గ్యాస్‌ ధర తగ్గించే పార్టీకే ఓటేస్తాం

ABN , First Publish Date - 2022-08-10T09:18:17+05:30 IST

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో పాదయాత్ర నిర్వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంగళవారం అనూహ్య పరిణామం ఎదురైంది. గ్యాస్‌ ధరలను తగ్గించే పార్టీకే ఓటేస్తామని తాళ్ల సింగారం గ్రామస్తులు తేల్చి చెప్పడంతో ఆయన షాక్‌ అయ్యారు.

గ్యాస్‌ ధర తగ్గించే పార్టీకే ఓటేస్తాం

బండికి షాక్‌.. 

పాదయాత్రలో యాదాద్రి జిల్లా తాళ్ల సింగారం గ్రామ ప్రజల స్పష్టీకరణ

సర్దిచెప్పేందుకు సంజయ్‌ ప్రయత్నం

నెలకు రూ.30 మాత్రమే అదనపు ఖర్చు

గ్యాస్‌ ధర భరించలేనంతదేమీ కాదు

పేదల భూములను లాక్కునేందుకే ధరణి

ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్‌

సంజయ్‌ షాక్‌.. ప్రజలకు సర్దిచెప్పే యత్నం


యాదాద్రి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో పాదయాత్ర నిర్వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంగళవారం అనూహ్య పరిణామం ఎదురైంది. గ్యాస్‌ ధరలను తగ్గించే పార్టీకే ఓటేస్తామని తాళ్ల సింగారం గ్రామస్తులు తేల్చి చెప్పడంతో ఆయన షాక్‌ అయ్యారు. పాదయాత్రలో భాగంగా సంజయ్‌ తాళ్ల సింగారంలో ‘చాయ్‌ పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. ‘గ్యాస్‌ ధరలను తగ్గించిన పార్టీకే ఓటేస్తాం’ అని ముక్త కంఠంతో అన్నారు. నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై భారం పడకుండా కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సంజయ్‌ స్పందిస్తూ.. గ్యాస్‌ విషయంలో ప్రజలపై పెద్దగా భారం పడటం లేదని చెప్పారు. నెలకు కేవలం రూ.30 మాత్రమే అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లనే గ్యాస్‌ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. 


బీజేపీ వస్తే.. ఎవరి భూములు వాళ్లకే

పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్‌ ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చారని బండి సంజయ్‌ ఆరోపించారు. రైతు సమస్యలపై లింగోజీగూడెంలో ఆయన రచ్చబండ నిర్వహించారు. ధరణితో రెవెన్యూలో అవినీతి మరింత పెరిగిందని, ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని గ్రామస్తులు సంజయ్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబం పేదల భూములను లాక్కోవడం కోసమే ధరణిని తెచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరి భూములను వారికి పంచుతామని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్‌ బొక్కేస్తున్నారని, ఆ కారణంగానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు రావడం లేదన్నారు. మునుగోడులో ఓటుకు రూ.30వేలు ఇస్తున్నారని, కేసీఆర్‌ పంపిన డబ్బులు తీసుకొని.. ఓటు మాత్రం నచ్చిన వాళ్లకే వేయాలని కోరారు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మంగళవారంతో 80 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని సంజయ్‌ తాళ్లసింగారం పాదయాత్ర శిబిరం వద్ద మహాత్మాగాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకొన్నారు. ఈ నెల 13న అందరి ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, 14న స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రపరచాలని పిలుపునిచ్చారు..


బండి సంజయ్‌తో రాజగోపాల్‌ రెడ్డి భేటీ 

బండి సంజయ్‌తో మంగళవారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. భోజన విరామ సమయంలో అంకిరెడ్డిపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద సంజయ్‌ను కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం మునుగోడు నియోజవర్గంలో పూర్తైన నేపథ్యంలో.. పాదయాత్రను పొడిగించాలని రాజగోపాల్‌ రెడ్డి సంజయ్‌ను కోరారు. అయితే, యాత్రను ముందుగానే ప్రణాళిక చేసినందుకు మునుగోడులో యాత్ర పొడిగింపు కుదరదని సంజయ్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. బహిరంగ సభను మునుగోడు, చండూరులో ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై చర్చించారు. చివరకు మునుగోడులోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-08-10T09:18:17+05:30 IST