ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం

ABN , First Publish Date - 2022-07-11T08:04:18+05:30 IST

ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం

ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం

ఏపీని రక్షించే బాధ్యత తీసుకుంటాం 

దౌర్జన్యాలు, దోపిడీలు చేసేది.. ప్రజల్ని వేధించి, హింసించేది మీరు 

కౌరవ లక్షణాలున్న మీరు మమ్మల్ని అంటారా? 

జనసేనను అసెంబ్లీ గేటు తాకనివ్వరా?

అలాంటి బీరాలు పలకొద్దు.. కాలం మారింది...

జనసేన కోసం జనం ఎదురుచూస్తున్న కాలమిది

మమ్మల్నెవరూ ఆపలేరు.. పేదల జోలికొస్తే తోలు తీస్తా

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌


అమరావతి/విజయవాడ, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘‘మాకు లక్ష కోట్ల సంపద లేదు. కోకొల్లలుగా కేసులు లేవు. సిమెంట్‌ ఫ్యాక్టరీలు లేవు. ఒక్కసారి కూడా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టలేదు. మరి ఎందుకు మీరు మమ్మల్ని కౌరవులతో పోలుస్తారు?’’ అని వైసీపీ నేతలను జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. ఆదివారం విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘దౌర్జన్యాలు, దోపిడీలు చేసేది మీరు. ప్రజల్ని వేధించేది, హింసించేది మీరు. కౌరవుల లక్షణాలు ఉన్న మీరు మమ్మల్ని అనడం దారుణం. జనసేన పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బింకాలు పలకొద్దు. ఇది మారిన కాలం. జనసేన కోసం జనం ఎదురుచూస్తున్న కాలం. మీరు ఎవరూ మామ్మల్ని ఆపలేరు’’ అంటూ వైసీపీ నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ఏపీని కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటాం. సమాజంలో అరాచకాలు చేసేవారు 25 మంది ఉంటే వారిని చూసి భయపడేవారు వేలల్లో ఉంటున్నారు. అలా భయపడే వారిలో ధైర్యం నింపడానికి నేను ముందుకొచ్చాను. ఈ ప్రయాణంలో పూర్తిగా దహించుకుపోవడానికి నేను సిద్ధం. కానీ ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరి గుండెల్లో బలమైన ధైర్యం మాత్రం నింపుతాను. ఇప్పుడు నా వద్దకు వచ్చిన సమస్యలన్నీ ప్రభుత్వం నెరవేర్చాల్సినవే. వారు చొరవ తీసుకోకపోవడంతోనే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడకు వచ్చారు. మీ ప్రభుత్వం బాగుంటే వరుసగా రెండో ఆదివారం కూడా 400కు పైగా పిటిషన్లు మా వద్దకు ఎందుకొస్తాయి?’’ అంటూ పవన్‌ ప్రశ్నించారు. ‘‘ఉమ్మడి ఏపీలో దశాబ్దంన్నర పాటు ఆంధ్రులను దోపిడీదారులు అంటూ రకరకాలుగా తెలంగాణ వారు తిట్టారు. వారికి బలమైన ప్రాంతీయ భావన అక్కడ పని చేసింది. ఆంధ్రాలో అసలు మేం ఆంధ్రులం అన్న భావన లేదు. ఇక్కడ కుల భావన తప్ప.. ఆంధ్రా భావన పూర్తిగా లేదు. పోనీ కులభావన పూర్తిస్థాయిలో పాటిస్తున్నారా అంటే అదీ లేదు. సొంత కులం వారిని తిట్టుకుంటూ, ప్రభువుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏ కులం నాయకులను ఆ కులం వారితోనే తిట్టించడం పెద్ద గొప్ప విషయంగా మారిపోయింది.’’ అని పవన్‌ అన్నారు. వెంట్రుక పీకలేరంటూ ప్లీనరీ సమయంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పవన్‌ చమత్కరించారు. ‘‘కేశ సంపద చాలా విలువైంది. దాన్ని ప్రతిసారి పీక్కోకండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజావేదికల్లో మాట్లాడాల్సింది పోయి.. ప్రతిసారి మీరు మీ కేశాలకు పని చెబితే ప్రజలే త్వరలో వాటిని పూర్తిస్థాయిలో పీకే పనిలో ఉంటారు.’ అంటూ హెచ్చరించారు. 


కేంద్రాన్ని చూస్తే వైసీపీ సాష్టాంగమే

కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే అధికార పార్టీలకు సాష్టాంగం గుర్తుకొస్తుందని పవన్‌ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం భావోద్వేగాలతో కూడుకున్నదని, దీనిపై కచ్చితంగా మాట్లాతానని చెప్పారు. విశాఖలో కొండలు మింగేస్తారని తాను ఏనాడో చెప్పానన్నారు. యథా రాజా.. తథా ప్రజా అన్నట్టుగా వైసీపీ పాలన సాగుతోందన్నారు. పేదల జోలికి వస్తే తోలుతీస్తానని పవన్‌ హెచ్చరించారు. ‘‘తెలంగాణలో విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా అక్కడి ప్రభుత్వం మార్చింది. వారికి నెలకు రూ.30వేల వేతనాన్ని నిర్ణయించింది. అటువంటిది ఏపీలో ఎందుకు చేయలేకపోతున్నారు’’ అని పవన్‌ ప్రశ్నించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను జనసేన తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మూడో విడత జనవాణి కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 17న నిర్వహిస్తామని పవన్‌ చెప్పారు. 


‘‘సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అన్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలు త్వరలోనే ఏపీలో నిజం కాబోతున్నాయి. వైసీపీ నాయకుల దాష్టీకాలు, దౌర్జన్యాలు చూసి ప్రజలే వారిని సింహాసనం దించే సమయం దగ్గర పడుతోంది. 

పేదల గుండెల్లో నిలిచిపోవాలంటే ఒక కులం నుంచో, మతం నుంచో రావాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా వారికి సహయం చేయాలి. వంగవీటి మోహన్‌ రంగా పేరు ఇప్పటికీ మార్మోగుతోంది. ఆయన పేదలకు చేసిన సహాయం గొప్పది. పేదల కోసం ఆయన తపించిన తీరు వారి గుండెల్లో ఉండిపోయింది. 

వైసీపీ నాయకుల దాష్టీకాలను తట్టుకోవ డానికి సిద్ధంగా ఉన్నా. తిరగబడే మైండ్‌ సెట్‌ లేకపోతే ఈ దోపిడీ దౌర్జన్యకాండ ఇలాగే సాగుతుంది. పవన్‌ కల్యాణ్‌ ఒక్కడే తెగిస్తే సరిపోదు. మీలో నాయకులు, నాయకురాళ్లు పుట్టాలి. కామన్‌ మినిమం ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాలనను ఎదిరించే బాధ్యతను అంతా తీసుకోవాలి. 

Updated Date - 2022-07-11T08:04:18+05:30 IST