉన్నాడు. ఆ సమయంలో రామకృష్ణను చూసిన ఆ జ్ఞాని ‘‘నువ్వు గొప్ప కవి’’ అవుతావు అని చెప్పాడు. వెంటనే ‘‘నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. గ్రామ పొలిమేరల్లో ఉన్న కాళీమాత ఆలయంలో ఆ మంత్రాన్ని 1008 సార్లు జపించు. అమ్మ నీకు ప్రత్యక్షమయి నిన్ను దీవిస్తుంది’’ అన్నాడు. ఆయన చెప్పిన విధంగా మరుసటి రోజు తెనాలి రామకృష్ణ ఆలయానికి వెళ్లి కాళీ మాత విగ్రహం ముందు కూర్చుని మంత్రం జపించడం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక ‘‘రామా...రామా’’ అని పిలుపు వినిపించింది.


దాంతో కళ్లు తెరిచి చూశాడు. ఎదురుగా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ‘‘నీకు ఏం కావాలో కోరుకో!  నా చేతుల్లో రెండు పాత్రలున్నాయి. ఒక దాంట్లో పాలున్నాయి. అవి తాగితే గొప్ప జ్ఞానం వస్తుంది. ఇంకో పాత్రలో పెరుగు ఉంది. అది తీసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే నీవు ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. బాగా ఆలోచించి తీసుకో’’ అని అన్నారు అమ్మవారు. కొద్దిసేపు ఆలోచించిన రామకృష్ణ ‘‘మాతా! తాగడానికి ముందు నేను వాటి రుచి చూడొచ్చా?’’ అని అడిగాడు. అందుకు కాళీ మాత ఒప్పుకుని పాత్రలు రామకృష్ణకు ఇచ్చింది. వాటిని అందుకున్న రామకృష్ణ రెండు పాత్రలో ఉన్న పానీయాన్ని తాగేశాడు. అది చూసిన కాళీమాతా ‘‘రామా! నా ఆదేశాలు పాటించకుండా రెండు పాత్రల్లోని పానీయం ఎందుకు తాగావు?’’ అని ప్రశ్నించింది. తెనాలి రామకృష్ణ అమ్మవారి ముందు తలవంచుకుని ‘‘నన్ను క్షమించండి మాతా! ఐశ్వర్యం లేకుండా జ్ఞానంతో ఉపయోగం ఏముంది? జ్ఞానం లేకుండా ఐశ్వర్యంతో నేను ఏం చేయగలను?’’ అన్నాడు. తెనాలి రామకృష్ణ మాటలకు ముగ్ధురాలై ఆశీర్వదించి అదృశ్యమయింది. 

Updated Date - 2021-06-20T09:08:25+05:30 IST